Antarvedikara: ఆక్వా చెరువుల్లోకి వ్యర్థాలు.. ఆదుకోవాలని రైతుల వేడుకోలు!

Antarvedikara: సఖినేటిపల్లి మండలం అంతర్వేదికరలో ఓఎన్జీసీ వెల్ డ్రిల్లింగ్ వల్ల మడ్ ఆయిల్ ఆక్వా చెరువుల్లోకి చేరి వేలాది రొయ్యలు మృత్యువాత పడ్డాయి. పరిహారం ఇవ్వాలని రైతులు కోరారు.

PRABHU, RAZOLE
Published on: 12 Nov 2026 3:51 PM IST
Antarvedikara
X

Antarvedikara: ఆక్వా చెరువుల్లోకి వ్యర్థాలు.. ఆదుకోవాలని రైతుల వేడుకోలు!

అంతర్వేదికర: ప్రకృతి వైపరీత్యాలతో ఇప్పటికే తీవ్రంగా నష్టపోయిన ఆక్వా రైతులకు తాజాగా మరో ఎదురుదెబ్బ తగిలింది. సఖినేటిపల్లి మండలం అంతర్వేదికర గ్రామంలో ఓఎన్జీసీ (ONGC) సంస్థ చేపట్టిన నూతన వెల్ డ్రిల్లింగ్ పనుల నేపథ్యంలో మడ్ ఆయిల్ బయటకు వచ్చి సమీపంలోని ఆక్వా చెరువుల్లోకి చేరినట్లు రైతులు ఆరోపిస్తున్నారు. దీంతో చెరువుల్లోని నీరు కలుషితమై వేలాది రొయ్యలు మృత్యువాత పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రొయ్యల సాగు కోసం లక్షలాది రూపాయలు పెట్టుబడులు పెట్టామని, పంట చేతికొచ్చే సమయంలో ఈ పరిణామం తమను తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి నెట్టిందని రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. ప్రకృతి విపత్తుల నుంచి కోలుకోకముందే మరో సమస్య ఎదురుకావడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నామని వాపోతున్నారు.

బాధిత రైతులు బెల్లంకొండ గంగాధర్ రావు, బెల్లంకొండ నాగేశ్వరరావు, బెల్లంకొండ కుమార్ హర్షవర్ధన్, బెల్లంకొండ కేశవరావు, బెల్లంకొండ శ్రీనివాస్, బెల్లంకొండ వాసుదేవరావు, తూము నానాజీ, మేడిచర్ల రామకృష్ణ, తిరుమల శ్రీను, మేడిచర్ల పెద్దిరాజు తదితరులు తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు.

అధికారులు తక్షణమే స్పందించాలి!

ఈ ఘటనపై ఓఎన్జీసీ ఉన్నతాధికారులు, జిల్లా యంత్రాంగం, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలని రైతులు కోరుతున్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి, చెరువుల్లోని నీటిని పరీక్షించి, నష్టానికి గల కారణాలను నిర్ధారించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. జరిగిన నష్టాన్ని అంచనా వేసి బాధిత రైతులకు తగిన పరిహారం అందించి ఆదుకోవాలని కోరుతున్నారు.

PRABHU, RAZOLE

PRABHU, RAZOLE