Rajahmundry: ఘనంగా బీఎంపీ అసోసియేషన్ 40 వసంతాల వేడుకలు

Rajahmundry: రాజమండ్రి ఆర్కా ఆసుపత్రి ప్రాంగణంలో బేసిక్ మెడికల్ ప్రాక్టీషినర్స్ అసోసియేషన్ (బీఎంపీ) 40 వసంతాల వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు.

RAGHAVENDRA, RAJUMUNDRY CITY
Published on: 29 Sept 2026 9:30 PM IST
Rajahmundry
X

Rajahmundry: ఘనంగా బీఎంపీ అసోసియేషన్ 40 వసంతాల వేడుకలు

రాజమండ్రి: ది బేసిక్ మెడికల్ ప్రాక్టీషినర్స్ అసోసియేషన్ 40 వసంతాల వేడుకలు రాజమహేంద్రవరం హౌసింగ్ బోర్డు ఎదురుగా ఉన్న ఆర్కా ఆసుపత్రి ఆవరణలో మంగళవారం ఘనంగా జరిగాయి. బిఎంపి అసోసియేషన్ వ్యవస్ధాపక అధ్యక్షుడు డాక్టర్ లంక సత్యనారాయణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రముఖ పల్మనాలజిస్టు, ఆర్కా ఆసుపత్రి అధినేత డాక్టర్ మొల్లేటి రామ్మోహన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా ముఖ్య అతిధులు, అసోసియేషన్ ప్రతినిధులు జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్బంగా డాక్టర్ మొల్లేటి రామ్మోహన్ మాట్లాడుతూ తాను చాలా కాలంగా రాజమండ్రి నగరంలో వైద్యుడిగా ప్రాక్టీస్ చేసానని, పేద, మధ్య తరగతి ప్రజలకు ఆధునాతన వైద్య సేవలను అందుబాటులోకి తేవాలనే ఉద్దేశ్యంతో ఆర్కా ఆసుపత్రిని ప్రారంభించినట్టు వివరించారు. అందరి సహకారంతో ఈ స్థాయికి ఎదిగానని, ఆర్కా ఆసుపత్రిలో ఆర్ధో, పల్మనాలజీ, నెఫ్రాలజీ తదితర అన్ని ఆధునాతన స్పెషాలిటీ సేవలతో పాటు 50 పడకల ఐసియు, ఐదు ఆపరేషన్ థియేటర్లు, డయాలసిస్ సేవలతో పాటు సిటి, ఎంఆరఐ, అల్ట్రాసౌండ్ స్కానింగ్ కూడా అందుబాటులోకి వచ్చాయని తెలిపారు.

ఈ సేవలను ప్రజలందరూ ఉపయోగించుకునేలా బిఎంపి అసోసియేషన్ సభ్యులు సహాయ సహకారాలు అందించాలని కోరారు. బిఎంపి అసోసియేషన్ అభివృద్ధితో పాటు సభ్యుల సంక్షేమానికి అవసరమైన సహాయ సహకారాలతో పాటు వృత్తి నైపుణ్యం పెంపుదలకు కూడా సహకరిస్తామన్నారు. అసోసియేషన్ వ్యవస్ధాపక అధ్యక్షుడు డాక్టర్ లంక సత్యనారాయణ మాట్లాడుతూ 1986లో స్థాపించిన అసోసియేషన్ అందరి సహకారంతో నేడు ఈ స్థాయికి తీసుకుని వచ్చామని, 2 వేల 500 వరకు సభ్యులుగా ఉన్నారన్నారు.

జగమంత కుటుంబం బిఎంపి అసోసియేషన్ అన్నట్టుగా గ్రామీణ, ప్రాధమిక వైద్యుల వృత్తి గౌరవాన్ని పెంచడానికి కృషిచేస్తున్నామన్నారు. ఎన్నో ఇబ్బందులు, ఆటుపోట్లు ఎదురయ్యాయని, అసోసియేషన్ చీల్చడానికి చేసిన ప్రయత్నాలను కూడా ఎదిరించి అసోసియేషన్‌ను బలోపేతం చేసేందుకు కృషిచేస్తున్నామన్నారు. 40 వసంతాల వేడుకలు కుటుంబ సభ్యులందరితో కలిసి జరుపుకోవడం, దానికి ఆర్కా ఆసుపత్రి అధినేత డాక్టర్ రామ్మోహన్ పూర్తిస్థాయిలో సహాయ సహకారాలు అందించారని కృతజ్ఞతలు తెలిపారు.

త్వరలోనే అసోసియేషన్ భవన నిర్మాణాన్ని కూడా చేపట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని వివరించారు. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా జిఓ నెంబర్ 429 ద్వారా శిక్షణా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని, ఆయన ఆకస్మిక మరణం తరువాత శిక్షణ నిలిచిపోయిందన్నారు. ప్రభుత్వంతో మాట్లాడి మళ్లీ ఆ శిక్షణ పునరుద్ధరించేందుకు కృషిచేస్తున్నామని వివరించారు.

గ్రామీణ, ప్రాధమిక వైద్యుల గౌరవాన్ని పెంచడమే లక్ష్యంగా బిఎంపి అసోసియేషన్ నిరంతరం కృషిచేస్తుందన్నారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్‌కె ఇమామ్ మాట్లాడుతూ బిఎంపి వైద్యులకు రోగులకు వైద్యం అందించే విషయంలో పునశ్చరణ తరగతులు నిర్వహిస్తున్నామని, యాంటీ బయాటిక్స్, స్టెరాయిడ్స్ వంటివి అధికంగా వినియోగించకుండా మంచి వైద్య సేవలు అందించి ప్రజల ప్రాణాలను కాపాడే లక్ష్యంతో అసోసియేషన్ ముందుకు సాగుతుందన్నారు.

దీనికి అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ కొమ్మా శ్రీనివాసరావు, ధవలేశ్వరానికి చెందిన శ్రీరాములు ప్రదర్శించిన మేజిక్ షో విశేషంగా ఆకట్టుకుంది. డాక్టర్ మొల్లేటి రామ్మోహన్‌తో పాటు లంక సత్యనారాయణ, ఆకాశం గౌరీష్‌బాబులను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ఆర్కా ఆసుపత్రి వైద్యుడు డాక్టర్ మణికంఠ, అసోసియేషన్ రాష్ట్ర, జిల్లా నాయకులు పెండెం శ్రీనివాసరావు, కన్నాబత్తుల శ్రీనివాసరావు, పక్కుర్తి సత్యనారాయణ, ఎంవివి సత్యనారాయణ, దబ్బాడ రాంబాబు, కె.మనోహర్, 11 మండలాల నుంచి బిఎంపి అసోసియేషన్ ప్రతినిధులు, ఇతర వైద్యులు పాల్గొన్నారు.

RAGHAVENDRA, RAJUMUNDRY CITY

RAGHAVENDRA, RAJUMUNDRY CITY