Chintoor: ఒడిశా నుంచి సిలేరు నది దాటించి కబేలాలకు మూగజీవాల తరలింపు!
Chintoor: పోలవరం జిల్లా చింతూరు ఏజెన్సీలోని కొత్తపల్లి, వేములరాయి, నేలకోట కేంద్రంగా ఒడిశా నుంచి సిలేరు నది దాటించి గోవులను అక్రమంగా కబేలాలకు తరలిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
Chintoor: ఒడిశా నుంచి సిలేరు నది దాటించి కబేలాలకు మూగజీవాల తరలింపు!
చింతూరు: చింతూరు ఏజెన్సీలోని కొత్తపల్లి, వేములరాయి, నేలకోట.. ఈ మూడు గ్రామాలు ఇప్పుడు గోవుల స్మగ్లింగ్‌కు కేంద్ర బిందువులుగా మారిపోయాయన్న ప్రచారం ఏజెన్సీని కుదిపేస్తోంది. ఒడిశా రాష్ట్రం నుంచి సిలేరు నదిని దాటించి, గోవులను మందలు మందలుగా ఆంధ్రాలోకి తోలుకొస్తున్నారట. సీలేరు నది ఒడ్డున జరిగే ఈ అక్రమ తరలింపు చూస్తే.. ఏదో సినిమా షూటింగ్ చూస్తున్నట్లు ఉంటుందని పలువురు చెబుతున్నారు.
నది దాటిన గోవులను ఏజెన్సీ అడవుల్లోని, రహస్య ప్రదేశాల్లో తాళ్లు వేసి కట్టేస్తారట. తినడానికి మేత లేదు.. తాగడానికి నీరు లేదు. ఆకలితో అంబా అని అరుస్తున్న మూగజీవాల ఆర్తనాదాలు వింటే అయ్యో పాపం అని అనాల్సిందే.
ఇక రాత్రి 8 దాటిందంటే చాలు.. మాఫియా ఆపరేషన్ షురూ. లారీల్లో గోవులను కాళ్లు కట్టేసి, ఒకదానిపై ఒకటి పడేసి, గోనె సంచులు కప్పి కబేలాల వైపు దూసుకుపోతారు. ఒక్కో లారీ వెనుక లక్షల రూపాయల లావాదేవీలు.. నెలకి కోట్ల రూపాయల వ్యాపారం. మూగజీవాల ప్రాణాల మీద మాఫియా బంగారు భవనాలు కట్టుకుంటోందని పలువురు మండిపడుతున్నారు.
అధికారుల తీరుపై కూడా ప్రజల్లో అనుమానాలు ముసురుకుంటున్నాయి. రోజూ ఇన్ని లారీలు వెళ్తుంటే చెక్‌పోస్టుల్లో ఎవరూ ఆపరా? గస్తీ పోలీసులు ఏం చేస్తున్నారు? అన్న ప్రశ్నలకు సమాధానం లేదు. డబ్బు ముందు చట్టం మోకరిల్లిందా అని జనం నిలదీస్తున్నారు.
ఇక గోరక్షణ పేరుతో జెండాలు పట్టుకుని తిరిగే హిందూ సంఘాల నాయకులపైనా పలువురు విరుచుకుపడుతున్నారు. గోమాతను పూజిస్తామని చెప్పుకునే వాళ్లు.. గోమాత కబేలాలకు తరలిపోతుంటే ఎందుకు కళ్లు మూసుకున్నారని ఘాటుగా ప్రశ్నిస్తున్నారు. మైకుల ముందు మాత్రమే గోరక్షణా? చేతల్లో ఎందుకు లేదని నిలదీస్తున్నారు.
మూగజీవాలు మాట్లాడలేవు.. కానీ వాటి కన్నీళ్లు ఊరికే పోవు. జిల్లా ఉన్నతాధికారులు ఇప్పటికైనా కళ్లు తెరిచి, ప్రత్యేక టీమ్‌లతో దాడులు చేసి, ఈ రక్తపు వ్యాపారానికి అడ్డుకట్ట వేయకపోతే.. ఏజెన్సీలో మాఫియా రాజ్యం శాశ్వతమైపోతుందని ప్రజలు హెచ్చరిస్తున్నారు.
గోవుల అక్రమ తరలింపుపై ఉక్కుపాదం మోపుతారా? లేక మాఫియా ముందు మోకరిల్లుతారా? జిల్లా యంత్రాంగం ఏం చేస్తుందో చూడాలి అని పలువురు మాట్లాడుకుంటున్నారు.




