Chintur: ఐటీడీఏ ముట్టడించిన పోలవరం నిర్వాసితులు సీపీఎం ఆధ్వర్యంలో ఆందోళన

Chintur: పోలవరం నిర్వాసితుల సమస్యల పరిష్కారం కోరుతూ సీపీఎం ఆధ్వర్యంలో చింతూరు ఐటీడీఏ ముట్టడి. 13 డిమాండ్లతో పీవోకు వినతిపత్రం అందజేత.

RAJESH REDDY, CHINTOOR
Published on: 5 Oct 2026 7:57 PM IST
Chintur
X

Chintur: ఐటీడీఏ ముట్టడించిన పోలవరం నిర్వాసితులు సీపీఎం ఆధ్వర్యంలో ఆందోళన

చింతూరు: పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యల పరిష్కారానికై ఎర్రదండు కదం తొక్కింది.పునరావాసం పూర్తికాకుండా పోలవరం ప్రాజెక్టు ప్రారంభించలేరని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.విలీన మండలాల్లోని పోలవరం నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలంటూ సిపిఎం ఆధ్వర్యంలో ఐదు రోజులపాటు విలీన మండలాల్లో బైక్ ర్యాలీ చేపట్టారు. సోమవారం సిపిఎం ఆధ్వర్యంలో పోలవరం నిర్వాసితులతో చింతూరు ఐటీడీఏ ను ముట్టడించారు.

ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ పోలవరం నిర్వాసితుల సమస్యలను పరిష్కరించాలంటూ పాదయాత్రలు,బహిరంగ సమావేశాలు,ప్రభుత్వ కార్యాలయాలు ముట్టడి, నిరసన కార్యక్రమాలు చేపట్టిన ప్రభుత్వం నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరించడం చాలా బాధాకరమన్నారు. పోలవరం ప్రాజెక్టు వలన నిర్వాసితులవుతున్న ఏ ఒక్కరికి అన్యాయం జరిగిన సిపిఎం వారికి అండగా ఉండి ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. ఆర్ అండ్ ఆర్ కార్యాలయం ధవలేశ్వరంలో కాకుండా చింతూరులో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.పోలవరం నిర్వాసితులకు పూర్తిస్థాయి పరిహారం,ఆదివాసి పోడు భూములకు పట్టాలు తక్షణమే అందజేయాలి

లేకుంటే ఐక్యపోరాటాలతోనే సాధిస్తాం అని అన్నారు.పోలవరం ప్రాజెక్టు ప్రభావంతో ముంపుకు గురవుతున్న విలీన మండలాల నిర్వాసితులకు ఖచ్చితమైన పునరావాసం ప్యాకేజీ ప్రభుత్వం వెంటనే కల్పించాలని,ఇదే క్రమంలో ఆదివాసీలు పూర్వం నుండి సాగు చేసుకుంటున్న పోడు భూములకు పట్టాలు అందజేయాలని కోరారు.2013 భూ సేకరణ చట్టం ప్రకారం ఆదివాసీలకు పోడు భూములకు పట్టాలు ఐదు ఎకరాలకు గాను 10 ఎకరాలు ఇవ్వాల్సి ఉండగా ప్రభుత్వాలు అమలు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని అటవీ హక్కుల చట్టానికి తూట్లు పొడిచి ఆదివాసీలకు తీవ్రని నష్టం చేస్తున్నారని అన్నారు.

జీవో నెంబర్ 3 అమలు చేయకుండా డీఎస్సీ ని ప్రకటించవద్దని అధికారంలో రాకముందు కూటమి ప్రభుత్వం జీవో నెంబర్ 3కు ప్రత్యామ్నాయంగా మరో జీవో తెస్తామని చెప్పి రెండున్నర సంవత్సరాలు అవుతున్న కానీ నేటికీ ఆ ఊసే లేదన్నారు.పోలవరం నిర్వాసితులకు కుక్కునూరు,వేలేరుపాడు. చింతూరు డివిజన్లోని నాలుగు మండలాలు సహా ఏడు మండలాలకు చెందిన 1,50,000 మంది నిర్వాసితులకు పునరావాసం విషయంలో ప్రభుత్వం 2022 కాంటూరు లెక్కలు చెబుతూ కాకి లెక్కలుగా మార్చిందని లాడార్ సర్వేతో ప్రజలను మభ్యపెట్టి ముంపు ఉన్నచోట లేనట్లు ముంపు లేని చోట్ల ముంపు ఉన్నట్లు సర్వేలు చేసి పోలవరం నిర్వాసిత ప్రజానీకానికి నిలువునా ముంచిందన్నారు.

అనంతరం ఐటిడిఏ పిఓ నరేంద్ర పడాల్ కు 13 డిమాండ్స్ తో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు.తన పరిధిలో ఉన్న వాటిని తక్షణమే పరిష్కరిస్తానని ప్రభుత్వం చేయాల్సిన పనులకు తాను ప్రత్యేకించి వినతిపత్రంలో ఉన్న సమస్యలను పూర్తిగా వివరించి సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు.దీంతో ఆందోళనకారులు ఆందోళనను విరమించారు.ఈ కార్యక్రమంలో సీపీఎం కేంద్రకమిటీ సభ్యులు లోకనాదం,జిల్లా కార్యదర్శి బొప్పెనా కిరణ్,గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు లోతరామారావు,జిల్లా కార్యవర్గ సభ్యులు సున్నం రాజులు,మడకం నాగమణి, పల్లపు వెంకట్,సీసం సురేష్,పులి సంతోష్ కుమార్,యర్రంశెట్టి శ్రీనివాస్,పూనెం ప్రదీప్,వేక రాజ్ కుమార్, ముర్రం లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

RAJESH REDDY, CHINTOOR

RAJESH REDDY, CHINTOOR