Chirala: చీరాలలో ఉత్సాహంగా ఉమ్మడి ప్రకాశం జిల్లా స్థాయి బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు

Chirala: బాపట్ల జిల్లా చీరాలలోని డీఎస్ఏ ఇండోర్ స్టేడియంలో ఉమ్మడి ప్రకాశం జిల్లా స్థాయి బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు ఘనంగా నిర్వహించబడ్డాయి.

KaleshaVali (Bhasha), Chirala
Published on: 8 Oct 2026 9:01 AM IST
Chirala
X

Chirala: చీరాలలో ఉత్సాహంగా ఉమ్మడి ప్రకాశం జిల్లా స్థాయి బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు

Chirala: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యాశాఖ ఆధ్వర్యంలోని స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఉమ్మడి ప్రకాశం జిల్లా పరిధిలో 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించిన బ్యాడ్మింటన్ జిల్లా స్థాయి ఎంపిక పోటీలు బుధవారం చీరాలలో ఉత్సాహంగా నిర్వహించారు.

స్థానిక డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ ఇండోర్ స్టేడియంలో అండర్–14, అండర్–17, అండర్–19 బాలురు, బాలికల విభాగాల్లో బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు నిర్వహించారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరై తమ క్రీడా ప్రతిభను ప్రదర్శించారు.

ఈ పోటీల్లో బాలురు, బాలికలు ఉత్సాహంగా పాల్గొని ప్రతిభను కనబరిచారు. క్రీడాకారుల నైపుణ్యం, ఆటతీరు, సామర్థ్యాలను పరిశీలించిన న్యాయ నిర్ణేతలు, రిఫరీలు నిష్పక్షపాతంగా ఎంపిక ప్రక్రియను నిర్వహించారు. అండర్–14, అండర్–17, అండర్–19 విభాగాల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను తదుపరి స్థాయి పోటీలకు ఎంపిక చేసే ప్రక్రియ చేపట్టారు.

క్రీడాకారులను అభినందించిన డాక్టర్ ఐ. బాబురావు,డాక్టర్ రామకృష్ణ హనుమాన్ ఈ జిల్లా స్థాయి బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలకు ముఖ్యఅతిధులుగా ప్రముఖ వైద్యులు, ప్రేమ నర్సింగ్ హోమ్ అధినేత డాక్టర్ ఐ. బాబురావు ,డాక్టర్ రామకృష్ణ హనుమాన్ హాజరై క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే క్రీడలపై ఆసక్తి పెంపొందించుకోవడం వల్ల శారీరక దారుఢ్యంతో పాటు మానసిక ఉల్లాసం, క్రమశిక్షణ, పట్టుదల పెరుగుతాయని అన్నారు.

క్రీడల్లో గెలుపోటములను సమానంగా స్వీకరిస్తూ నిరంతరం సాధన కొనసాగించాలని క్రీడాకారులకు సూచించారు. ప్రతిభ ఉన్న విద్యార్థులకు ఇటువంటి జిల్లా స్థాయి ఎంపిక పోటీలు మంచి వేదికగా నిలుస్తాయని, క్రీడాకారులు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకుని రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు. పోటీల్లో పాల్గొంటున్న విద్యార్థులను డాక్టర్ బాబురావు,డాక్టర్ రామకృష్ణ హనుమాన్ అభినందించారు.

ఈ కార్యక్రమాన్ని సీనియర్ కోచ్ ప్రసాద్,ఎన్.రామకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఎస్.జి.ఎఫ్. కార్యదర్శి పి. కోటేశ్వరరావు, ఎస్ఏ.పీ.ఈ.లు కె. శ్రీనివాసు, యు. హనుమంతరావు, సుమలత, పీఈటీ కె. మమత, పీఈటీ బి. ధనుంజయ్, రిటైర్డ్ పీడీ పి. వెంకట్రావు, సీనియర్ రిఫరీ టి. కృష్ణ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ విద్యార్థుల్లో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికితీసి, వారిని జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించే క్రీడాకారులుగా తీర్చిదిద్దడమే స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ లక్ష్యమని తెలిపారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడలకు కూడా సమాన ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.

బ్యాడ్మింటన్ జిల్లా స్థాయి ఎంపిక పోటీల సందర్భంగా కోచ్ ప్రసాద్ స్నేహితులు సోని,పురుషోత్తమ్, షాహీద్, విద్యార్థులు, తల్లిదండ్రులు, వ్యాయామ ఉపాధ్యాయులు, పీఈటీలు, క్రీడాభిమానులతో డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ ఇండోర్ స్టేడియం సందడిగా మారింది.

KaleshaVali (Bhasha), Chirala

KaleshaVali (Bhasha), Chirala