Podili: 28 వార్డుల విభజనకు డ్రాఫ్ట్ మ్యాప్‌లు విడుదల
Podili: పొదిలి నగర పంచాయతీలో 28 వార్డుల విభజన డ్రాఫ్ట్ మ్యాప్‌లు విడుదలయ్యాయి. ఈ నెల 14లోపు అభ్యంతరాలు తెలపాలని కమిషనర్ తెలిపారు.
Podili: 28 వార్డుల విభజనకు డ్రాఫ్ట్ మ్యాప్‌లు విడుదల
పొదిలి: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పొదిలి నగర పంచాయతీలో వార్డుల పునర్విభజనకు సంబంధించిన డ్రాఫ్ట్ వార్డ్ డివిజన్ మ్యాప్‌లను నగర పంచాయతీ కమిషనర్ రామమోహనరావు విడుదల చేశారు. ప్రస్తుతం పొదిలి నగర పంచాయతీలో ఉన్న 20 వార్డులను ప్రభుత్వం అప్‌గ్రేడ్ చేస్తూ మొత్తం 28 వార్డులుగా విభజించాలని నిర్ణయించిన నేపథ్యంలో ఈ ప్రక్రియ చేపట్టారు.
ఇందులో భాగంగా గత రెండు రోజులుగా వార్డుల విభజనపై ప్రత్యేక దృష్టి సారించిన కమిషనర్ రామమోహనరావు, ఆయా ప్రాంతాల సర్వే నంబర్ల ఆధారంగా డ్రాఫ్ట్ వార్డు విభజనను రూపొందించినట్లు తెలిపారు. ఈ డ్రాఫ్ట్ మ్యాప్‌లను ప్రజల పరిశీలన కోసం నగర పంచాయతీతో పాటు సంబంధిత ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.
డ్రాఫ్ట్ వార్డు విభజనపై సాధారణ ప్రజలు, ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, ఆసక్తి గల వ్యక్తులు తమ అభ్యంతరాలు, సూచనలు, సలహాలను తెలియజేయవచ్చని అధికారులు తెలిపారు. ప్రకటన ప్రచురించిన తేదీ నుంచి ఏడు రోజులలోపు, అంటే ఈ నెల 14వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు, తమ అభ్యంతరాలను నగర పంచాయతీ కమిషనర్‌కు లిఖితపూర్వకంగా సమర్పించాలని కోరారు.
సర్వే నంబర్లతో ప్రజల్లో అయోమయం
అయితే ప్రస్తుతం వార్డుల విభజనను కేవలం సర్వే నంబర్ల ఆధారంగా చూపించడంతో సామాన్య ప్రజలు కొంత అయోమయానికి గురవుతున్న పరిస్థితి నెలకొంది. ఏ సర్వే నంబర్ ఏ వార్డులోకి వస్తుందో తెలుసుకోవడం సాధారణ ప్రజలకు అంత సులభంగా ఉండటం లేదని పలువురు అభిప్రాయపడుతున్నారు.
గతంలో పొదిలి నగర పంచాయతీ ఏర్పడిన సమయంలో 20 వార్డులను ఏర్పాటు చేసినప్పుడు ఆయా వార్డుల పరిధిలోకి వచ్చే ప్రాంతాలు, వీధులు, కాలనీల వివరాలను స్పష్టంగా పేర్కొన్న విధంగానే, ప్రస్తుతం ప్రతిపాదించిన 28 వార్డులకు కూడా ఆయా వార్డుల పరిధిలోకి వచ్చే ప్రాంతాలను సవివరంగా వెల్లడించాలని ప్రజలు కోరుతున్నారు.
ఉదాహరణకు 1వ వార్డులో ఏఏ వీధులు, కాలనీలు, ప్రాంతాలు ఉన్నాయి, 2వ వార్డులో ఏ ప్రాంతాలు ఉన్నాయి అనే వివరాలను స్పష్టంగా ప్రకటిస్తే ప్రజలు తమ ప్రాంతం ఏ వార్డులోకి వస్తుందో సులభంగా తెలుసుకునే అవకాశం ఉంటుందని పేర్కొంటున్నారు. దీంతో ప్రజలు తమకు సంబంధించిన వార్డు విభజనపై పూర్తి అవగాహనతో అభ్యంతరాలు, సూచనలు సమర్పించేందుకు అవకాశం ఉంటుందని చెబుతున్నారు.
కావున అధికారులు సర్వే నంబర్లతో పాటు ప్రతి వార్డులోని ప్రాంతాలు, వీధులు, కాలనీల వారీగా స్పష్టమైన వివరాలను కూడా ప్రజలకు అందుబాటులో ఉంచాలని పొదిలి ప్రజలు కోరుతున్నారు.




