Malikipuram: ఆపదలో అండగా నిలిచిన స్వచ్ఛంద సంస్థలు.. బాధితులకు భరోసా!

Malikipuram: అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలంలోని తుఫాన్ బాధితులకు కొటక్ బ్యాంకు సహకారంతో సీడ్స్, స్నిర్డ్, మానవతా మూర్తులు సంస్థలు 80 కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశాయి.

PRABHU, RAZOLE
Published on: 13 Nov 2026 3:56 PM IST
Malikipuram
X

Malikipuram: ఆపదలో అండగా నిలిచిన స్వచ్ఛంద సంస్థలు.. బాధితులకు భరోసా!

మలికిపురం: ప్రకృతి విపత్తుతో సర్వస్వం కోల్పోయి, నిలువ నీడ లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న తుఫాన్ బాధిత కుటుంబాలకు స్వచ్ఛంద సంస్థలు అండగా నిలిచాయి. ఆపద సమయంలో తాము ఉన్నామంటూ భరోసా కల్పిస్తూ, బాధిత కుటుంబాలకు అవసరమైన సహాయాన్ని అందించి మానవత్వాన్ని చాటుకున్నాయి.

గత నెల 28వ తేదీన అర్నబ్, మురసు తుఫానుల ప్రభావంతో డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలోని పలు గ్రామాలు తీవ్రంగా అతలాకుతలమయ్యాయి. ప్రచండ గాలులు, భారీ వర్షాల ధాటికి అనేక ఇళ్లు నేలమట్టం కాగా, మరెన్నో నివాస గృహాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. తుఫానులు సంభవించి రోజులు గడుస్తున్నప్పటికీ, కొన్ని గ్రామాల్లో బాధితుల కష్టాలు మాత్రం ఇంకా తొలగిపోలేదు. ఇళ్లు దెబ్బతినడంతో పాటు, నిత్యజీవితానికి అవసరమైన వస్తువులను సైతం కోల్పోయిన అనేక కుటుంబాలు ఇప్పటికీ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.

ఈ పరిస్థితిని గుర్తించిన సీడ్స్, స్నిర్డ్ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు అబ్దుల్, డామిన్ తదితరులు మానవతా మూర్తులు - సామాజిక సేవా సంస్థ అధ్యక్షుడు బోనం రాజు ఆధ్వర్యంలో తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. దెబ్బతిన్న ఇళ్లను క్షేత్రస్థాయిలో పరిశీలించడంతో పాటు, బాధిత కుటుంబాలను నేరుగా కలిసి వారి సమస్యలు, అవసరాలను అడిగి తెలుసుకున్నారు. బాధితులను పరామర్శించడంతోనే సరిపెట్టకుండా, తక్షణ సహాయం అందించాలనే సంకల్పంతో ముందుకు వచ్చారు.

కొటక్ బ్యాంకు ఆర్థిక సహకారంతో సీడ్స్, స్నిర్డ్ స్వచ్ఛంద సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో మలికిపురం మండలంలోని బట్టేలంక, శంకరగుప్తం గ్రామాలకు చెందిన సుమారు 80 బాధిత కుటుంబాలకు సహాయ సామగ్రిని పంపిణీ చేశారు. ఒక్కో కుటుంబానికి సుమారు రూ.4,000 విలువైన నిత్యావసర సరుకులతో పాటు, తుఫాన్ ధాటికి దెబ్బతిన్న ఇళ్లకు తాత్కాలిక రక్షణ కల్పించే టార్పాలిన్లు, ఇతర అత్యవసర సామగ్రిని అందజేశారు. ప్రకృతి విపత్తుతో తీవ్రంగా నష్టపోయిన కుటుంబాలకు ఈ సహాయం ప్రస్తుత కష్టకాలంలో ఎంతో ఊరటనిచ్చింది.

ఈ సహాయ కార్యక్రమంలో మానవతా మూర్తుల సంస్థ వ్యవస్థాపకులు బోణం రాజు, దొంగ జానకి రామయ్య, బోణం నాగేశ్వరరావు, బోనం సీతారత్నం అర్జునరావు,గంధం శ్రీరామమూర్తి, మీర్జా అబ్బాస్, ఆవుపాటి సుబ్రహ్మణ్యం , నాగిరెడ్డి ప్రతాప్ తదితరులు పాల్గొని బాధిత కుటుంబాలకు స్వయంగా సహాయ సామగ్రిని అందజేశారు.

PRABHU, RAZOLE

PRABHU, RAZOLE