Rajahmundry: రాజమండ్రిలో సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద కాంగ్రెస్ ధర్నా!

Rajahmundry: రాజమండ్రిలో సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి, సీఈసీని తొలగించాలని డిమాండ్ చేస్తూ మెమోరాండం సమర్పించారు.

RAGHAVENDRA, RAJUMUNDRY CITY
Published on: 30 Sept 2026 4:03 PM IST
Rajahmundry
X

Rajahmundry: రాజమండ్రిలో సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద కాంగ్రెస్ ధర్నా!

Rajahmundry: ఎన్నికల కమిషన్ పనితీరు, ఓటర్ల జాబితాల సవరణ ప్రక్రియలో చోటుచేసుకున్నాయని ఆరోపిస్తున్న అవకతవకలపై సమగ్ర దర్యాప్తు జరపాలని, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్వర్ కుమార్‌ను తక్షణమే పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ బుధవారం స్థానిక సబ్‌ కలెక్టర్ కార్యాలయం వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా, ర్యాలీ నిర్వహించారు. అనంతరం రాష్ట్రపతిని ఉద్దేశించి సబ్‌ కలెక్టర్‌కు మెమోరాండం సమర్పించారు.

ధర్నా అనంతరం జిల్లా కాంగ్రెస్ పార్లమెంటరీ కోఆర్డినేటర్ టీ.కే. విశ్వేశ్వర్ రెడ్డి, రాజమండ్రి అర్బన్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు బాలేపల్లి మురళీధర్, ఏపీ కిసాన్ కాంగ్రెస్ సెల్ చైర్మన్ కామాని ప్రభాకర్ రావు, రాష్ట్ర సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు ఆకుల భాగ్యలక్ష్మి మాట్లాడుతూ ఎన్నికల కమిషన్‌పై వచ్చిన ఆరోపణలన్నింటిపై నిష్పక్షపాతంగా సమగ్ర విచారణ జరిపించాలని కోరారు. ఓటర్ల జాబితాల సవరణ పేరుతో అర్హులైన ఓటర్ల పేర్లు తొలగించకుండా వారి ఓటు హక్కును పరిరక్షించాలని డిమాండ్ చేశారు. SIR ప్రక్రియలో పెద్ద సంఖ్యలో ఓటర్ల పేర్లు తొలగించబడ్డాయన్న అంశంపై పూర్తిస్థాయి పరిశీలన అవసరమని పేర్కొన్నారు.

ఎన్నికల కమిషనర్ల నియామక ప్రక్రియ, ఎన్నికల సంఘం స్వతంత్రతపై కూడా కాంగ్రెస్ నాయకులు ప్రశ్నలు లేవనెత్తారు. ఎన్నికల సంఘం ఏ రాజకీయ ప్రభావానికీ లోనుకాకుండా స్వతంత్రంగా, పారదర్శకంగా పనిచేసేలా వ్యవస్థలో తగిన మార్పులు తీసుకురావాలని కోరారు. ఎన్నికల సంఘంలోని సభ్యుల మధ్య భిన్నాభిప్రాయాలు, నిర్ణయాలపై వచ్చిన వార్తలను కూడా పరిగణనలోకి తీసుకుని వాస్తవాలను ప్రజల ముందుంచాలని అన్నారు.

కేంద్ర ప్రభుత్వంలోని దర్యాప్తు సంస్థలు, ఎన్నికల సంఘం వంటి రాజ్యాంగబద్ధ సంస్థల పనితీరుపై కూడా కాంగ్రెస్ నాయకులు విమర్శలు చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థను, ఓటు హక్కును కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు. ఓటర్ల జాబితాల నుంచి పేర్లు తొలగించినట్లయితే, అర్హత ఉన్న ప్రతి ఓటరుకు తిరిగి ఓటు హక్కు కల్పించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా ఓటు హక్కు పరిరక్షణ కోసం కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని నాయకులు తెలిపారు. రాజమహేంద్రవరంలో నిర్వహించిన ధర్నా, ర్యాలీలో పీసీసీ ఉపాధ్యక్షులు మార్టిన్ లూథర్, కొవ్వూరు టౌన్ ప్రెసిడెంట్ బచ్చు బుజ్జిబాబు, జిల్లా డాక్టర్ సెల్ చైర్మన్ రాజశేఖర్, రాష్ట్ర మైనారిటీ సెల్ ప్రధాన కార్యదర్శి సింధియా రాణి, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మోత శారద, అర్బన్ బీసీ సెల్ చైర్మన్ తాడి సూరిబాబు, అనపర్తి ఇన్‌చార్జి గుండ్రపు ఏసు, బిక్కవోలు మండల ఇన్‌చార్జి కొల్లి చిన్న, నిడదవోలు కోఆర్డినేటర్ ఎం. భద్రం దొర, బర్రె సుబ్రహ్మణ్యం, ఎం.డి. ఆలీ, మురళీకృష్ణ, యాళ్ల వీరభద్రరావు, లలిత, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం సబ్‌ కలెక్టర్‌కు మెమోరాండం అందజేశారు.

RAGHAVENDRA, RAJUMUNDRY CITY

RAGHAVENDRA, RAJUMUNDRY CITY