Malikipuram: బట్టేలంకలో ఓఎన్జీసీ భారీ వాహనం బ్రేక్‌డౌన్: స్తంభించిన ట్రాఫిక్

Malikipuram: కోనసీమ జిల్లా మలికిపురం మండలం బట్టేలంక కూడలిలో ఓఎన్జీసీ భారీ రిగ్ వాహనం మలుపు తిరగలేక నిలిచిపోవడంతో గంటల తరబడి రాకపోకలు స్తంభించాయి.

PRABHU, RAZOLE
Published on: 3 Oct 2026 3:33 PM IST
Malikipuram
X

Malikipuram: బట్టేలంకలో ఓఎన్జీసీ భారీ వాహనం బ్రేక్‌డౌన్: స్తంభించిన ట్రాఫిక్

మలికిపురం: బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా మలికిపురం మండలం బట్టేలంక గాంధీ బొమ్మ కూడలిలో ఓఎన్జీసీకి చెందిన భారీ రిగ్‌ క్యారియర్‌ వాహనం ఇరుక్కుపోవడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సుమారు 60 అడుగుల పొడవు, 100 టన్నుల బరువు ఉన్న వాహనం ఇరుకైన రహదారిలో మలుపు తిరగలేక రెండు, మూడు గంటల పాటు రోడ్డుపైనే నిలిచిపోయింది.

అడవిపాలెంలోని ఓఎన్జీసీ జీసీఎస్‌ సైట్‌లో పనులు ముగించుకుని బట్టేలంక–లక్కవరం–శివకోడు బైపాస్‌ మార్గం మీదుగా బంటుమిల్లి వైపు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. మలుపు వద్ద వాహనం అదుపు కాక ఓ బడ్డీని ఢీకొనడంతో స్వల్పంగా దెబ్బతింది. వాహనాన్ని ముందుకు కదిలించేందుకు రహదారి పక్కన ఉన్న చెట్టు కొమ్మలను తొలగించాల్సి వచ్చింది.

సమాచారం అందుకున్న మలికిపురం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. భారీ వాహనం రోడ్డుపై నిలిచిపోవడంతో స్థానికులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. శనివారం మధ్యాహ్నం వరకు వాహనం అక్కడే ఉండటంతో అధికారులు పర్యవేక్షణలో దాన్ని సురక్షితంగా తరలించే చర్యలు చేపట్టారు.

ఇరుకైన గ్రామీణ రహదారుల్లో భారీ వాహనాల రాకపోకలకు అనుమతులు ఇచ్చే ముందు రహదారి సామర్థ్యాన్ని పరిశీలించాలని గ్రామస్తులు కోరుతున్నారు. ప్రజలకు, ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా అవసరమైన చోట ప్రత్యామ్నాయ మార్గాలు, ముందస్తు భద్రతా చర్యలు చేపట్టాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.

PRABHU, RAZOLE

PRABHU, RAZOLE