Nidadavole: తుఫాన్ బాధితులకు కూటమి ప్రభుత్వం అండ: మంత్రి దుర్గేష్
Nidadavole: అర్నబ్ తుఫాన్‌తో పంటలు నష్టపోయిన రైతులను కూటమి ప్రభుత్వం ఆదుకుంటుందని మంత్రి కందుల దుర్గేష్ నిడదవోలు నియోజకవర్గంలో పర్యటించి భరోసా ఇచ్చారు.
Nidadavole: తుఫాన్ బాధితులకు కూటమి ప్రభుత్వం అండ: మంత్రి దుర్గేష్
Nidadavole: 'అర్నబ్' తుఫాను ధాటికి కాకరపర్రులో నేలకొరిగిన వరి, అరటి తోటల పరిశీలన -పంట నష్ట వివరాలు సేకరించి ప్రతి రైతుకూ సకాలంలో పరిహారం అందించేందుకు కృషి చేస్తామని బాధిత రైతాంగానికి ధైర్యం చెప్పిన మంత్రి కందుల దుర్గేష్, టీడీపీ నియోజకవర్గ ఇంఛార్జ్ బూరుగుపల్లి శేషారావు.
నిడదవోలు: 'అర్నబ్' తుఫాను ప్రభావంతో పంటలు నష్టపోయిన రైతాంగానికి కూటమి ప్రభుత్వం పూర్తిస్థాయిలో అండగా ఉంటుందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. పెరవలి మండలం కాకరపర్రు గ్రామంలో తుఫాను ధాటికి నేలకొరిగిన వరి పంటలను, తీవ్రంగా దెబ్బతిన్న అరటి తోటలను గురువారం టీడీపీ నియోజకవర్గ ఇంఛార్జ్ బూరుగుపల్లి శేషారావుతో కలిసి మంత్రి కందుల దుర్గేష్ స్వయంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా క్షేత్రస్థాయిలో దెబ్బతిన్న పంట పొలాలను తిరుగుతూ బాధిత రైతులను కలిసి వారికి ధైర్యం చెప్పారు. ఆరుగాలం శ్రమించి పండించిన పంట చేతికొచ్చే సమయంలో తుఫాను బారినపడి నష్టపోవడం ఎంతో బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం స్థానిక ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున పూర్తి వివరాలు ప్రకటించలేమని, అయితే పంట నష్టపోయిన ప్రతి రైతునూ ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని మంత్రి దుర్గేష్ హామీ ఇచ్చారు. సంబంధిత అధికారుల ద్వారా నష్ట అంచనాలను సేకరించి, అర్హులైన ప్రతి రైతుకూ పరిహారం అందేలా చూస్తామన్నారు. సీఎం చంద్రబాబునాయుడు,డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ల దిశానిర్దేశంలో తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ప్రాణ, ఆస్తి నష్టాలను తగ్గించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేసిందని వివరించారు. రహదారులపై కూలిపోయిన చెట్ల తొలగింపు, విద్యుత్ పునరుద్ధరణ, తాగునీటి సరఫరా వంటి అత్యవసర పనులను యంత్రాంగం నిరంతరం శ్రమించి వేగవంతం చేసిందన్నారు. బుధవారం సాయంత్రం నిడదవోలు మండలం పందలపర్రు గ్రామంలో పర్యటించానని, ప్రాథమిక అంచనా ప్రకారం అక్కడ సుమారు 600 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిందని మంత్రి దుర్గేష్ వెల్లడించారు.నియోజకవర్గంలో తుఫాను ప్రభావం పూర్తిగా తొలగి, సాధారణ పరిస్థితులు నెలకొనేంత వరకు ఫోన్ లలో అధికారులతో సమన్వయం చేసుకుంటూ పర్యవేక్షిస్తామని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు.




