Amalapuram: నులిపురుగుల నివారణపై అవగాహన అవసరం: కలెక్టర్ మహేష్ కుమార్

Amalapuram: అమలాపురం మున్సిపల్ మోడల్ స్కూల్‌లో విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేసి, నులిపురుగుల నివారణపై కలెక్టర్ డాక్టర్ మహేష్ కుమార్ అవగాహన కల్పించారు.

SURESH, AMALAPURAM
Published on: 28 Sept 2026 6:55 PM IST
Amalapuram
X

Amalapuram: నులిపురుగుల నివారణపై అవగాహన అవసరం: కలెక్టర్ మహేష్ కుమార్

Amalapuram: పిల్లలు,కౌమారదశలో ఉన్న విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణలో భాగంగా నులిపురుగుల నివారణపై ప్రతి ఒక్కరికీ అవగాహన ఉండాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ రావిరాల మహేష్ కుమార్ సూచించారు. సోమవారం అమలాపురం అర్బన్ రవణం వీధి వద్ద సుభాష్ చంద్రబోస్ మున్సిపల్ మోడల్ స్కూల్ నందు నిర్వహించిన జాతీయ నులిపురుగుల దినోత్సవం(నేషనల్ డి వార్మింగ్ డే)కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ విద్యార్థులతో కలిసి పాల్గొని నులిపురుగుల నివారణ, వ్యక్తిగత పరిశుభ్రత,ఆరోగ్య పరిరక్షణపై పలు సూచనలు చేశారు.

అనంతరం పాఠశాల విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పేగుల్లో ఏర్పడే నులిపురుగుల సంక్రమణ వల్ల పిల్లల్లో రక్తహీనత,పోషకాహార లోపం,బలహీనత, ఎదుగుదలలో జాప్యం,ఏకాగ్రత తగ్గడం వంటి సమస్యలు ఏర్పడే అవకాశం ఉందన్నారు. విద్యార్థులు తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, ఏదైనా ఆరోగ్య సమస్య తలెత్తినప్పుడు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు లేదా ఆరోగ్య సిబ్బందికి తెలియజేయాలని సూచించారు.

చేతుల పరిశుభ్రతతోనే అనేక వ్యాధులకు అడ్డుకట్ట భోజనం చేసే ముందు,మరుగుదొడ్డిని ఉపయోగించిన తర్వాత సబ్బుతో చేతులను శుభ్రంగా కడుక్కోవాలని కలెక్టర్ సూచించారు.గోళ్లను ఎప్పటికప్పుడు శుభ్రంగా, చిన్నగా ఉంచుకోవాలని, శుభ్రమైన నీటినే తాగాలని తెలిపారు.పండ్లు, కూరగాయలను శుభ్రంగా కడిగిన తరువాతే వినియోగించాలని సూచించారు.

పరిశుభ్రమైన పరిసరాలు-ఆరోగ్యకరమైన భవిష్యత్తు బహిరంగ మలవిసర్జనకు దూరంగా ఉండాలని,తప్పనిసరిగా మరుగుదొడ్లను వినియోగించాలని కలెక్టర్ పేర్కొన్నారు.కలుషితమైన నేల, నీరు,ఆహారం ద్వారా నులిపురుగుల సంక్రమణకు అవకాశం ఉన్నందున పరిసరాల పరిశుభ్రతను ప్రతి ఒక్కరూ పాటించాలని సూచించారు. బయటకు వెళ్లేటప్పుడు పాదరక్షలు ధరించే అలవాటు చేసుకోవాలని విద్యార్థులకు తెలిపారు.

నులిపురుగుల నివారణ మందులపై అవగాహన కల్పించాలి ప్రభుత్వం నిర్వహించే నులిపురుగుల నివారణ కార్యక్రమాల్లో విద్యార్థులు,తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు చురుకుగా భాగస్వాములు కావాలని కలెక్టర్ సూచించారు.ఆరోగ్య శాఖ సిబ్బంది సూచనల మేరకు నులిపురుగుల నివారణ మందులను తీసుకోవాలని, మందుల వినియోగంపై విద్యార్థులకు సరైన అవగాహన కల్పించాలని పాఠశాల సిబ్బందికి సూచించారు.

పాఠశాలల్లో ఆరోగ్య విద్యకు ప్రాధాన్యం విద్యార్థులకు విద్యతో పాటు ఆరోగ్యకరమైన జీవన విధానంపై అవగాహన కల్పించడం కూడా పాఠశాలల బాధ్యతలో ముఖ్యమైన భాగమని కలెక్టర్ అన్నారు. నులిపురుగుల నివారణ,చేతుల పరిశుభ్రత,వ్యక్తిగత పరిశుభ్రత, పోషకాహారం,సురక్షితమైన తాగునీరు,పారిశుధ్యంపై విద్యార్థులకు నిరంతరం అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో విద్యార్థులతో జిల్లా కలెక్టర్ నులిపురుగుల నివారణ,చేతుల పరిశుభ్రత, వ్యక్తిగత ఆరోగ్య పరిరక్షణకు సంబంధించిన అంశాలపై మాట్లాడి,ఆరోగ్యకరమైన అలవాట్లను పాటించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి ఎ. మహబూబ్ బాషా,జిల్లా సమగ్ర శిక్ష ప్రాజెక్ట్ అధికారి జి మమ్మీ , జిల్లా మెడికల్ ఆఫీసర్ ఎం సుమలత,డివైఈవో కిషోర్,చైల్డ్ కేర్ వెల్ఫేర్ సభ్యులు కే నాగమణి,పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు,ఆరోగ్య శాఖ సిబ్బంది,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

SURESH, AMALAPURAM

SURESH, AMALAPURAM