Kothapeta: కొత్తపేట మండలం కండ్రిగలో ఇంటింటికీ వెళ్లి పింఛన్లు అందజేత!

Kothapeta: కొత్తపేట మండలం కండ్రిగలో ఏపీ బీసీ కార్పొరేషన్ చైర్మన్ రెడ్డి అనంత కుమారి స్వయంగా ఇంటింటికీ తిరిగి ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ.

TRIMURTULU, KOTHAPETA
Published on: 1 Oct 2026 12:24 PM IST
Kothapeta
X

Kothapeta: కొత్తపేట మండలం కండ్రిగలో ఇంటింటికీ వెళ్లి పింఛన్లు అందజేత!

Kothapeta: సంక్షేమ పథకాలను ప్రజల ముంగిటకే తీసుకెళ్లాలనే లక్ష్యంతో కొత్తపేట మండలంలోని కండ్రిగ కాలనీలో పింఛన్ల పంపిణీ కార్యక్రమం గురువారం ఘనంగా నిర్వహించారు. ఏపీ బీసీ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ రెడ్డి అనంత కుమారి ముఖ్య అతిథిగా పాల్గొని, ఉదయాన్నే గ్రామంలో పర్యటిస్తూ లబ్ధిదారుల ఇళ్లకు స్వయంగా వెళ్లి పింఛన్లను అందజేశారు.

గ్రామంలోని వృద్ధులు, వితంతువులు, ఇతర అర్హులైన లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లిన చైర్మన్ రెడ్డి అనంత కుమారి, వారి యోగక్షేమాలను ఆప్యాయంగా అడిగి తెలుసుకున్నారు. పింఛన్ల పంపిణీ ప్రక్రియ, లబ్ధిదారులకు ఎదురవుతున్న సమస్యలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్న తీరును క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

ఈ సందర్భంగా రెడ్డి అనంత కుమారి మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం పేదలు, వృద్ధులు, వితంతువులు, అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ ఫలాలు అందించేందుకు ప్రాధాన్యత ఇస్తోందన్నారు.

పింఛన్ల పెంపుతో పాటు అర్హులైన లబ్ధిదారులకు ప్రతి నెల మొదటి తేదీనే ఇంటి వద్ద పింఛన్ అందించే విధానం ద్వారా ప్రభుత్వం ప్రజలకు మరింత చేరువైందన్నారు. సంక్షేమ పథకాల ప్రయోజనాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ పారదర్శకంగా అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు.

“ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి లేకుండా.. సంక్షేమ ఫలాలను నేరుగా ప్రజల ఇంటి వద్దకే తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యం” అని ఆమె పేర్కొన్నారు.

లబ్ధిదారుల ఇళ్లకు స్వయంగా వచ్చి పింఛన్లు అందజేయడంతో పాటు వారి సమస్యలను అడిగి తెలుసుకున్న చైర్మన్ రెడ్డి అనంత కుమారికి గ్రామంలోని వృద్ధులు, లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వం తమ ఇంటి వద్దకే వచ్చి సంక్షేమ పథకాల ప్రయోజనాలను అందించడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు గ్రామ మాజీ ఉప సర్పంచ్ కడలి పార్ధ సారధి,వాసంశెట్టి శ్రీనివాసరావు, చోడే రాజా రమేష్, దూనబోయిన అప్పారావు కార్యకర్తలు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, గ్రామ పెద్దలు, లబ్ధిదారులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

TRIMURTULU, KOTHAPETA

TRIMURTULU, KOTHAPETA