Karmakhya OTT Review : నరబలి కోసం యువతిని బంధించారు.. ‘కర్మాఖ్య’ ఎలా ఉందంటే?
Karmakhya OTT Review: 'జబర్దస్త్' షో ద్వారా నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న అభినయ కృష్ణ (అదిరే అభి), దర్శకుడిగా మారిన విషయం తెలిసిందే. 'చిరంజీవ' సినిమా
Karmakhya OTT Review : నరబలి కోసం యువతిని బంధించారు.. ‘కర్మాఖ్య’ ఎలా ఉందంటే?
Karmakhya OTT Review : 'జబర్దస్త్' షో ద్వారా నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న అభినయ కృష్ణ (అదిరే అభి), దర్శకుడిగా మారిన విషయం తెలిసిందే. 'చిరంజీవ' సినిమా తర్వాత ఆయన దర్శకత్వం వహించిన రెండో చిత్రం 'కర్మాఖ్య'. సమైరా ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ మిస్టీరియస్ థ్రిల్లర్ మూవీ జులై 31న థియేటర్లలో విడుదలైంది. ప్రస్తుతం ఈ చిత్రం 'జియో హాట్‌స్టార్' వేదికగా డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. సమాజంలో వెలుగుచూసిన కొన్ని నిజ జీవిత మూఢనమ్మకాల సంఘటనల ఆధారంగా ఈ కథను రూపాందించారు.
అమాయకంగా అడుగుపెట్టి.. చావు గడపలో చిక్కుకున్న కామాఖ్య
చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయిన కామాఖ్య (సమైరా) అనే యువతి వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్‌లో ఉంటూ ఉద్యోగ వేటలో ఉంటుంది. ఆమె రూమ్మేట్ ప్రవల్లిక (శరణ్య ప్రదీప్) ఒక ఇన్సూరెన్స్ కంపెనీలో పనిచేస్తుంటుంది. ఒక రోజు ప్రవల్లికకు ఫంక్షన్ ఉండటంతో, ఇన్సూరెన్స్ క్లైమ్ పనిమీద కామాఖ్యను విశాఖపట్నంలోని సరోజిని (అభిరామి), ప్రభాకర్ (ఆనంద్) దంపతుల ఇంటికి పంపిస్తుంది. చనిపోయిన వారి కూతురు 'ప్రజ్ఞ' ఇన్సూరెన్స్ పాలసీ కోసం కామాఖ్య అక్కడికి వెళ్తుంది. వారి ఆత్మీయ పలకరింపులకు మొహమాటపడి భోజనానికి కూర్చున్న కామాఖ్య, ఆ ఆహారంలో మత్తుమందు కలపడంతో కళ్లు తిరిగి పడిపోతుంది.
కళ్లు తెరిచేసరికి ఆ దంపతులు ఆమెను ఒక గదిలో బంధిస్తారు. పది నెలల క్రితం చనిపోయిన తమ కూతురు ప్రజ్ఞ మృతదేహాన్ని బ్రతికించుకోవడం కోసం కామాఖ్యను 'నరబలి' ఇవ్వాలని ఆ సైకో దంపతులు నిర్ణయించుకుంటారు. అందుకోసం ఆ గదిలోనే క్షుద్రపూజలు మొదలుపెడతారు. అసలు కామాఖ్యనే బలి ఇవ్వడానికి కారణం ఏంటి? చనిపోయిన శవం మధ్య, ఆ రాక్షస కుటుంబం నుంచి కామాఖ్య ఎలా బయటపడింది అనేది మిగతా కథాంశం.
ఉత్కంఠ రేకెత్తించే తాంత్రిక నేపథ్యం.. మెప్పించే క్లైమాక్స్
కామాఖ్యాదేవి శక్తిపీఠం, తాంత్రిక పూజలు చేసే వంశం కథనంతో ఆరంభంలోనే దర్శకుడు అభి ప్రేక్షకుల్లో కుతూహలాన్ని పెంచాడు. అమాయకపు యువతి ఒక సైకో కుటుంబం చేతిలో చిక్కుకోవడం, అక్కడి నుంచి తప్పించుకోవడానికి చేసే ప్రయత్నాలు ప్రేక్షకులలో భయాన్ని కలిగిస్తాయి. కథనం ప్రీ-క్లైమాక్స్‌కు చేరుకునే క్రమంలో లంచగొండి పోలీస్ ఆఫీసర్ 'తిరుపతి'గా సముద్రఖని ఎంట్రీ ఇవ్వడంతో సినిమా మరింత వేగం పుంజుకుంటుంది. తక్కువ బడ్జెట్‌లో పరిమిత నటీనటులతోనే దర్శకుడు అభి కథను చివరి వరకు సడలని పట్టుతో నడిపించాడు.
సినిమాకు ప్లస్.. మైనస్ పాయింట్లు
సమైరా, శరణ్య ప్రదీప్, అభిరామి, ఆనంద్, సముద్రఖని తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. నటీనటుల అద్భుత నటన, నేపథ్య సంగీతం, ఎడిటింగ్ సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి. అయితే 'కర్మాఖ్య' అనే టైటిల్ కాస్త పలకడానికి ఇబ్బందిగా ఉండటం, సాధారణ ప్రేక్షకులకు త్వరగా కనెక్ట్ కాకపోవడం చిన్న లోపంగా అనిపిస్తుంది. సరళమైన టైటిల్ పెట్టి ఉంటే బాగుండేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏది ఏమైనా, డిఫరెంట్ కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ మిస్టీరియస్ థ్రిల్లర్ ఓటీటీ వీక్షకులను ఆకట్టుకుంటోంది.




