Markapur: వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు అర్హతల ఆధారంగా పరిహారం

Markapur: వెలిగొండ నిర్వాసితులకు అర్హతల ఆధారంగా పారదర్శకంగా పరిహారం అందిస్తామన్న కలెక్టర్ ఎం. విజయ సునీత. రేపు తహసీల్దార్ కార్యాలయాల్లో అర్హుల జాబితా ప్రదర్శన.

SREENIVAS YANNAM, MARKAPURAM
Published on: 26 Sept 2026 10:14 PM IST
Markapur
X

Markapur: వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు అర్హతల ఆధారంగా పరిహారం

మార్కాపూర్: పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు అర్హతల ఆధారంగా పరిహారం అందిస్తామని జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత స్పష్టం చేశారు. శనివారం మార్కాపురం కలెక్టరేట్‌లో నిర్వాసితుల పునరావాసం, పరిహారం చెల్లింపులపై నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడారు.

వెలిగొండ నిర్వాసితుల ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ కోసం ప్రభుత్వం మొత్తం రూ.906 కోట్లు మంజూరు చేసిందని, ఇప్పటికే రూ.758.31 కోట్ల పరిహారం చెల్లించామని తెలిపారు. ఒరిజినల్ డాక్యుమెంట్ల పరిశీలనతో పాటు క్షేత్రస్థాయి విచారణ కొనసాగుతోందని, దాదాపు 90 శాతం వెరిఫికేషన్ పూర్తయిందని వెల్లడించారు.

మేజర్ సన్స్ అండ్ డాటర్స్, మిస్సింగ్ కేటగిరీల్లో వచ్చిన దరఖాస్తులను ప్రత్యేక బృందాలు పరిశీలించాయని తెలిపారు. 1,989 మంది జాబితాలో ప్రాథమిక విచారణ అనంతరం 721 మంది అర్హులుగా గుర్తించగా, ఒరిజినల్ సర్టిఫికెట్లు, ఆన్‌లైన్ వెరిఫికేషన్ తర్వాత 708 మంది అర్హత సాధించారని వివరించారు. మరో 1,009 మంది మిస్సింగ్ కేటగిరీకి సంబంధించి పరిశీలనలో ఇప్పటివరకు 11 మంది అర్హులుగా తేలారని పేర్కొన్నారు.

తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో పరిహారం పొందేందుకు ప్రయత్నిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. అర్హులైన వారి పేర్లు జాబితాలో లేకపోయినా, అనర్హుల పేర్లు ఉన్నా వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలని గ్రామస్థులకు సూచించారు. అర్హులెవరూ నష్టపోకుండా, పారదర్శకంగా తుది జాబితా రూపొందిస్తామని తెలిపారు.

జాయింట్ కలెక్టర్ పి. శ్రీనివాసులు మాట్లాడుతూ, 3,589 కుటుంబాలు వన్‌టైమ్ సెటిల్‌మెంట్‌కు ఎంపిక చేసుకోగా, 3,732 కుటుంబాలు ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ కోసం దరఖాస్తు చేసుకున్నాయని వెల్లడించారు.

ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి మాట్లాడుతూ, దశాబ్దాలుగా ప్రాజెక్టు కోసం త్యాగాలు చేసిన నిర్వాసితులకు పరిహారం వేగంగా అందించాలని అధికారులకు సూచించారు. అసలైన లబ్ధిదారులకు న్యాయం జరిగేలా గ్రామస్థులు, ప్రజాప్రతినిధుల సహకారంతో జాబితా ఖరారు చేయాలని కోరారు.

రేపు ఉదయం తహసీల్దార్ కార్యాలయాల్లో అర్హుల జాబితా ప్రదర్శించనున్న నేపథ్యంలో నిర్వాసితుల్లో పరిహారంపై ఆశలు చిగురిస్తున్నాయి.

SREENIVAS YANNAM, MARKAPURAM

SREENIVAS YANNAM, MARKAPURAM