Prakasam: విదేశీయుల వసతి వివరాలు 24 గంటల్లో నమోదు చేయాలి!
Prakasam: ప్రకాశం జిల్లాలో విదేశీయులకు వసతి కల్పించే హోటళ్లు, హాస్టళ్లు 24 గంటల్లోగా ఫారమ్-సి ఆన్లైన్లో నమోదు చేయాలని ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు హెచ్చరిక.
Prakasam: విదేశీయుల వసతి వివరాలు 24 గంటల్లో నమోదు చేయాలి!
Prakasam: ప్రకాశం జిల్లాలో విదేశీయులకు వసతి కల్పించే హోటళ్లు, గెస్ట్హౌస్లు, ఆసుపత్రులు, హాస్టళ్లు, విద్యాసంస్థలు, ఆశ్రమాలు, సత్రాలు, వ్యక్తిగత గృహ యజమానులు, ఇతర సంస్థల నిర్వాహకులు విదేశీయుల వివరాలను తప్పనిసరిగా ఆన్లైన్లో నమోదు చేయాలని జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు సూచించారు.
విదేశీయుల రాక, బస, బయలుదేరే వివరాలను నిర్దేశిత విధానంలో డిజిటల్ రిపోర్టింగ్ ద్వారా నమోదు చేసి, ఫారినర్స్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ (FRO)కు 24 గంటల్లోగా తెలియజేయాలని స్పష్టం చేశారు. ఈ నిబంధనలు ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా (OCI) కార్డుదారులు, నేపాల్, భూటాన్ దేశాల పౌరులకు కూడా వర్తిస్తాయని తెలిపారు.
విద్య, వైద్యం, పర్యటన, వ్యాపారం, ఇతర అవసరాల కోసం జిల్లాకు వచ్చే విదేశీయుల పాస్పోర్టు, వీసా, వ్యక్తిగత వివరాలు, వసతి సమాచారం, వచ్చిన తేదీ తదితర వివరాలను ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారినర్స్ చట్టం–2025, సెక్షన్ 8 ప్రకారం నిర్దేశిత వెబ్సైట్లో నమోదు చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
ఆన్లైన్ నమోదు తప్పనిసరి
విదేశీయుల వివరాలను https://indianfrro.gov.in/frro/FormC/login.jsp వెబ్సైట్లో Form-C/Form-III ద్వారా నమోదు చేసి, సంబంధిత FRRO, FRO కార్యాలయాలకు సకాలంలో సమాచారం అందించాలని ఎస్పీ సూచించారు. ఈ విషయంలో సంస్థల యాజమాన్యాలు నిర్లక్ష్యం చేయరాదని హెచ్చరించారు.
నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
విదేశీయుల వివరాలను నిర్దేశిత పోర్టల్లో నమోదు చేయకుండా నిబంధనలు ఉల్లంఘిస్తే ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారినర్స్ చట్టం–2025, సెక్షన్ 23(బి) ప్రకారం రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు జరిమానా, రెండేళ్ల నుంచి ఏడేళ్ల వరకు జైలు శిక్ష లేదా రెండూ విధించే అవకాశం ఉందని తెలిపారు.
కాబట్టి విదేశీయులకు వసతి లేదా సేవలు కల్పించే అన్ని సంస్థలు చట్టపరమైన నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు సూచించారు. జిల్లాకు వచ్చే విదేశీయులు కూడా భారత చట్టాలను గౌరవిస్తూ, చెల్లుబాటయ్యే వీసా నిబంధనలను పాటించాలని కోరారు.




