Podili: పొదిలి వక్ఫ్ ఆస్తులపై దుమారం: ముస్లిం పెద్దల తీవ్ర ఆరోపణలు
Podili: పొదిలి వక్ఫ్ బోర్డు ఆస్తుల్లో గత పాలకవర్గం భారీ అక్రమాలకు పాల్పడిందని, ఆధారాలతో పోలీసులకు ఫిర్యాదు చేస్తామని ముస్లిం పెద్దలు మీడియా సమావేశంలో వెల్లడించారు.
Podili: పొదిలి వక్ఫ్ ఆస్తులపై దుమారం: ముస్లిం పెద్దల తీవ్ర ఆరోపణలు
పొదిలి: మార్కాపురం జిల్లా పొదిలి వక్ఫ్ బోర్డు ఆస్తుల వ్యవహారం రోజురోజుకూ వివాదాస్పదంగా మారుతోంది. గత పాలకవర్గం ఎలాంటి అవినీతికి పాల్పడలేదని చెబుతుండగా, అందుకు భిన్నంగా ముస్లిం పెద్దలు పలు తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ మేరకు మంగళవారం పొదిలిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు.
గత పాలకవర్గం హయాంలో వక్ఫ్ బోర్డు ఆస్తుల ఆదాయం పెరిగినప్పటికీ, మసీదు అభివృద్ధికి తగిన స్థాయిలో నిధులు ఖర్చు చేయలేదని వారు ఆరోపించారు. 2017 నుంచి వక్ఫ్ భూముల ఆక్రమణలకు సంబంధించి పలు ఘటనలు చోటుచేసుకున్నాయని పేర్కొన్నారు.
వక్ఫ్ బోర్డు కమిటీకి చెందిన ట్రెజరర్ అక్రమంగా రశీదులు ఇచ్చారని, సుమారు రెండు ఎకరాల వక్ఫ్ భూమిలో అక్రమ వెంచర్ ఏర్పాటు చేసినట్లు ఆరోపించారు. అదేవిధంగా బినామీల పేర్లతో కాటా బ్రిడ్జి, బ్రిక్స్ తదితర కార్యకలాపాలు నిర్వహిస్తూ అక్రమంగా సంపాదనకు పాల్పడ్డారని ఆరోపణలు చేశారు.
కమిటీ సభ్యుడు పాపారావు వక్ఫ్ బోర్డు స్థలంలో తొమ్మిది గదులు నిర్మించారని, పీర్ల మాన్యం ప్రాంతంలో శాశ్వత కట్టడాలు నిర్మిస్తున్న సమయంలో ఎందుకు ప్రశ్నించలేదని వారు నిలదీశారు. గత అధ్యక్షుడి సుదీర్ఘ 19 ఏళ్ల పదవీకాలంలో వక్ఫ్ ఆస్తుల నిర్వహణపై అనేక అనుమానాలు ఉన్నాయని పేర్కొన్నారు.
వక్ఫ్ బోర్డు ఆస్తుల విషయంలో తాము ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని చెబుతున్న వారు, తాము అడిగే ప్రశ్నలకు ఖురాన్‌పై ప్రమాణం చేసి సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉంటే తాము కూడా సిద్ధమేనని ముస్లిం పెద్దలు అన్నారు.
వక్ఫ్ బోర్డుకు సంవత్సరానికి సుమారు రూ.20 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు ఆదాయం వస్తున్నప్పటికీ, మసీదు కోసం కేవలం రూ.60 వేల వరకు మాత్రమే ఖర్చు చేశారని, మిగిలిన మొత్తాన్ని తమ అనుచరులు పంచుకున్నారని ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలకు సంబంధించిన పూర్తి ఆధారాలను త్వరలో పోలీసులకు అందజేసి ఫిర్యాదు చేయడంతో పాటు న్యాయపోరాటం చేస్తామని వారు తెలిపారు.
వక్ఫ్ బోర్డు ఆస్తులపై శాటిలైట్ మ్యాప్‌లు సహా తమ వద్ద ఉన్న ఆధారాలను బయటపెడతామని ముస్లిం పెద్దలు పేర్కొన్నారు. ఈ ఆరోపణలపై సంబంధిత మాజీ పాలకవర్గం వివరణ ఇవ్వాల్సి ఉంది.
ఈ విలేకరుల సమావేశంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు ముల్లా ఖుద్దూస్, ముస్లిం పెద్ద షరీఫ్ తదితరులు పాల్గొని మాట్లాడారు.




