Alamuru: సాయంత్రం కోర్టుల ఏర్పాటుపై ఆలమూరు న్యాయవాదుల నిరసన!

Alamuru: కేంద్ర న్యాయశాఖ అమలు చేయనున్న సాయంత్రం కోర్టుల ఏర్పాటును వ్యతిరేకిస్తూ ఆలమూరు బార్ అసోసియేషన్ న్యాయవాదులు శుక్రవారం కోర్టు విధులను బహిష్కరించి నిరసన తెలిపారు.

TRIMURTULU, KOTHAPETA
Published on: 13 Nov 2026 4:53 PM IST
Alamuru
X

Alamuru: సాయంత్రం కోర్టుల ఏర్పాటుపై ఆలమూరు న్యాయవాదుల నిరసన!

ఆలమూరు: కేంద్ర న్యాయశాఖ అమలు చేయనున్న సాయంత్రం కోర్టుల (ఈవెనింగ్ కోర్టులు) ఏర్పాటును వ్యతిరేకిస్తూ ఆలమూరు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు బార్ అసోసియేషన్ న్యాయవాదులు శుక్రవారం తమ విధులను బహిష్కరించి నిరసన తెలిపారు. బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఎస్.కే. షరీఫ్ ఆధ్వర్యంలో కోర్టు ఆవరణలో న్యాయవాదులు ఆందోళన చేపట్టారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉదయం నుంచి సాయంత్రం వరకు సాధారణ కోర్టు విధుల్లో పాల్గొన్న తర్వాత, తిరిగి రాత్రి వేళల్లో కోర్టులకు హాజరుకావడం వల్ల న్యాయవాదులపై శారీరకంగా మరియు మానసికంగా తీవ్ర ఒత్తిడి పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.

అంతేకాకుండా సాయంత్రం వేళల్లో కోర్టులు జరిగితే దూర ప్రాంతాల నుంచి వచ్చే కక్షిదారులు, సాక్షులు, ముఖ్యంగా మహిళా న్యాయవాదులు రాత్రి సమయాల్లో తిరిగి ఇళ్లకు చేరుకోవడానికి రవాణా మరియు భద్రతాపరమైన ఇబ్బందులు ఎదురవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు.

అదనపు సమయం కోర్టులు నిర్వహించడానికి అవసరమైన సిబ్బంది, భద్రత మరియు ఇతర మౌలిక సదుపాయాలు లేకుండా సాయంత్రం కోర్టులు పెట్టడం సరికాదని పలువురు న్యాయవాదులు అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం వెంటనే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో న్యాయవాదులు సలాది సత్యనారాయణమూర్తి, గానుగుల శేషారావు, చల్లా సతీష్, ఎస్విఎస్ఎన్ మూర్తి,నరసింహమూర్తి ఆలమూరు బార్ అసోసియేషన్ న్యాయవాదులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

TRIMURTULU, KOTHAPETA

TRIMURTULU, KOTHAPETA