Amalapuram: కాలువలు, డ్రైన్ల అడ్డంకులు తొలగించాలి కలెక్టర్

Amalapuram: అమలాపురం నియోజకవర్గంలో కాలువలు, డ్రైన్లలో అడ్డంకుల తొలగింపు పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని కలెక్టర్ డా.ఆర్. మహేష్ కుమార్ ఆదేశం.

SURESH, AMALAPURAM
Updated on: 2 Nov 2026 4:56 PM IST
Amalapuram
X

Amalapuram: కాలువలు, డ్రైన్ల అడ్డంకులు తొలగించాలి కలెక్టర్

అమలాపురం: కాలువలు,డ్రైన్లలో అడ్డంకుల తొలగింపు పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలి.తుపాను నష్టాలపై ప్రాథమిక అంచనా నివేదికను మూడు రోజుల్లో సమర్పించాలి జిల్లా కలెక్టర్ డా.ఆర్. మహేష్ కుమార్ తెలిపారు. క్షేత్రస్థాయి పరిశీలనలో నీటి వినియోగదారుల సంఘాల భాగస్వామ్యం తప్పనిసరి.

తుపాను,ఈదురు గాలుల ప్రభావంతో జిల్లాలోని ప్రధాన కాలువలు,డ్రైన్లలో పడిపోయిన చెట్లు,కొమ్మలు,పేరుకుపోయిన పూడిక,ఇతర వ్యర్థాలను యుద్ధప్రాతిపదికన తొలగించి నీటి ప్రవాహానికి ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడాలని జిల్లా కలెక్టర్ డా.ఆర్.మహేష్ కుమార్ ఇరిగేషన్ శాఖ అధికారులను ఆదేశించారు.

సోమవారం గోదావరి భవన్ లో ఇరిగేషన్,డ్రైనేజీ అధికారులతో రాబోయే 15 నుంచి 20 రోజుల్లో కాలువలు,డ్రైన్లలో శుభ్రత పనులను పూర్తిస్థాయిలో పూర్తి చేయాలని స్పష్టం చేశారు.ఇరిగేషన్ శాఖకు సంబంధించిన పనుల పురోగతి, తుపాను కారణంగా కాలువలు, డ్రైన్లు,హెడ్‌వర్క్స్‌కు జరిగిన నష్టాలు,చేపట్టాల్సిన మరమ్మతులు,పునరుద్ధరణ చర్యలపై సూపరింటెండింగ్ ఇంజనీర్లు (ఎస్.ఈ.), ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు (ఈ.ఈ.),డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు,అసిస్టెంట్ ఇంజనీర్లతో జిల్లా కలెక్టర్ సమగ్ర సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ,తుపాను ప్రభావంతో కాలువలు,డ్రైన్లలో పడిపోయిన చెట్లు,పెద్ద కొమ్మలు,ఇతర వ్యర్థాల కారణంగా నీటి ప్రవాహానికి అంతరాయం కలిగే అవకాశం ఉందని,ముఖ్యంగా వ్యవసాయ అవసరాలకు సాగునీరు, మురుగునీటి పారుదలకు ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు.కాలువలు,డ్రైన్ల శుభ్రత పనులను కేవలం తాత్కాలిక చర్యలుగా కాకుండా పక్కా కార్యాచరణ ప్రణాళికతో పూర్తి చేయాలని ఆదేశించారు.

కాలువలు,డ్రైన్ల వారీగా సమగ్ర కార్యాచరణ ప్రణాళిక జిల్లాలోని ప్రతి ప్రధాన కాలువ, ఉపకాలువ,డ్రైన్ల వారీగా ఎక్కడెక్కడ అడ్డంకులు ఏర్పడ్డాయి,ఎంత మేరకు పూడిక పేరుకుపోయింది,ఎన్ని చెట్లు,కొమ్మలు తొలగించాల్సి ఉంది అనే వివరాలను చైనేజ్ ప్రకారం ఖచ్చితంగా నమోదు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రతి ప్రాంతంలో చేపట్టాల్సిన పనులు,అవసరమైన యంత్రాలు,సిబ్బంది,పనుల పురోగతికి సంబంధించి స్పష్టమైన ప్రణాళిక రూపొందించాలన్నారు.

రాబోయే 15 నుంచి 20 రోజుల్లో అన్ని కాలువలు,డ్రైన్లలో పూడిక,చెట్లు,వ్యర్థాల తొలగింపు పనులు పూర్తి చేసేలా వారాల వారీ లక్ష్యాలను నిర్దేశించుకోవాలని సూచించారు. నిర్దేశించిన గడువులో పనులు పూర్తి చేసే బాధ్యత సంబంధిత ఇంజనీరింగ్ అధికారులదేనని స్పష్టం చేశారు.తొలగించిన వ్యర్థాలను తిరిగి కాలువల్లో వేయకుండా చర్యలు తీసుకోవాలి అని అధికారులకు తెలియజేసారు.

