Podili: వక్ఫ్ బోర్డు కమిటీపై ఆరోపణలు అవాస్తవం - మాజీ అధ్యక్షుడు షుకూర్

Podili: పొదిలి వక్ఫ్ బోర్డు కమిటీపై అవినీతి ఆరోపణలు అవాస్తవమన్న మాజీ అధ్యక్షుడు ముల్లా షుకూర్. కమిటీ సభ్యులకు ప్రాణహాని ఉందంటూ పోలీసులకు ఫిర్యాదు.

MADARVALI, MARKAPURAM
Published on: 5 Oct 2026 6:53 PM IST
Podili
X

Podili: వక్ఫ్ బోర్డు కమిటీపై ఆరోపణలు అవాస్తవం - మాజీ అధ్యక్షుడు షుకూర్

పొదిలి: పొదిలి ముస్లిం వక్ఫ్ బోర్డు కమిటీ పాలనలో ఎలాంటి అవినీతికి పాల్పడలేదని మాజీ వక్ఫ్ బోర్డు అధ్యక్షుడు ముల్లా షుకూర్ స్పష్టం చేశారు. కొంతమంది ఉద్దేశపూర్వకంగా కమిటీపై అవినీతి ఆరోపణలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. సోమవారం పొదిలిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

గతంలో కమిటీ బాధ్యతలు నిర్వహించిన కాలంలో జమ, ఖర్చుల వివరాలను పారదర్శకంగా నిర్వహించామని తెలిపారు. కమిటీ నిష్పక్షపాతంగా వ్యవహరించిందని, వక్ఫ్ బోర్డు ఆస్తులను పరిరక్షించడమే ప్రధాన ధ్యేయంగా పనిచేశామని పేర్కొన్నారు. కమిటీ రాజీనామా చేసి నాలుగు నెలలు గడిచినప్పటికీ, తమపై ఉద్దేశపూర్వకంగా ఆరోపణలు చేయడం సరికాదన్నారు.

ముస్లింలు పరమ పవిత్రంగా భావించే ఖురాన్‌పై ప్రమాణం చేసి తాము ఎలాంటి అవినీతికి పాల్పడలేదని చెప్పేందుకు సిద్ధంగా ఉన్నామని ముల్లా షుకూర్ తెలిపారు. తమపై ఆరోపణలు చేస్తున్న వారు కూడా ప్రమాణానికి సిద్ధంగా ఉన్నారా అని ప్రశ్నించారు.

వక్ఫ్ బోర్డుకు సంబంధించిన ఏదైనా సమాచారం కావాలంటే అధికారికంగా వక్ఫ్ బోర్డును సంప్రదించాలని సూచించారు. గతంలో పోలీసుల సూచన మేరకు చేపల మార్కెట్ నిర్వాహకులు కొంతమంది తాత్కాలిక రేకుల షెడ్లను నిర్మించుకున్నారని వివరించారు.

ప్రతి సంవత్సరం వక్ఫ్ బోర్డు ఇన్‌స్పెక్టర్ ఆధ్వర్యంలో వక్ఫ్ భూములకు వేలం నిర్వహించామని, ఆర్థిక లావాదేవీలకు సంబంధించి ఆడిటింగ్ కూడా చేయించామని తెలిపారు.

ఇటీవల కొంతమంది తమపై చేస్తున్న ఆరోపణలు, దాడులను ప్రోత్సహించే చర్యల నేపథ్యంలో కమిటీ సభ్యులకు ప్రాణహాని ఉందని, దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ముల్లా షుకూర్ తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో మాజీ వక్ఫ్ బోర్డు కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

MADARVALI, MARKAPURAM

MADARVALI, MARKAPURAM