Amalapuram: రోడ్డు భద్రత, మహిళా రక్షణపై కలెక్టర్, ఎస్పీ సమీక్ష

Amalapuram: అమలాపురంలో రోడ్డు భద్రత, డ్రగ్స్ నిర్మూలన, మహిళా రక్షణపై కలెక్టర్ ఆర్. మహేష్ కుమార్, ఎస్పీ రాహుల్ మీనా సమీక్ష. శక్తి యాప్ వాడకంపై అవగాహనకు ఆదేశం.

SURESH, AMALAPURAM
Published on: 29 Sept 2026 6:19 PM IST
Amalapuram
X

Amalapuram: రోడ్డు భద్రత, మహిళా రక్షణపై కలెక్టర్, ఎస్పీ సమీక్ష

అమలాపురం: జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణ,డ్రగ్స్ నిర్మూలన, మహిళా భద్రత బాధ్యతలపై వివిధ శాఖల అధికారులు సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డా.ఆర్.మహేష్ కుమార్ ఆదేశించారు.మంగళవారం స్థానిక కలెక్టరేట్లోని వివేకానంద సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ జిల్లా ఎస్పీ రాహుల్ మీనా తో కలిసి జిల్లాస్థాయి రోడ్డు భద్రత కమిటీ సమావేశం,డ్రగ్స్ నిర్మూలన,మహిళా భద్రత బాధ్యత అంశాల పురోగతిపై సమీక్షా సమావేశం నిర్వహించారు.

రోడ్డు ప్రమాదాల నివారణ మనందరి బాధ్యత ఈ సందర్భంగాజిల్లా కలెక్టర్ డా. ఆర్. మహేష్ కుమార్ మాట్లాడుతూ జిల్లాలో గుర్తించిన 11 బ్లాక్ స్పాట్ల వద్ద ప్రమాదాల నివారణకు తక్షణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.ఆర్‌అండ్‌బీ,రాష్ట్ర రహదారులు,ప్రధాన జిల్లా రహదారుల వారీగా సమస్యలను గుర్తించి, ఇంజనీరింగ్ అధికారులు త్వరితగతిన మరమ్మతులు పూర్తి చేయాలన్నారు.

జొన్నాడ హైవే పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని, సర్వీస్ రోడ్ల పనులను అక్టోబర్ 31వ తేదీ నాటికి,మిగిలిన పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని సంబంధిత ఏజెన్సీలను ఆదేశించారు. హైవేలపై అనధికారికంగా వాహనాలను నిలిపివేయడం వల్ల ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని, భట్నవిల్లి,పేరూరు,పాసలపూడి ప్రాంతాల్లో నిబంధనలు ఉల్లంఘించే వాహనాలపై జరిమానాలు విధించి కేసులు నమోదు చేయాలని స్పష్టం చేశారు.

ప్రైవేట్ బస్సులు,లారీల పార్కింగ్ కోసం ప్రత్యేక బేలను గుర్తించి వినియోగంలోకి తీసుకురావాలన్నారు.ఆర్టీసీ బస్సుల్లో విద్యార్థులు, ప్రయాణికులు ఫుట్‌బోర్డు ప్రయాణాలు చేయకుండా చర్యలు తీసుకోవాలని, మోటారు వాహనాల చట్ట నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని ఆదేశించారు.డ్రగ్స్ రహిత జిల్లానే మన ధ్యేయం జిల్లాలో మాదకద్రవ్యాలైన డ్రగ్స్, గంజాయి నిర్మూలనతో పాటు మహిళలు,బాలికల భద్రతకు జిల్లా యంత్రాంగం,పోలీసు శాఖ సమన్వయంతో పటిష్ట చర్యలు చేపడుతున్నట్లు జిల్లా కలెక్టర్ డా.ఆర్.మహేష్ కుమార్ తెలిపారు.

జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణ, మహిళల రక్షణ విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.డ్రగ్స్‌కు బానిసైన వారిని గుర్తించి కేవలం కేసులు నమోదు చేయడం కాకుండా,వారికి అవసరమైన కౌన్సిలింగ్ అందించి డీ-అడిక్షన్ సెంటర్ల ద్వారా సాధారణ జీవితం గడిపేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. డ్రగ్స్ నుంచి కోలుకుని సాధారణ జీవితం గడుపుతున్న వారి అనుభవాలను విద్యార్థులు, యువతకు అవగాహన కల్పించే కార్యక్రమాల్లో పంచుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

పాఠశాలలు, కళాశాలల పరిసరాల్లో మత్తు పదార్థాలు,పొగాకు ఉత్పత్తుల విక్రయాలు జరగకుండా ఈ-లీడ్స్ వంటి విద్యాశాఖ యాప్‌ల ద్వారా ఉపాధ్యాయులు, అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. త్రిశూల శక్తి ద్వారా మహిళా భద్రతా చర్యలు.జిల్లాలో త్రిశూల శక్తి ద్వారా మహిళా భద్రతా చర్యలు ముమ్మరం చేశామని జిల్లా కలెక్టర్ డా.ఆర్.మహేష్ కుమార్ తెలిపారు.జిల్లాలో మహిళా భద్రత బాధ్యత లపై మహిళా పోలీసులను వివరాల అడిగి తెలుసుకున్నారు.

జిల్లాలో పాఠశాలలు కాలేజీలు అసంఘటిత ప్రాంతాల్లో మహిళలు చిన్నారులపై జరిగే అగత్యాలను రూపుమాపేందుకు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలియజేశారు.మహిళలు, చిన్నారుల రక్షణ కోసం రూపొందించిన ‘శక్తి’ యాప్‌పై గ్రామీణ స్థాయి వరకు విస్తృత అవగాహన కల్పించి,ప్రతి ఒక్కరూ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకునేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

జిల్లా ఎస్పీ రాహుల్ మీనా మాట్లాడుతూ జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసు,రవాణా శాఖలు సమన్వయంతో ప్రత్యేక తనిఖీలు నిర్వహించాలని తెలిపారు.ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని,సరైన డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని సూచించారు.డ్రంక్ అండ్ డ్రైవ్, ట్రిపుల్ రైడింగ్,హెల్మెట్ లేకుండా ప్రయాణించడం,ఇతర ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలపై ప్రత్యేక నిఘా ఉంచి కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

హైవేలపై వాహనాలను అనధికారికంగా నిలిపివేయకుండా నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని, ప్రమాదాలు జరిగే ప్రాంతాల్లో ముందస్తు భద్రతా చర్యలు అమలు చేయాలని తెలిపారు. రహదారులపై ప్రమాదాలకు కారణమయ్యే ఫ్లెక్సీలు, విద్యుత్ స్తంభాలు,ట్రాఫిక్‌కు ఆటంకం కలిగించే బోర్డులను తక్షణమే తొలగించాలని జిల్లా కలెక్టర్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.

రహదారి భద్రతా నిబంధనలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ ప్రమాదాల నివారణకు సమష్టిగా కృషి చేయాలని సూచించారు.జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో గంజాయి,సింథటిక్ డ్రగ్స్ సరఫరా,వినియోగంపై ప్రత్యేక నిఘా కొనసాగుతోందని తెలిపారు.బెంగళూరు తదితర ప్రాంతాల నుంచి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో అత్యవసర ఔషధాల పేరుతో డ్రగ్స్ తరలిస్తున్న ముఠాలను గుర్తించి చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు.

ప్రైవేట్ ట్రావెల్స్ నిర్వాహకులు అనుమానాస్పద పార్సిళ్లను బుక్ చేసుకునే సమయంలో తగిన సమాచారం, ఐడీ వివరాలు లేకుండా వాటిని అనుమతించరాదని సూచించారు.పాఠశాలలు, కళాశాలల సమీపంలో గంజాయి వినియోగానికి ఉపయోగించే రైస్ పేపర్ తదితర అనుబంధ ఉత్పత్తులను విక్రయించే దుకాణాలపై కూడా ప్రత్యేక నిఘా ఉంచినట్లు తెలిపారు. ఆకతాయిలు,అసాంఘిక శక్తుల కదలికలను గుర్తించేందుకు జిల్లావ్యాప్తంగా డ్రోన్ సర్వైలెన్స్ కొనసాగుతోందన్నారు.