కాలువలు,డ్రైన్ల నుంచి తొలగించిన చెట్లు, కొమ్మలు,పూడిక,ఇతర వ్యర్థాలను రోడ్లపై లేదా కాలువలు,డ్రైన్ల పక్కనే పేరుకుపోయేలా వదిలివేయకూడదని కలెక్టర్ ఆదేశించారు.అలా చేయడం వల్ల తిరిగి వర్షాలు కురిసినప్పుడు వ్యర్థాలు కాలువల్లోకి చేరి నీటి ప్రవాహానికి ఆటంకం కలిగించే ప్రమాదం ఉందన్నారు.సంబంధిత ఇతర శాఖలతో సమన్వయం చేసుకొని తొలగించిన వ్యర్థాలను నిర్ణీత ప్రదేశాలకు తరలించి శాశ్వతంగా తొలగించేలా చర్యలు చేపట్టాలని సూచించారు.

తుపాను నష్టాలపై మూడు రోజుల్లో నివేదిక తుపాను ప్రభావంతో ఇరిగేషన్ శాఖ పరిధిలోని హెడ్‌వర్క్స్, కాలువలు,డ్రైన్లు,వాటికి అనుసంధానంగా ఉన్న నిర్మాణాలు (స్ట్రక్చర్స్) ఏమైనా దెబ్బతిన్నాయా అనే అంశంపై క్షేత్రస్థాయిలో సమగ్ర పరిశీలన నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు.దెబ్బతిన్న నిర్మాణాల వివరాలు,నష్టం తీవ్రత,చేపట్టాల్సిన మరమ్మతులు,పునరుద్ధరణ పనులకు అవసరమైన అంచనాలతో కూడిన ప్రాథమిక నష్టం నివేదికను రాబోయే మూడు రోజుల్లో సమర్పించాలని స్పష్టం చేశారు.

నీటి వినియోగదారుల సంఘాల భాగస్వామ్యం తప్పనిసర క్షేత్రస్థాయిలో కాలువలు, డ్రైన్లలో పూడిక,అడ్డంకులు, తుపాను నష్టాలను అంచనా వేసే సమయంలో నీటి వినియోగదారుల సంఘాల అధ్యక్షులు,సభ్యులను తప్పనిసరిగా భాగస్వాములను చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు.స్థానిక పరిస్థితులపై రైతులకు,నీటి వినియోగదారుల సంఘాల ప్రతినిధులకు పూర్తి అవగాహన ఉంటుందని,వారి భాగస్వామ్యంతో నష్టాల అంచనా మరింత పారదర్శకంగా,వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా ఉంటుందని పేర్కొన్నారు.

ప్రతి క్షేత్రస్థాయి పరిశీలనలో సంబంధిత నీటి వినియోగదారుల సంఘాల ప్రతినిధుల అభిప్రాయాలు తీసుకోవడంతో పాటు,వారు పరిశీలించిన వివరాలపై సంతకాలు కూడా పొందాలని ఆదేశించారు.నీటి సంఘాల భాగస్వామ్యం లేకుండా ఏకపక్షంగా నివేదికలు రూపొందించకూడదని స్పష్టం చేశారు.నివేదికలపై ఈ నెల 7న మరోసారి సమీక్ష అధికారులు నిర్దేశించిన గడువులోగా క్షేత్రస్థాయి పరిశీలనలు పూర్తి చేసి, నష్టం అంచనాలు,శుభ్రత పనుల పురోగతి,తదుపరి చేపట్టాల్సిన చర్యలపై సమగ్ర నివేదికలు సమర్పించాలని జిల్లా కలెక్టర్ తెలిపారు.అధికారులు సమర్పించే నివేదికల ఆధారంగా ఈ నెల 7వ తేదీన మరోసారి సమీక్షా సమావేశం నిర్వహించి, తదుపరి కార్యాచరణను నిర్ణయిస్తామని వెల్లడించారు.

జిల్లాలో సాగునీటి సరఫరా, మురుగునీటి పారుదలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇరిగేషన్ అధికారులు నిరంతరం క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ పనులను పర్యవేక్షించాలని కలెక్టర్ ఆదేశించారు.ఈ సమీక్షా సమావేశంలో ఇరిగేషన్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కే. వెంకటేశ్వరావు,డ్రైనేజీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎం.వి. కిషోర్,అసిస్టెంట్ ఇంజనీర్లు, ఇతర సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

SURESH, AMALAPURAM

SURESH, AMALAPURAM