Ongole: ఒంగోలు కార్పొరేషన్ ఎన్నికలకు టీడీపీ సమాయత్తం ఎమ్మెల్యే దామచర్ల!

Ongole: ఒంగోలు కార్పొరేషన్ ఎన్నికలకు టీడీపీ సిద్ధమైంది. అభ్యర్థుల ఎంపిక, ప్రచారం కోసం క్లస్టర్‌కు ముగ్గురితో సమన్వయ కమిటీలను ఎమ్మెల్యే దామచర్ల ప్రకటించారు.

Showry Doas, Staff Reporter -Ongole
Published on: 16 Oct 2026 6:24 PM IST
Ongole
X

Ongole: ఒంగోలు కార్పొరేషన్ ఎన్నికలకు టీడీపీ సమాయత్తం ఎమ్మెల్యే దామచర్ల!

ఒంగోలు: ఒంగోలు నగర కార్పొరేషన్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని తెలుగుదేశం పార్టీ ఎన్నికల కార్యాచరణను వేగవంతం చేసింది. ఇందులో భాగంగా డివిజన్ల వారీగా పార్టీ కార్యకలాపాలను సమన్వయం చేసేందుకు ప్రతి క్లస్టర్‌కు ముగ్గురు సభ్యులతో సమన్వయ కమిటీలను ఏర్పాటు చేసింది. ఎన్నికల్లో పార్టీ విజయమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తల మధ్య సమన్వయాన్ని పెంపొందించి, పటిష్టమైన కార్యాచరణతో ముందుకు సాగాలని ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.

ఒంగోలు నగరంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు పార్టీ ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయడం, నాయకులు, కార్యకర్తల మధ్య సమన్వయం పెంచడం వంటి అంశాలపై చర్చించారు.

అభ్యర్థుల ఎంపికలో సమన్వయ కమిటీల కీలక పాత్ర

డివిజన్ల వారీగా పార్టీ పరిస్థితులను సమీక్షించి, కూటమి పార్టీల నాయకులు, స్థానిక నాయకులు, కార్యకర్తల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని ఎన్నికల ప్రక్రియను సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లాలని సమన్వయ కమిటీలకు సూచించారు. కార్పొరేటర్ అభ్యర్థుల ఎంపికలో సమన్వయం చేయడంతో పాటు, ఆయా డివిజన్లలో ప్రజాదరణ కలిగిన నాయకుల అభిప్రాయాలను తెలుసుకొని, పార్టీ విజయావకాశాలను అంచనా వేయాలని తెలిపారు.

అసంతృప్తులను బుజ్జగించి.. పార్టీ ఐక్యతకు ప్రాధాన్యం

పార్టీ తరఫున టికెట్ ఆశించి అవకాశం లభించని నాయకులు, ఇతర ఆశావహులతో సమన్వయ కమిటీ సభ్యులు మాట్లాడి వారిని బుజ్జగించాలని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు సూచించారు. ప్రతి ఒక్కరినీ పార్టీ ఐక్యతలో భాగస్వాములను చేసి, సమష్టిగా పనిచేసేలా చూడాలని స్పష్టం చేశారు. వ్యక్తిగత అభిప్రాయ భేదాలకు తావివ్వకుండా పార్టీ ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇవ్వాలని, ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా అందరూ కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు.

ప్రచార ప్రణాళికలపైనా ప్రత్యేక దృష్టి

ఎన్నికల ప్రచార కార్యక్రమాలను సమన్వయ కమిటీలు పర్యవేక్షించనున్నాయి. డివిజన్ల వారీగా ప్రచార ప్రణాళికలు రూపొందించడం, నాయకులు, కార్యకర్తల భాగస్వామ్యాన్ని పెంచడం, ప్రజల్లోకి పార్టీ విధానాలు, ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను తీసుకెళ్లడంపై ప్రత్యేక దృష్టి సారించనున్నాయి.

క్రమశిక్షణ, ఐక్యత, సమష్టి కృషితో కార్పొరేషన్ ఎన్నికలను సమర్థవంతంగా ఎదుర్కోవాలని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు పార్టీ నాయకులు, కార్యకర్తలకు సూచించారు. ఎన్నికల కార్యాచరణలో ప్రతి ఒక్కరూ తమ బాధ్యతలను చిత్తశుద్ధితో నిర్వహిస్తూ తెలుగుదేశం పార్టీ విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.

Showry Doas, Staff Reporter -Ongole

Showry Doas, Staff Reporter -Ongole

రెండు దశాబ్దాలకు చేరువగా (16 ఏళ్లు) క్షేత్రస్థాయి అనుభవంతో, ఒంగోలు మరియు ప్రకాశం జిల్లా రాజకీయ, సామాజిక పరిణామాలపై నిశిత పరిశీలన కలిగిన ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.