Rajahmundry: ఎన్నికల్లో 100 శాతం స్ట్రైక్ రేట్ సాధిస్తాం: ఎమ్మెల్యే ఆదిరెడ్డి!
Rajahmundry: రాజమండ్రి కార్పొరేషన్ ఎన్నికల్లో 100 శాతం స్ట్రైక్ రేట్ సాధిస్తామని, గొర్రెల సురేష్ చేరికతో టీడీపీకి బలం పెరిగిందని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు.
Rajahmundry: ఎన్నికల్లో 100 శాతం స్ట్రైక్ రేట్ సాధిస్తాం: ఎమ్మెల్యే ఆదిరెడ్డి!
రాజమండ్రి: నగరపాలక సంస్థ ఎన్నికల్లో 42 డివిజన్లలోనూ కూటమి అభ్యర్థులను గెలిపించుకుని 100 శాతం స్ట్రైక్ రేట్ సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ స్పష్టం చేశారు. గత రెండున్నరేళ్లలో నగరంలో సుమారు రూ.600 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని, గోదావరి పుష్కరాల నేపథ్యంలో మరో రూ.500–600 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు.
నగర అభివృద్ధి, సంక్షేమానికి ప్రజలు మరోసారి అండగా నిలిచి కూటమికి ఘన విజయాన్ని అందించాలని విజ్ఞప్తి చేశారు. పాత 12వ డివిజన్ (ప్రస్తుతం 43వ డివిజన్) మాజీ కార్పొరేటర్ గొర్రెల సురేష్ సుమారు 300 మంది అనుచరులతో టీడీపీలో చేరడం పార్టీకి మరింత బలాన్నిచ్చిందన్నారు. నగర ప్రముఖులు కోనేరు మురళి ఆధ్వర్యంలో గొర్రెల సురేష్ తన అనుచరులతో కలిసి తిలక్ రోడ్డులోని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ కార్యాలయానికి చేరుకున్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే వాసు వారికి పార్టీ కండువాలు కప్పి తెలుగుదేశం పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 2014–19 మధ్య నగరపాలక సంస్థలో ప్రజలు ఎన్నుకున్న కౌన్సిల్ కొనసాగిందని, 2019 తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించకుండా ఉద్దేశపూర్వకంగా జాప్యం చేయడం వల్ల నగరం అనేక విధాలుగా నష్టపోయిందన్నారు.
ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన 15వ ఆర్థిక సంఘం నిధులు వంటి అవకాశాలను నగరం కోల్పోయిందని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత న్యాయపరమైన సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటూ స్థానిక సంస్థల ఎన్నికలకు మార్గం సుగమం చేసిందన్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించాలంటే ప్రజాప్రతినిధులతో కూడిన కౌన్సిల్ ఉండాలని, నగరం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలన్నదే తమ సంకల్పమని స్పష్టం చేశారు.
సుదీర్ఘ విరామం తర్వాత ఎన్నికలు జరుగుతుండటంతో మూడు పార్టీల్లోనూ ఆశావహులు ఎక్కువగా ఉన్నారని, అయితే అభ్యర్థుల ఎంపికలో సామాజిక సమీకరణాలు, ప్రజల్లో అందుబాటు, నాయకుల పనితీరు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకున్నామన్నారు. గొర్రెల సురేష్ మాజీ కార్పొరేటర్‌గా అనుభవం కలిగిన వ్యక్తి కావడంతో పాటు ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడిగా గుర్తింపు పొందారని, ఆయనకు అవకాశం కల్పించాలన్న స్థానిక ప్రజల అభిప్రాయాన్ని గౌరవిస్తూ పార్టీలోకి ఆహ్వానించామని తెలిపారు.
కూటమిలోని టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పార్టీ అధినాయకత్వం తీసుకున్న నిర్ణయాలకు కట్టుబడి పనిచేయాలని కోరారు. కొన్ని చోట్ల ఆశించిన అవకాశం లభించకపోయినా, పార్టీ కోసం కష్టపడిన ప్రతి కార్యకర్తను గౌరవించే బాధ్యత నాయకత్వంపై ఉందన్నారు. ప్రతి ఒక్కరికీ తగిన గుర్తింపు, అవకాశాలు కల్పించేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. అయితే కూటమి నిర్ణయాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తే క్రమశిక్షణ చర్యలు తప్పవని స్పష్టం చేశారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ నాయకత్వంలో కూటమి ఐక్యంగా ముందుకు సాగుతోందని, 2029లోనూ కూటమి అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. టీడీపీకి బలమైన పట్టున్న రాజమహేంద్రవరంలో బీజేపీకి కేటాయించిన స్థానాలను సైతం కూటమి అభ్యర్థులుగా గెలిపించుకుంటామని తెలిపారు.
డిప్యూటీ మేయర్ పదవి సహా అన్ని అంశాల్లోనూ కూటమి ఐక్యత, స్ఫూర్తికి ప్రాధాన్యత ఇస్తామన్నారు. గత రెండున్నరేళ్లలో నగరంలో చేపట్టిన అభివృద్ధి పనుల్లో భాగంగా మల్టీపర్పస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్, గోదావరి రివర్ ఫ్రంట్ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. క్వారీ ప్రాంతంలో దశాబ్దాలుగా నెలకొన్న తాగునీటి సమస్యకు సుమారు రూ.200 కోట్లతో పరిష్కారం చూపించామన్నారు.
ప్రధాన రహదారులతో పాటు అంతర్గత రహదారులు, డ్రైనేజీలు, పార్కుల అభివృద్ధికి కూడా ప్రాధాన్యత ఇచ్చామని చెప్పారు. వచ్చే జూన్ 2027 నాటికి నగరంలో డంపింగ్ యార్డ్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించి, డంపింగ్ యార్డ్ లేకుండా చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని వెల్లడించారు. ఎన్నికల ప్రచారానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని, ఎక్కడికి వెళ్లినా అభివృద్ధి పనులను గుర్తించి తమ అభ్యర్థులకు మద్దతు ప్రకటిస్తున్నారని తెలిపారు.
చిన్నచిన్న లోటుపాట్లను సరిదిద్దుకుంటూ ప్రజల ఆశీర్వాదంతో ముందుకు సాగుతున్నామని చెప్పారు. రాబోయే నగరపాలక సంస్థ ఎన్నికల్లో కూటమి విజయదుందుభి మోగించి, రాజమహేంద్రవరం నుంచే 2029 ఎన్నికలకు విజయవంతమైన నాంది పలుకుతామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ధీమా వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో నగర టీడీపీ అధ్యక్షులు మజ్జి రాంబాబు, నాయకులు చల్లా శంకర రావు, దొండపాటి శంకరరావు, సూరంపూడి శ్రీహరి, అధిక సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.




