P Gannavaram: మూడేళ్ల వయసులోనే ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం!

P Gannavaram: అంబేద్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం మండలానికి చెందిన మూడేళ్ల చిన్నారి పరిష్కృత దేవి 27 సంస్కృత శ్లోకాలను పఠించి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సాధించింది.

RAJU, P GANNAVARAM
Published on: 17 Oct 2026 8:02 AM IST
P Gannavaram
X

P Gannavaram: మూడేళ్ల వయసులోనే ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం!

P Gannavaram: పిట్ట కొంచెం.. కూత ఘనం అన్న సామెతను నిజం చేస్తూ ఓ బుజ్జాయి తన అసాధారణ ప్రతిభతో అందరినీ అబ్బురపరిచింది. ఆడుతూ పాడుతూ గడపాల్సిన పసి వయసులోనే సంస్కృత శ్లోకాలను అలవోకగా పఠిస్తూ జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించింది. వయసు చిన్నదే అయినా.. ప్రతిభలో మాత్రం ఆ చిన్నారి ఘనత అంతా ఇంతా కాదు. కేవలం మూడేళ్ల వయసులోనే 27 విభిన్న సంస్కృత శ్లోకాలను ఐదు నిమిషాల 9 సెకన్లలో పఠించి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించింది.

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి. గన్నవరం మండలం బోడపాటివారిపాలెం గ్రామానికి చెందిన యడ్లపల్లి అవినాష్, ప్రశాంతి దంపతుల కుమార్తె పరిష్కృత దేవి ఈ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. చిన్న వయసులోనే సంస్కృత భాషపై ఆసక్తి పెంచుకున్న పరిష్కృత.. శ్లోకాల పఠనంపై ప్రత్యేక శ్రద్ధ చూపించింది. నిరంతర సాధన, తల్లిదండ్రుల ప్రోత్సాహం తోడవడంతో అతి తక్కువ వయసులోనే అద్భుతమైన జ్ఞాపకశక్తిని ప్రదర్శించింది.

బుడిబుడి అడుగుల వయసులోనే.. బలమైన జ్ఞాపకశక్తి!

సాధారణంగా మూడేళ్ల చిన్నారులు బుడిబుడి అడుగులు వేస్తూ ఆటపాటలతో కాలక్షేపం చేస్తుంటారు. కానీ పరిష్కృత మాత్రం సంస్కృత శ్లోకాలను స్పష్టంగా, వరుసగా పఠిస్తూ తన ప్రత్యేకతను చాటుకుంది. 27 విభిన్న శ్లోకాలను కేవలం 5 నిమిషాల 9 సెకన్లలో పఠించడం ఆమె ఏకాగ్రతకు, జ్ఞాపకశక్తికి నిదర్శనంగా నిలిచింది. ఈ ప్రతిభను గుర్తించిన ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ ఆమెకు రికార్డు ధ్రువీకరణను అందించింది.

భారతీయ సంస్కృతికి బాల్యపు బాటలు!

చిన్నప్పటి నుంచే పిల్లలకు భారతీయ సంస్కృతి, సంస్కృత భాష, సంప్రదాయాలపై అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో పరిష్కృతను శ్లోకాల అభ్యాసం వైపు ప్రోత్సహించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. తల్లిదండ్రుల ప్రోత్సాహానికి చిన్నారి ఆసక్తి, కృషి తోడవడంతో ఈ అరుదైన గుర్తింపు సాధ్యమైందని ఆనందం వ్యక్తం చేశారు. భవిష్యత్తులోనూ మరిన్ని శ్లోకాలు, భారతీయ సంప్రదాయాలకు సంబంధించిన అంశాలను నేర్చుకుంటూ పరిష్కృత తన ప్రతిభను మరింతగా పెంపొందించుకోవాలని ఆకాంక్షించారు.

మూడేళ్ల వయసులోనే ఇంతటి ఘనత సాధించిన పరిష్కృతను కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, గ్రామస్థులు అభినందిస్తున్నారు. చిన్నారి సాధించిన ఈ విజయం తల్లిదండ్రులకే కాదు.. గ్రామానికే గర్వకారణంగా నిలిచింది.

RAJU, P GANNAVARAM

RAJU, P GANNAVARAM