Amalapuram: అమలాపురంలో అంతర్జాతీయ బధిరుల వారోత్సవాలు

Amalapuram: అమలాపురంలో అంతర్జాతీయ బధిరుల వారోత్సవాలు. బధిరులకు విద్య, ఉపాధిలో సమాన అవకాశాలు కల్పించాలని కలెక్టర్ డా. ఆర్. మహేష్ కుమార్ పిలుపు.

SURESH, AMALAPURAM
Published on: 29 Sept 2026 4:14 PM IST
Amalapuram
X

Amalapuram: అమలాపురంలో అంతర్జాతీయ బధిరుల వారోత్సవాలు

అమలాపురం: బధిరులు సమాజంలో ఇతరులతో సమానంగా గౌరవం, అవకాశాలు పొందేలా సమగ్ర సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు. అంతర్జాతీయ బధిరుల వారోత్సవం,అంతర్జాతీయ సంకేత భాషా దినోత్సవం సందర్భంగా మంగళవారం జిల్లా కేంద్రం అమలాపురం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన ప్రత్యేక అవగాహన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా,జిల్లా ఎస్పీ రాహుల్ మీనా,ఐపీఎస్ విశిష్ట అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ బధిరుల హక్కుల పరిరక్షణతో పాటు వారికి సమాన అవకాశాలు కల్పించడంలో ప్రభుత్వ యంత్రాంగం ప్రత్యేక శ్రద్ధ వహిస్తోందన్నారు.విద్య,ఉపాధి, సంక్షేమం,సామాజిక భద్రత తదితర రంగాల్లో ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాల ప్రయోజనాలు జిల్లాలోని ప్రతి బధిరుడికి చేరేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

బధిరుల సమస్యలను కేవలం ఒక వర్గానికి సంబంధించిన అంశంగా కాకుండా సమాజం మొత్తం బాధ్యతగా గుర్తించాలని సూచించారు.బధిరుల పట్ల కుటుంబ సభ్యులు, విద్యాసంస్థలు,ప్రభుత్వ శాఖలు, స్వచ్ఛంద సంస్థలు సానుకూల దృక్పథంతో వ్యవహరించాలని కోరారు.వారికి అవసరమైన సహాయ సహకారాలు అందించడంతో పాటు వారి ప్రతిభను గుర్తించి ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు.

వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ ది డెఫ్ (WFD) ఆధ్వర్యంలో 1958లో ఇటలీలోని రోమ్ నగరంలో అంతర్జాతీయ బధిరుల వారోత్సవాల నిర్వహణకు శ్రీకారం చుట్టినట్లు కలెక్టర్ తెలిపారు. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ చివరి వారంలో బధిరుల సమస్యలు, హక్కులు, అవసరాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఈ వారోత్సవాలను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.

బధిరులతో సమర్థవంతంగా సమాచార మార్పిడి జరిగేలా సంకేత భాషపై ప్రభుత్వ శాఖల సిబ్బందికి,ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.సంకేత భాషా అనువాదకులు,దివ్యాంగుల సంస్థలు,సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేస్తే బధిరులకు ప్రభుత్వ సేవలు మరింత సులభంగా అందుబాటులోకి వస్తాయని తెలిపారు.బధిరుల భద్రతకు పోలీస్ శాఖ అండగా ఉంటుంది అని అన్నారు.

జిల్లా ఎస్పీ రాహుల్ మీనా,ఐపీఎస్ మాట్లాడుతూ బధిరుల భద్రత, చట్టపరమైన రక్షణ విషయంలో పోలీసు శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. సమాజంలోని ప్రతి ఒక్కరికీ చట్టం సమానంగా వర్తిస్తుందని, బధిరులు తమ సమస్యలను పోలీసుల దృష్టికి తీసుకువచ్చే సమయంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా అవసరమైన సహకారం అందిస్తామని చెప్పారు.

సంకేత భాష బధిరుల భావ వ్యక్తీకరణకు,ఇతరులతో సమాచార మార్పిడికి ప్రధాన వారధిగా పనిచేస్తుందని ఎస్పీ పేర్కొన్నారు.సంకేత భాష ప్రాధాన్యతను గుర్తిస్తూ ఐక్యరాజ్యసమితి 2018 నుంచి ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 23న అంతర్జాతీయ సంకేత భాషా దినోత్సవాన్ని నిర్వహిస్తోందని తెలిపారు.పోలీస్ స్టేషన్లకు వచ్చే బధిరులకు తమ సమస్యలను సులభంగా తెలియజేసే అవకాశం కల్పించేందుకు అవసరమైన సంకేత భాషా వనరులను అందుబాటులోకి తీసుకురావడానికి చర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలిపారు.

బధిరులు,ఇతర దివ్యాంగులపై జరిగే నేరాల విషయంలో వెంటనే పోలీసులను ఆశ్రయించాలని సూచించారు.సంకేత భాషపై అవగాహన పెంచాలి.బధిరులు తమ భావాలను,అవసరాలను వ్యక్తం చేసేందుకు సంకేత భాష ఎంతో కీలకమని కార్యక్రమంలో పాల్గొన్న వక్తలు తెలిపారు. కుటుంబ సభ్యులు, ఉపాధ్యాయులు,ప్రభుత్వ సిబ్బంది,స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు సంకేత భాషపై ప్రాథమిక అవగాహన కలిగి ఉంటే బధిరులకు ప్రభుత్వ సేవలు,విద్య,వైద్యం,ఉపాధి, భద్రత వంటి రంగాల్లో మరింత మెరుగైన సహాయం అందించవచ్చని పేర్కొన్నారు.

“సంకేత భాషలను ఏకం చేద్దాం” అనే స్ఫూర్తితో బధిరుల పట్ల సానుకూల దృక్పథాన్ని పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు.బధిరులను ప్రత్యేక అవసరాలు కలిగిన వ్యక్తులుగా మాత్రమే కాకుండా సమాజంలో సమాన హక్కులు, సామర్థ్యాలు కలిగిన పౌరులుగా గుర్తించి వారికి తగిన అవకాశాలు కల్పించాలని సూచించారు.

బధిరుల విద్య, నైపుణ్యాభివృద్ధి,ఉపాధి అవకాశాలకు సంబంధించి అందుబాటులో ఉన్న ప్రభుత్వ పథకాలపై విస్తృత అవగాహన కల్పించాలని,అర్హులైన ప్రతి ఒక్కరికీ వాటి ప్రయోజనాలు అందేలా సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని కార్యక్రమంలో సూచించారు.

ఈ కార్యక్రమంలో విభిన్న ప్రతిభావంతుల హిజ్రాల మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు ఏవై శ్రీనివాస్ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు,డెఫ్ ఎనేబుల్డ్ ఫౌండేషన్ సభ్యులు,సంకేత భాషా నిపుణులు,బధిరులు, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

SURESH, AMALAPURAM

SURESH, AMALAPURAM