Katrenikona: విద్యుత్ శాఖ నిర్లక్ష్యం.. హైటెన్షన్ వైరు తాకి 5 పాడి గేదెలు మృతి!
Katrenikona: కాట్రేనికోన మండలం చిర్రయానం గ్రామంలో హైటెన్షన్ విద్యుత్ వైరు తాకి ఐదు పాడి గేదెలు మృతి. కన్నీరుమున్నీరవుతున్న రైతు కుటుంబం.
Katrenikona: విద్యుత్ శాఖ నిర్లక్ష్యం.. హైటెన్షన్ వైరు తాకి 5 పాడి గేదెలు మృతి!
Katrenikona: కాట్రేనికోన మండలం చిర్రయానం గ్రామంలో విద్యుత్ షాక్‌కు గురై ఐదు పాడి గేదెలు మృతి చెందడంతో విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన రైతు పాలెపు రామకృష్ణకు చెందిన పాడి గేదెలు హైటెన్షన్ విద్యుత్ వైరు తాకడంతో మృత్యవాత పడ్డాయి.
గ్రామంలో హైటెన్షన్ విద్యుత్ వైరు ప్రమాదకరంగా కిందకు వేలాడుతూ ఉండటమే ప్రమాదానికి కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. వైర్ల పరిస్థితిని అధికారులు, సిబ్బంది పట్టించుకోకపోవడం వల్లే ఈ ఘటన జరిగిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఐదు పాడి పశువులపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్న రామకృష్ణ కుటుంబానికి ఈ ఘటన తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. భార్య, ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్న రామకృష్ణ కుటుంబానికి పాడి పశువులే ప్రధాన జీవనాధారం. కళ్లముందే పశువులు విద్యుత్ షాక్‌కు బలవడంతో రామకృష్ణ కన్నీరుమున్నీరుగా విలపించారు.
విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే తన పాడి పశువులు మృతి చెందాయని, తమకు న్యాయం చేసి తగిన పరిహారం అందించాలని రామకృష్ణ కోరారు.
ఘటనపై సమాచారం అందుకున్న వెటర్నరీ వైద్యుడు మృతిచెందిన పాడి పశువులను పరిశీలించారు. విద్యుత్ షాక్‌కు గురికావడం వల్లే పశువులు మృతి చెందినట్లు నిర్ధారించారు.
ఇకనైనా విద్యుత్ శాఖ అధికారులు స్పందించి ప్రమాదకరంగా వేలాడుతున్న హైటెన్షన్ వైర్లను వెంటనే సరిచేయాలని గ్రామస్థులు కోరుతున్నారు.
మృతిచెందిన పాడి పశువులకు తగిన పరిహారం అందించి, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.




