Podili: పొదిలిలో విలేఖరి సుబ్బారెడ్డిపై దాడిని ఖండిస్తూ జర్నలిస్టుల నిరసన!

Podili: నంద్యాల జిల్లా ఆత్మకూరులో సాక్షి విలేఖరి సుబ్బారెడ్డిపై జరిగిన దాడిని ఖండిస్తూ పొదిలి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నిరసన. తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేత.

MADARVALI, MARKAPURAM
Published on: 31 Oct 2026 6:55 PM IST
Podili
X

Podili: పొదిలిలో విలేఖరి సుబ్బారెడ్డిపై దాడిని ఖండిస్తూ జర్నలిస్టుల నిరసన!

పొదిలి: నంద్యాల జిల్లా ఆత్మకూరులో సాక్షి విలేఖరి సుబ్బారెడ్డిపై జరిగిన దాడిని ఖండిస్తూ పొదిలి వర్కింగ్ జర్నలిస్ట్స్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో శుక్రవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. విధి నిర్వహణలో భాగంగా న్యూస్ కవర్ చేస్తున్న సమయంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థికి సంబంధించిన వార్తను కవర్ చేశారనే కారణంతో కొందరు వ్యక్తులు కక్షపూరితంగా తన ఇంటికి వెళ్లి మారణాయుధాలతో దాడి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటనలో సుబ్బారెడ్డి తీవ్రంగా గాయపడినట్లు జర్నలిస్టులు తెలిపారు.

ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తూ పొదిలి వర్కింగ్ జర్నలిస్ట్స్ ప్రెస్ క్లబ్ ప్రతినిధులు తహసీల్దార్ కృష్ణారెడ్డికి వినతిపత్రం అందజేశారు. జర్నలిస్టులకు విధి నిర్వహణలో రక్షణ కల్పించాలని, దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.

అనంతరం తహసీల్దార్ కార్యాలయం ఎదుట జర్నలిస్టులు నిరసన చేపట్టి ‘‘విలేఖరులకు రక్షణ కల్పించాలి.. విలేఖరుల ఐక్యత వర్ధిల్లాలి’’ అంటూ నినాదాలు చేశారు. ప్రింట్, ఎలక్ట్రానిక్, వెబ్ మీడియాకు చెందిన పలువురు జర్నలిస్టులు ఈ నిరసనలో పాల్గొని తమ ఆవేదనను వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా జర్నలిస్టులు మాట్లాడుతూ.. ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషిస్తున్న విలేఖరులపై దాడులు జరగడం ఆందోళనకరమన్నారు. విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్టులకు పూర్తి రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని పేర్కొన్నారు. ఆత్మకూరులో సుబ్బారెడ్డిపై జరిగిన దాడిపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షులు చప్పిడి శ్రీనివాసులు, సీనియర్ జర్నలిస్టులు వడ్డే వేణు, మువ్వా వెంకటేశ్వరరెడ్డి, నర్రా వెంకటేశ్వరరెడ్డి, మందగిరి వెంకటేష్ యాదవ్, మస్తాన్, శివాజీ, బాజీ, ప్రశాంత్, మాచర్ల, అశోక్ బండి తదితరులు పాల్గొన్నారు.

MADARVALI, MARKAPURAM

MADARVALI, MARKAPURAM