Alamuru: పరిశుభ్రతతోనే ఆరోగ్య సమాజం: ఎమ్మెల్యే బండారు సత్యానందరావు
Alamuru: ఆలమూరులో నిర్వహించిన స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పాల్గొని చెత్త నుంచి సంపద సృష్టిపై దిశానిర్దేశం చేశారు.
Alamuru: పరిశుభ్రతతోనే ఆరోగ్య సమాజం: ఎమ్మెల్యే బండారు సత్యానందరావు
Alamuru: మన ఇల్లు, కార్యాలయాన్ని శుభ్రంగా ఉంచుకున్నట్లే మన గ్రామం, పట్టణాన్ని కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. శనివారం ఆలమూరు గ్రామంలో జరిగిన స్వచ్చంధ్ర స్వర్ణంధ్ర కార్యక్రమంలో అయన పాల్గొన్నారు.పరిశుభ్రమైన పరిసరాలతోనే ఆరోగ్యకరమైన సమాజం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. రోడ్లపై చెత్త పేరుకుపోయే వరకు వేచి చూడకుండా ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.
డ్రైనేజీల్లో చెత్త వేయొద్దు
డ్రైనేజీల్లో చెత్త పేరుకుపోవడం వల్ల మురుగు నీరు నిలిచి దోమలు వృద్ధి చెందుతాయని, తద్వారా అనేక అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని తెలిపారు. వ్యాధులు వచ్చిన తర్వాత అధిక మొత్తంలో ఖర్చు చేయడం కంటే ముందుగానే పరిశుభ్రతపై దృష్టి పెట్టడం ఎంతో ముఖ్యమన్నారు.
గ్రామాలు, పట్టణాల పరిశుభ్రతకు ప్రాధాన్యం
ప్రతి ఇంటికి మరుగుదొడ్డి ఉండటంతో పాటు గ్రామాలు, పట్టణాలు పరిశుభ్రంగా ఉండేలా ప్రజలు బాధ్యత తీసుకోవాలని సూచించారు. పశువుల వ్యర్థాలు, మానవ వ్యర్థాలు, ప్లాస్టిక్‌ను ఇష్టానుసారంగా పడేయకుండా తగిన విధంగా నిర్వహించాలన్నారు.
ప్లాస్టిక్ నియంత్రణతో పర్యావరణ పరిరక్షణ
ప్లాస్టిక్ భూమిలో కలవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంచాలని కోరారు. ప్రతి ఒక్కరికీ పరిశుభ్రమైన నీరు, ఆరోగ్యకరమైన వాతావరణం అందేలా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు.అలాగే పిల్లలకు స్టీల్ వాటర్ బాటిల్ ను పంపిణి చేశారు.
చెత్త నుంచి సంపద సృష్టి
సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్‌లో భాగంగా చెత్తను ఎప్పటికప్పుడు సేకరించి తడి, పొడి చెత్తను వేరు చేయాలని సూచించారు. ప్లాస్టిక్, గాజు, కాగితం తదితర వ్యర్థాలను విడివిడిగా సేకరించి రీసైక్లింగ్ చేయడం ద్వారా చెత్తను సంపదగా మార్చవచ్చన్నారు. చెత్త నుంచి విద్యుత్, గ్యాస్‌తో పాటు సేంద్రియ ఎరువుల తయారీని ప్రోత్సహించాలని తెలిపారు.
స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ద్వారా గ్రామాలకు అవసరమైన పరికరాలు, వనరులు అందిస్తూ పరిశుభ్రతను మెరుగుపరిచే చర్యలు చేపడుతున్నారని పేర్కొన్నారు. చెత్తను కిలోల వారీగా సేకరించి, వేరు చేసి, పునర్వినియోగం చేసే విధానాన్ని ప్రజలు అలవాటు చేసుకోవాలని సూచించారు.
పరిశుభ్రమైన ఇల్లు మాత్రమే కాదు.. పరిశుభ్రమైన ఊరు కూడా మన బాధ్యత అని ప్రతి ఒక్కరూ గుర్తించి స్వచ్ఛాంధ్ర సాధనలో భాగస్వాములు కావాలి.




