Chintoor: తులసిపాకలో నడిరోడ్డున ఆగిన డొక్కు బస్!
Chintoor: చింతూరు తులసిపాక వద్ద నడిరోడ్డుపై ఆగిపోయిన డొక్కు ఆర్టీసీ బస్సు. ఏజెన్సీ ప్రాంతానికి ఫిట్‌నెస్ లేని బస్సులు పంపడంపై ప్రయాణికుల తీవ్ర ఆగ్రహం.
Chintoor: తులసిపాకలో నడిరోడ్డున ఆగిన డొక్కు బస్!
Chintoor: చింతూరు తులసిపాక సోమవారం ఉదయం 6 గంటలు. చింతూరు నుంచి బయలుదేరిన బస్సు తులసిపాక చేరగానే "ఢమ్" అని క్లచ్ వదిలేసింది. బస్సు అక్కడే శవంలా నిలబడిపోయింది. డ్రైవర్ స్టీరింగ్ వదిలేసి కండక్టర్ చేతులు పిసుక్కుంటూ ప్రయాణికులు మాత్రం రోడ్డు పక్కన నిస్సహాయంగా దిక్కుతోచని స్థితిలో అయోమయం గా మరో వాహనం కోసం ఎదురు చూడటం.
ఇది బస్సు ఆగిపోవడం కాదు... ఆర్టీసీ నిర్లక్ష్యం నడిరోడ్డు మీద నగ్నంగా నిలబడిపోవడం !
ఇదే బస్సు క్లచ్ ఘాట్ రోడ్డులో ప్రయాణించేటప్పుడు వదిలేస్తే బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికుల పరిస్థితి ఏంటో ఊహించుకుంటేనే వణుకు పుడుతుంది.ఏజెన్సీ అంటే ఆర్టీసీ అధికారులకు అలుసా? పట్నంలో తిరగలేని, స్క్రాప్ కు పనికొచ్చే డొక్కు బస్సులన్నీ మన ఏజెన్సీకేనా? బ్రేకులు పడవు, క్లచ్ పనిచేయదు, సీట్లు విరిగిపోయి ఉంటాయి.
ఇలాంటి బస్సుల్లో ప్రజల ప్రాణాలు పెట్టి పంపడానికి మీకు చేతులెలా వస్తున్నాయి అని ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.దారుణం ఏంటంటే బస్సులు క్యాన్సిల్ చేస్తే కనీసం ఒక మాట చెప్పరు.రాజమండ్రి నుంచి బస్ వస్తుందని నమ్మి, తెల్లవారుజామునే బస్ స్టాప్ కు వచ్చే పేద ప్రయాణికుడి పరిస్థితి ఏంటి? వాడికి ఫోన్ చేసి చెప్పే దిక్కు లేదు, అడిగే దిక్కు లేదు.
గంటలు గంటలు ఎదురుచూసి, చివరికి నిరాశతో వెనక్కి వెళ్లాలా ఎప్పుడో ఒక బస్సు వస్తే కిక్కిరిసిన బస్సులో, ఒంటి కాలిపై నిలబడి, 100 కిలోమీటర్లు ప్రయాణం చేయడం అంటే నరకం కాదా? వృద్ధ తల్లి, పసి బిడ్డతో వచ్చే తల్లి, పరీక్షకు వెళ్లే విద్యార్థి అందరి బాధ ఒక్కటే.అధికారులారా ఏసీ రూముల్లో కూర్చుని లెక్కలు చూడటం కాదు, ఒక్కరోజు ఈ డొక్కు బస్సులో నిలబడి ప్రయాణించి చూడండి. అప్పుడు తెలుస్తుంది ఏజెన్సీ ప్రజల బాధ ఏంటో.ఇప్పటికైనా మేల్కోండి డొక్కు బస్సులను వెంటనే పక్కన పెట్టండి. కొత్త బస్సులు వేయండి. క్యాన్సిల్ అయితే ముందే ప్రకటించండి. లేకపోతే ప్రజాగ్రహం తప్పదు అని ప్రయాణికులు హెచ్చరిస్తున్నారు.




