Rajahmundry: లూథరన్ హైస్కూల్‌లో రూ.20 లక్షలతో భోజనశాల నిర్మాణం

Rajahmundry: రాజమండ్రి జాంపేట లూథరన్ ఎయిడెడ్ హైస్కూల్‌లో రూ.20 లక్షల సీఎస్ఆర్ నిధులతో నిర్మిస్తున్న విద్యార్థుల భోజనశాల పనులను ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పరిశీలించారు.

RAGHAVENDRA, RAJUMUNDRY CITY
Published on: 6 Nov 2026 3:35 PM IST
Rajahmundry
X

Rajahmundry: లూథరన్ హైస్కూల్‌లో రూ.20 లక్షలతో భోజనశాల నిర్మాణం

రాజమండ్రి: నగరంలోని జాంపేట లూథరన్ ప్రభుత్వ ఎయిడెడ్ ఉన్నత పాఠశాలలో విద్యార్థుల సౌకర్యార్థం సీఎస్ఆర్ నిధులతో రూ.20 లక్షల వ్యయంతో నిర్మిస్తున్న భోజనశాల శాశ్వత భవన నిర్మాణ పనులను రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పరిశీలించారు. విద్యార్థుల భోజన వసతి కోసం చేపట్టిన ఈ నిర్మాణంలో భాగంగా స్లాబ్ పనులను పరిశీలించి దాతృత్వానికి ముందుకొచ్చిన దాతలను అభినందించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ గతంలో పాఠశాలలో జరిగిన ఓ కార్యక్రమానికి వచ్చిన సమయంలో విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో భోజనం చేసేందుకు సరైన వసతి లేదని పాఠశాల యాజమాన్యం తమ దృష్టికి తీసుకువచ్చిందన్నారు. విద్యార్థుల అవసరాన్ని గుర్తించి, శాశ్వతంగా ఉపయోగపడే నిర్మాణానికి ఎవరైనా దాతలు ముందుకు రావాలని కోరినట్లు తెలిపారు.

తన విజ్ఞప్తికి స్పందించిన శ్రీను వెంటనే భవన నిర్మాణానికి సహకరించేందుకు ముందుకు వచ్చారని, తొలుత షెడ్డు నిర్మాణంగా ప్రారంభమైన ఆలోచనను మరింత విస్తరించి రూ.20 లక్షలతో కాంక్రీట్ నిర్మాణంగా చేపట్టడం అభినందనీయమన్నారు. ఈ భవనం తరతరాల విద్యార్థులకు ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.

ఈ గొప్ప కార్యక్రమానికి సహకరించిన శ్రీను, వారి కుటుంబ సభ్యులు, స్నేహితులు, శ్రేయోభిలాషులకు శాసనసభ్యుడిగా, పాఠశాల విద్యార్థుల తరఫున మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు. నగరంలో సంపన్నులు ఎంతోమంది ఉన్నప్పటికీ, సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలకు మనస్ఫూర్తిగా ముందుకొచ్చే వారు కొందరే ఉంటారని అన్నారు.

సంపదతో పాటు సేవా భావం కూడా కలిగి ఉండాలని, మనకు దేవుడు ఇచ్చిన అవకాశాలను ఇతరులకు ఉపయోగపడేలా వినియోగించుకున్నప్పుడే వాటికి సార్థకత చేకూరుతుందన్నారు. ఇలాంటి దాతృత్వ కార్యక్రమాలు మరో పది మందికి స్ఫూర్తినిస్తాయని, భవిష్యత్తులో మరింతమంది దాతలు విద్య, వైద్యం, సామాజిక అభివృద్ధి కార్యక్రమాలకు ముందుకు రావాలని ఆకాంక్షించారు.

విద్యార్థుల భవిష్యత్తుకు ఉపయోగపడే ఈ నిర్మాణ కార్యక్రమంలో భాగస్వామ్యం కల్పించిన దాతలకు, పాఠశాల యాజమాన్యానికి ఎమ్మెల్యే ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.

RAGHAVENDRA, RAJUMUNDRY CITY

RAGHAVENDRA, RAJUMUNDRY CITY