Peddaraveedu: దేవరాజుగట్టులో టీడీపీ జయకేతనం: మెట్టు లక్ష్మి ఘన విజయం!
Peddaraveedu: పెద్దారవీడు మండలం దేవరాజుగట్టు ఎంపీటీసీగా టీడీపీ అభ్యర్థి మెట్టు లక్ష్మీ శ్రీనివాసరెడ్డి 365 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించి తమ రాజకీయ పట్టును చాటుకున్నారు.
Peddaraveedu: దేవరాజుగట్టులో టీడీపీ జయకేతనం: మెట్టు లక్ష్మి ఘన విజయం!
పెద్దారవీడు: పెద్దారవీడు మండలం దేవరాజుగట్టు గ్రామంలో తెలుగుదేశం పార్టీ మరోసారి తన పట్టును నిరూపించుకుంది. రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పటికీ, అధికార అండదండలపై కాకుండా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల ఓట్లతోనే విజయం సాధించాలనే లక్ష్యంతో బరిలోకి దిగిన మెట్టు కుటుంబానికి ప్రజలు మరోసారి ఘన విజయాన్ని కట్టబెట్టారు. పెద్దారవీడు మండల టీడీపీ అధ్యక్షుడు మెట్టు శ్రీనివాసరెడ్డి సతీమణి, మాజీ సర్పంచ్ మెట్టు లక్ష్మీ శ్రీనివాసరెడ్డి దేవరాజుగట్టు ఎంపీటీసీ అభ్యర్థిగా పోటీ చేసి భారీ మెజార్టీతో విజయం సాధించారు.
ఈ ఎన్నికల్లో మొత్తం 1,791 ఓట్లు పోలవగా, టీడీపీ అభ్యర్థి మెట్టు లక్ష్మీ శ్రీనివాసరెడ్డికి 1,062 ఓట్లు లభించాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి 697 ఓట్లు వచ్చాయి. దీంతో 365 ఓట్ల భారీ మెజార్టీతో మెట్టు లక్ష్మీ శ్రీనివాసరెడ్డి ఘన విజయం సాధించారు. గతంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలోనూ మెట్టు శ్రీనివాసరెడ్డి దేవరాజుగట్టు సర్పంచ్‌గా పోటీ చేసి ఘన విజయం సాధించి రాజకీయ వర్గాలను ఆశ్చర్యపరిచారు. తాజాగా పెద్దారవీడు ఎంపీపీ పదవి మహిళకు రిజర్వ్ కావడంతో తన సతీమణి మెట్టు లక్ష్మీ శ్రీనివాసరెడ్డిని ఎంపీటీసీ అభ్యర్థిగా బరిలోకి దించారు.
ప్రజల్లో తమకున్న ఆదరణ, గ్రామస్థులతో ఉన్న అనుబంధమే పెట్టుబడిగా ఎన్నికల ప్రచారం నిర్వహించి భారీ మెజార్టీని సాధించారు. అధికారం మారినా.. ప్రజల అభిమానం మారలేదని, ఎన్నిక ఏదైనా ప్రజల తీర్పే తమకు ముఖ్యమని మెట్టు కుటుంబం ఈ విజయంతో మరోసారి చాటిచెప్పింది. దేవరాజుగట్టు గ్రామంలో మెట్టు కుటుంబానికి ఉన్న రాజకీయ పట్టును ఈ ఫలితం మరోసారి స్పష్టం చేసింది. ఈ విజయంతో టీడీపీ శ్రేణులు, మెట్టు కుటుంబ అభిమానులు సంబరాలు చేసుకున్నారు.




