Amalapuram: ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీని పరిశీలించిన కలెక్టర్ మహేష్ కుమార్
Amalapuram: అమలాపురం రూరల్ మండలంలో కలెక్టర్ డా. ఆర్. మహేష్ కుమార్ స్వయంగా ఎన్టీఆర్ భరోసా పింఛన్లను అందజేసి, పంపిణీ ప్రక్రియను పరిశీలించారు.
Amalapuram: ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీని పరిశీలించిన కలెక్టర్ మహేష్ కుమార్
అమలాపురం: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పింఛన్లు అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి పారదర్శకంగా,సకాలంలో అందేలా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డా ఆర్.మహేష్ కుమార్ అధికారులను ఆదేశించారు.పింఛన్ల పంపిణీలో ఎలాంటి జాప్యం,నిర్లక్ష్యం లేకుండా క్షేత్రస్థాయి సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు.
ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా గురువారం అమలాపురం రూరల్ మండల పరిధిలో జిల్లా కలెక్టర్ డా.ఆర్. మహేష్ కుమార్ స్వయంగా పాల్గొని లబ్ధిదారులకు పింఛన్లను అందజేశారు.ఈ సందర్భంగా వృద్ధాప్య పింఛన్లు ముగ్గురు,వితంతు పింఛన్లు ఇద్దరు,దివ్యాంగుల పింఛన్ పొందుతున్న ఒక లబ్ధిదారుడికి కలెక్టర్ స్వయంగా నగదు పింఛన్లు అందించారు.
పింఛన్లు అందజేసిన అనంతరం లబ్ధిదారులతో కలెక్టర్ మాట్లాడి వారి కుటుంబ పరిస్థితులు, సంక్షేమ పథకాల ద్వారా అందుతున్న ప్రయోజనాలు, పింఛన్ పంపిణీలో ఎదురవుతున్న ఇబ్బందులపై ఆరా తీశారు.ప్రభుత్వం అందిస్తున్న సామాజిక భద్రతా పథకాల ప్రయోజనాలు సక్రమంగా అందుతున్నాయా లేదా అన్న విషయాన్ని అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పేదలు,వృద్ధులు, వితంతువులు,దివ్యాంగులు, ఇతర అర్హులైన బలహీన వర్గాలకు సామాజిక భద్రత కల్పించడమే ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల ప్రధాన ఉద్దేశమని తెలిపారు.ప్రతి నెలా ఒకటో తేదీనే లబ్ధిదారుల ఇంటి వద్దకు వెళ్లి పింఛన్లు అందించే విధానాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు.100 శాతం పంపిణీ పూర్తి చేయాలి జిల్లా కలెక్టర్ డా.ఆర్.మహేష్ కుమార్ ఆదేశించారు.
జిల్లాలో పింఛన్ల పంపిణీ ప్రక్రియను అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని కలెక్టర్ ఆదేశించారు.అర్హులైన ఏ ఒక్క లబ్ధిదారుడూ పింఛన్‌కు దూరం కాకుండా చూడాలని, పింఛన్ల పంపిణీని 100 శాతం సకాలంలో పూర్తి చేయాలని స్పష్టం చేశారు.సచివాలయ సిబ్బంది తమ పరిధిలోని పింఛన్ లబ్ధిదారుల వివరాలను ముందుగానే పరిశీలించి, పంపిణీ సమయంలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.
వృద్ధులు, దివ్యాంగులు,ఇతర అసహాయ లబ్ధిదారులకు పింఛన్ అందించే సమయంలో ప్రత్యేక శ్రద్ధ చూపాలని తెలిపారు. లబ్ధిదారుల సమస్యలపై ప్రత్యేక దృష్టి పింఛన్ల పంపిణీ కేవలం నగదు అందజేయడంతో ముగియకూడదని,లబ్ధిదారుల సమస్యలను తెలుసుకుని అవసరమైన చోట సంబంధిత అధికారులు పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.
క్షేత్రస్థాయిలో సచివాలయ సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండాలని, సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశించారు.ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ప్రయోజనాలు అర్హులైన ప్రతి కుటుంబానికి చేరేలా అధికారులు,సచివాలయ సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. పింఛన్ల పంపిణీ ప్రక్రియలో పారదర్శకతను పాటిస్తూ,లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో డీఆర్‌డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ డి రాంబాబు,అమలాపురం తహసీల్దార్ ఎస్ దివాకర్ డి ఆర్ డి ఎ డి పి ఎం ఏబీఎన్ అన్నపూర్ణ,రాజకీయ పార్టీ ప్రతినిధి ఉదయ బాబు డిప్యూటీ తహసీల్దార్, ఎంపీడీవో,సంబంధిత శాఖల అధికారులు,సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.




