Podili: రోడ్డుపై చెత్త వేస్తే రూ.500 ఫైన్: పొదిలి కమిషనర్ హెచ్చరిక
Podili: పొదిలి నగర పంచాయతీ పరిధిలో రోడ్లపై చెత్త వేస్తే రూ.500 జరిమానా విధిస్తామని నూతన కమిషనర్ రామ్మోహన్‌రావు స్పష్టం చేశారు.
Podili: రోడ్డుపై చెత్త వేస్తే రూ.500 ఫైన్: పొదిలి కమిషనర్ హెచ్చరిక
పొదిలి: మార్కాపురం జిల్లా పొదిలి నగర పంచాయతీ నూతన కమిషనర్ రామ్మోహన్‌రావు పట్టణ పాలనలో తనదైన ముద్ర వేస్తున్నారు. పారిశుధ్యం, పన్నుల వసూళ్లు, మౌలిక వసతుల సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు.
స్వచ్ఛతా హి సేవా కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని పలు ప్రాంతాల్లో పర్యటిస్తున్న కమిషనర్.. రోడ్లపై చెత్త వేయకుండా ప్రజలు సహకరించాలని సూచిస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించి రోడ్లపై చెత్త వేస్తే రూ.500 జరిమానా విధిస్తామని హెచ్చరిస్తున్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు.
సమస్యల పరిష్కారానికి ప్రత్యేక నమోదు కేంద్రం
పట్టణంలో వీధి దీపాలు, మంచినీరు, మురుగుకాల్వలకు సంబంధించిన సమస్యలను ప్రజలు నేరుగా కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక నమోదు కేంద్రంలో నమోదు చేసుకోవచ్చని కమిషనర్ తెలిపారు. ఫిర్యాదు అందిన 24 నుంచి 48 గంటల్లో సమస్యను పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రజలు తమ సమస్య ఏదైనా అధికారుల దృష్టికి తీసుకురావాలని కోరారు.
పన్నుల వసూళ్లపై ప్రత్యేక దృష్టి
ఇంటి పన్నుల వసూళ్లను వేగవంతం చేసేందుకు ప్రతిరోజూ రూ.3 లక్షల వసూళ్లను లక్ష్యంగా పెట్టుకున్నామని కమిషనర్ తెలిపారు. ప్రస్తుతం రోజుకు సుమారు రూ.1.50 లక్షల వరకు పన్నులు వసూలు చేస్తున్నట్లు వెల్లడించారు. పట్టణ అభివృద్ధికి ప్రజలు తమ పన్నులను సకాలంలో చెల్లించి సహకరించాలని కోరారు.
వ్యాపారులకు ట్రేడ్ లైసెన్స్ తప్పనిసరి
పట్టణంలోని వ్యాపారులందరూ తప్పనిసరిగా ట్రేడ్ లైసెన్స్ తీసుకోవాలని కమిషనర్ సూచించారు. ట్రేడ్ లైసెన్స్ ఫీజుల్లో నూతనంగా మార్పులు తీసుకొచ్చినట్లు తెలిపారు. నిబంధనల ప్రకారం వ్యాపారులు లైసెన్సులు పొందాలని సూచించారు.
పట్టణ పారిశుధ్యం, పన్నుల వసూళ్లు, మౌలిక వసతుల సమస్యల పరిష్కారంలో ప్రజలు నగర పంచాయతీకి సహకరించాలని కమిషనర్ రామ్మోహన్‌రావు విజ్ఞప్తి చేశారు.




