Rajahmundry: విధి నిర్వహణలో ప్రలోభాలకు గురికావద్దు!

Rajahmundry: రాజమండ్రి మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ ఆధ్వర్యంలో విజిలెన్స్ అవగాహన వారోత్సవాలు. విధి నిర్వహణలో ప్రలోభాలకు గురికావద్దని అడిషనల్ ఎస్పీ భవ్య కిషోర్ పిలుపు.

RAGHAVENDRA, RAJUMUNDRY CITY
Published on: 1 Nov 2026 7:22 AM IST
Rajahmundry
X

Rajahmundry: విధి నిర్వహణలో ప్రలోభాలకు గురికావద్దు!

Rajahmundry: విధి నిర్వహణలో ప్రలోభాలకు గురికాకుండా, అవినీతికి లొంగకుండా నిజాయితీగా పని చేయడం అనేది ప్రతి ఉద్యోగి ప్రాథమిక బాధ్యత అని అడిషిన‌ల్ ఎస్పీ(ఏసీబీ) భ‌వ్య కిషోర్ అన్నారు. నగరపాలక కార్యాలయంలోని పీజీఆర్ఎస్ హాల్ నందు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ఆధ్వర్యంలో శ‌నివారం విజిలెన్స్ అవ‌గాహ‌న‌ వారోత్సవాల‌ను నిర్వ‌హించారు. కార్యక్రమంలో అడిష‌న‌ల్ ఎస్పీ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.

ఈ సంద‌ర్భంగా పీసీ యాక్ట్(పీవెన్ష‌న్ ఆఫ్ క‌ర‌ప్ష‌న్ యాక్ట్-1988), ఆంధ్రప్రదేశ్ సివిల్ సర్వీసెస్ (ప్రవర్తన) నియమావళి - 1964, సీసీఏ రూల్స్-1991, విజిలెన్స్ మాన్యువ‌ల్ పై అవ‌గాహ‌న క‌ల్పించారు. అనంత‌రం అడిషిన‌ల్ ఎస్పీ(ఏసీబీ) భ‌వ్య కిషోర్ మాట్లాడుతూ.. విజిలెన్స్ వారోత్సవాలలో భాగంగా సమాజంలో అవినీతిని రూపుమాపడం కోసం వివిధ రంగాలలోని ప్రజలకు అవినీతి నిరోధక శాఖ ఆధ్వ‌ర్యంలో విస్తృత అవగాహన మ‌రియు ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్న‌ట్లు వెల్ల‌డించారు.

పాల‌న‌లో నిజాయ‌తీ, పార‌ద‌ర్శ‌క‌త‌, జ‌వాబుదారీత‌నం పెంపొందించ‌డం, అవినీతి నివార‌ణ‌పై ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న క‌ల్పించ‌డ‌మే ఈ వారోత్స‌వాల ప్ర‌ధాన ఉద్దేశ‌మ‌ని పేర్కొన్నారు. ప్ర‌భుత్వ రంగంలో పనిచేయు ఉద్యోగులు బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నప్పుడు అనేక రకాల ఆకర్షణలు, లంచాలు లేదా వ్యక్తిగత ప్రయోజనాల రూపంలో ప్రలోభాలు ఎదురుకావచ్చ‌ని పేర్కొన్నారు. కానీ నియమ నిబంధనలకు కట్టుబడి పనిచేయడం వల్ల భవిష్యత్తులో వచ్చే ఎలాంటి చట్టపరమైన ఇబ్బందుల నుండైనా మనల్ని మనం రక్షించుకోవచ్చన్నారు.

అలాగే చేయవలసిన పనిని చేయకపోవడం, నిర్లక్ష్యం వహించడం లేదా ఉద్దేశపూర్వకంగా వదిలేయడం కూడా ఒక రకమైన అవినీతి కిందకే వస్తుంద‌ని అడిషిన‌ల్ ఎస్పీ అన్నారు. కావున ప్ర‌భుత్వ కార్యాల‌యాల‌లో ప‌నిచేసే అధికారులు, ఉద్యోగులు అత్యున్న‌త నైతిక ప్ర‌మాణాలు, నిజాయ‌తీతో ప‌నిచేయాల‌న్న‌దే కార్య‌క్ర‌మ ముఖ్య ఉద్దేశ‌మ‌ని పేర్కొన్నారు. అనంత‌రం అవినీతి ర‌హిత స‌మాజ నిర్మాణానికి పాటుప‌డ‌దామ‌ని ఉద్యోగులచే ప్ర‌తిజ్ఞ చేయించారు. స‌మావేశంలో అద‌న‌పు క‌మిష‌న‌ర్(ఆర్.ఎం.సి) పీవీ రామ‌లింగేశ్వ‌ర్, సీఐ(ఏసీబీ) ఎన్.వి.భాస్క‌ర్ రావు, ఇన్స్ పెక్ట‌ర్లు(ఏసీబీ) కె.గోవింద‌రాజు, డి.వాసు కృష్ణ‌, ఇత‌ర మునిసిప‌ల్ అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

RAGHAVENDRA, RAJUMUNDRY CITY

RAGHAVENDRA, RAJUMUNDRY CITY