మహిళల భద్రత కోసం జిల్లాలో ప్రత్యేకంగా 5 శక్తి టీమ్‌లు పనిచేస్తున్నాయని ఎస్పీ తెలిపారు.యూనిఫాంలో పెట్రోలింగ్‌తో పాటు మఫ్టీలో ఉన్న పోలీసు సిబ్బంది పాఠశాలలు,కళాశాలలు,రద్దీ ప్రాంతాల్లో పర్యటిస్తూ మహిళలు,విద్యార్థినులను వేధించే వారిపై చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు.జిల్లాలో గుర్తించిన 71 సమస్యాత్మక ప్రాంతాల్లో (హాట్‌స్పాట్స్) పటిష్ట భద్రతా చర్యలు చేపట్టామని తెలిపారు.

మహిళలపై నేరాలకు పాల్పడే వారిపై ప్రత్యేకంగా సెక్సువల్ అఫెండర్ షీట్లను తెరిచి పర్యవేక్షణ చేస్తున్నామని చెప్పారు.పోక్సో,అత్యాచారం వంటి కేసుల్లో నిందితులకు త్వరితగతిన శిక్షలు పడేలా కోర్టు మానిటరింగ్ వ్యవస్థ ద్వారా కేసుల పురోగతిని పర్యవేక్షిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు.అవగాహనతో పాటు నిరంతర నిఘా జిల్లావ్యాప్తంగా విద్యాసంస్థలు,బహిరంగ ప్రదేశాల్లో ఇప్పటివరకు 698కి పైగా అవగాహన సదస్సులు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.

‘ఆపరేషన్ సేఫ్ క్యాంపస్’ ద్వారా విద్యాసంస్థల పరిసరాల్లో తనిఖీలను ముమ్మరం చేశారు.మహిళల భద్రత కోసం జిల్లాలో 5 శక్తి టీమ్‌లు పనిచేస్తుండగా, ఇప్పటివరకు 1,900కు పైగా శక్తి యాప్ రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయి.మత్తుపదార్థాల అక్రమ రవాణా,వినియోగం, మహిళలపై వేధింపులు లేదా నేరాలకు సంబంధించి ఏదైనా సమాచారం ఉంటే ప్రజలు నిర్భయంగా పోలీసులకు తెలియజేయాలని జిల్లా కలెక్టర్, ఎస్పీ కోరారు.

ప్రజల సహకారంతో డ్రగ్స్ రహిత సమాజం,మహిళలకు సురక్షిత వాతావరణం కల్పించేందుకు సమష్టిగా కృషి చేయాలని సూచించారు.ఈ సమావేశంలో అమలాపురం కొత్తపేట ఆర్డీవోలు ఎం సరళావతి జీవివి సత్యనారాయణ,జిల్లా రవాణా అధికారి కె.శ్రీనివాసరావు, జిల్లా ఫారెస్ట్ అధికారి ఎం వి ప్రసాద్ రావు, కాకినాడ నేషనల్ హైవే టి నిక్కి క్రూజ్,ఏ ఈ వెంకట రామారావు,రోడ్డు మరియు భవనాల శాఖ అధికారి బి రాము,ఆరోగ్యశాఖ అధికారి కార్తీక్,జిల్లా విద్యాశాఖ అధికారి మహబూబ్ షా,జిల్లా పంచాయతీ శాఖ అధికారి శాంతి కుమారి,కాకినాడ కోనసీమ ఈగల్ క్లబ్ అధికారి వెంకటేశ్వరరావు,నేషనల్ హైవే పిడి కృష్ణమూర్తి,డిసిఆర్బి ఎస్సై పేయ్యల రాజేష్,ఉమెన్ పోలీస్ స్టేషన్ ఎస్సై గంగాభవాని, సమాచార పౌర సంబంధాల శాఖ అధికారి సిహెచ్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

SURESH, AMALAPURAM

SURESH, AMALAPURAM