Singarayakonda: జరుగుమల్లి బీసీ హాస్టల్‌లో అఘాయిత్యం!
Singarayakonda: జరుగుమల్లి బీసీ వసతి గృహంలో విద్యార్థినుల లైంగిక వేధింపుల ఘటన కలకలం. హాస్టల్‌లో భద్రత కరవు కావడంతో పిల్లలను ఇళ్లకు తీసుకెళ్తున్న తల్లిదండ్రులు.
Singarayakonda: జరుగుమల్లి బీసీ హాస్టల్‌లో అఘాయిత్యం!
Singarayakonda: విద్యార్థుల భద్రతపై అధికారుల నిర్లక్ష్యానికి ఇంతకంటే నిదర్శనం కావాలా..? హాస్టల్‌లో ఘోర ఘటన జరిగినా.. బాధ్యులపై చర్యలతో చేతులు దులుపుకున్నారంటూ తల్లిదండ్రుల ఆగ్రహం..!జరుగుమల్లి బీసీ వసతి గృహంలో ఇద్దరు విద్యార్థులను బయటకు పంపించి లైంగిక వేధింపులకు గురిచేసిన ఘటన కలకలం రేపుతోంది.
వార్డెన్, వంట మనిషిని అధికారులు సస్పెండ్ చేసినా తమ పిల్లల భద్రతపై తల్లిదండ్రులకు మాత్రం నమ్మకం కలగడం లేదు. దీంతో హాస్టల్‌కు వచ్చిన తల్లిదండ్రులు తమ పిల్లలను ఇళ్లకు తీసుకెళ్లిపోతున్నారు. విద్యార్థులకు భరోసా కల్పించాల్సిన అధికారులు.. తల్లిదండ్రులకు సమాధానం చెప్పేందుకు కనీస ఏర్పాట్లు కూడా చేయలేదని ఆగ్రహం వ్యక్తమవుతోంది. సిబ్బందిని సస్పెండ్ చేయడంతోనే బాధ్యత తీరిపోతుందా..? హాస్టల్‌లో మిగిలిన విద్యార్థుల భద్రతకు ఎవరు బాధ్యత వహిస్తారు..?
జరుగుమల్లి బీసీ వసతి గృహంలో ఉంటూ చదువుకుంటున్న ఇద్దరు బాలికలను వంట మనిషి శారద ఒంగోలులోని వెంకట్రావు వద్దకు పంపినట్లు ఆరోపణలు ఉన్నాయి. అక్కడ ఇద్దరు బాలికలను వెంకట్రావు బంధించగా.. ఓ బాలికపై లైంగిక దాడి జరిగినట్లు కేసు నమోదైంది. మరో బాలిక వెంకట్రావు చెర నుంచి బయటపడి బంధువులకు ఫోన్ చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారడంతో బీసీ సంక్షేమ శాఖతో పాటు పోలీసులు స్పందించారు.
కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇప్పటికే హాస్టల్ వార్డెన్, వంట మనిషిని అధికారులు సస్పెండ్ చేశారు. ఘటనపై పూర్తిస్థాయి విచారణ కోసం జిల్లా కలెక్టర్ రాజాబాబు త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసి పూర్తి నివేదికను అందించాలని ఆదేశించారు. అయితే ఇంతటి తీవ్ర ఘటన జరిగిన తర్వాత కూడా హాస్టల్‌లో ఉంటున్న మిగిలిన విద్యార్థుల భద్రతపై తల్లిదండ్రుల్లో ఆందోళన మాత్రం తగ్గడం లేదు.
రాష్ట్రవ్యాప్తంగా ఈ ఘటనపై చర్చ జరుగుతున్న సమయంలో హాస్టల్‌లోని విద్యార్థులకు భరోసా కల్పించేందుకు, వారి భద్రతకు ఎలాంటి ముప్పు లేదని చెప్పేందుకు అధికారులు ఎవరూ అక్కడ అందుబాటులో లేకపోవడంపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పిల్లలను చూసేందుకు హాస్టల్‌కు వచ్చిన తల్లిదండ్రులు.. అక్కడ తమ పిల్లల సంరక్షణను పర్యవేక్షించే అధికారి లేకపోవడంతో ఒక్కొక్కరుగా విద్యార్థులను ఇళ్లకు తీసుకెళ్లిపోతున్నారు.పిల్లల భద్రతపై మాకు నమ్మకం లేకపోతే ప్రభుత్వ హాస్టల్‌లో మా పిల్లలను ఎలా ఉంచాలంటూ తల్లిదండ్రులు అధికారులను ప్రశ్నిస్తున్నారు.
విద్యార్థులను తల్లిదండ్రులు ఇళ్లకు తీసుకెళ్తున్న విషయం తెలుసుకున్న స్థానిక ఎంఆర్‌ఓ హాస్టల్‌కు చేరుకునే సమయానికే చాలామంది విద్యార్థులు హాస్టల్‌ను ఖాళీ చేసి వెళ్లిపోయారు. దీంతో బయట ఉన్న కొంతమంది విద్యార్థులతో ఎంఆర్‌ఓ మాట్లాడి ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు. అయితే ఇంతటి ఘటన తర్వాత కూడా విద్యార్థుల భద్రతపై స్పష్టమైన భరోసా కల్పించలేకపోవడమే ఇప్పుడు తల్లిదండ్రుల ఆగ్రహానికి కారణంగా మారింది.




