Amalapuram: వరద ముంపును సమర్థవంతంగా ఎదుర్కొవాలి
Amalapuram: అమలాపురంలో తుఫాను, వరద ముంపు సహాయక చర్యలపై జేసీ నైడియా దేవి సమీక్ష. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశం.
Amalapuram: వరద ముంపును సమర్థవంతంగా ఎదుర్కొవాలి
అమలాపురం: తుఫాను,వరద ముంపు నేపథ్యంలో చేపట్టాల్సిన సహాయక చర్యలపై క్షేత్రస్థాయి సిబ్బందికి దిశా నిర్దేశనం చేసిన జాయింట్ కలెక్టర్.జిల్లాలో గత మూడు రోజులు కురిసిన భారీ వర్షాల ప్రభావంతో రాబోయే వరద ముంపు పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం పూర్తిగా సన్నద్ధతతో వ్వవహరించి ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని జాయింట్ కలెక్టర్ వైఖోమ్ నైడియా దేవి అధికారులను ఆదేశించారు.
ఈ రోజు అమలాపురం కలెక్టరేట్ నుంచి జాయింట్ కలెక్టర్ నైడియా దేవి జిల్లా స్థాయి వివిధ శాఖల అధికారులతో కలిసి అన్ని మండలాల తహశీల్దార్లు , ఎంపీడీవోలు ఇతర అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.తుఫాను ప్రభావిత ప్రాంతాలు,వరద ముంపునకు గురయ్యే మండలాల్లో ప్రస్తుత పరిస్థితిని ఆయా మండలాల అధికారులతో మాట్లాడి వివరాల ఆరా తీశారు.
వరద ముంపుకు లోనయ్యే లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం,తుఫాను పునరావాస కేంద్రాలు ఏర్పాటు, వైద్య శిబిరాలు నిర్వహణ, తాగునీరు,విద్యుత్ సదుపాయాలకు అంతరాయం లేకుండా చూడడం వంటి అంశాలపై ఈ సందర్భంగా జేసీ క్షేత్రస్థాయి సిబ్బందికి దిశా నిర్దేశనం చేశారు.ఈ సందర్భంగా జేసీ నైడియా దేవి మాట్లాడుతూ లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసి సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు.
వర్షాలు తగ్గినప్పటికీ వరద ముంపు పొంచి ఉన్న నేపథ్యంలో వరద ముంపును సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు జిల్లా అధికారయంత్రాంగం పూర్తి సన్నద్దతో ఉండాలని జేసీ స్పష్టం చేశారు.ఎలాంటి ఆస్తి,ప్రాణ నష్టం వాటిల్లకుండా అవసరమైన సహాయక చర్యలు తీసుకోవాలని జేసీ తెలిపారు.మొదటి,రెండవ హెచ్చరిక స్థాయిల వద్ద ఏయే గ్రామాలు ముంపునకు గురవుతాయో ముందస్తుగా గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జేసీ అధికారులను ఆదేశించారు.
లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రక్రియను వేగవంతం చేయాలని తెలిపారు.ముంపు బాధితుల కోసం ఏర్పాటు చేసే పునరావాస కేంద్రాల్లో తాగునీరు,విద్యుత్ సరఫరా వంటి సదుపాయాలు, వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి మెరుగైన వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
అత్యవసర సేవల్లో భాగంగా గర్భిణీ స్త్రీలు,బాలింతలు, వృద్ధులను ముందుగానే గుర్తించి,ఎలాంటి ప్రమాదం జరగకుండా ముందుగానే సురక్షిత ప్రాంతాల తరలించాలన్నారు.లంక గ్రామాల్లో నివాసముండే ప్రజలతోపాటు పశువులను కూడా సురక్షత ప్రాంతాలకు తరలించాలని స్పష్టం చేశారు. వరద సమయంలో పశువులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన దాణా,పశు వైద్య వసతులు కల్పించేలా ప్రత్యేక శ్రద్ధ వహించాలని జేసీ అధికారులకు సూచించారు.
వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా రెవెన్యూ అధికారి వి.సుబ్బారావు,కలెక్టరేట్ పరిపాలన అధికారి కె. నాగలక్ష్మిమ్మ,వైద్య ఆరోగ్యం, మత్స్య, పంచాయతీ, విద్యా ఇరిగేషన్,డ్రైయిన్స్ వంటి ఇతర శాఖల జిల్లా స్థాయి అధికారులు, అన్ని మండలాల తహశీల్దార్లు, ఎంపీడీవోలు,తదితరులు పాల్గొన్నారు.




