Ongole: ఒంగోలులో హోరాహోరీగా టీడీపీ మేయర్ అభ్యర్థి శ్రీశిల్ప ఎన్నికల ప్రచారం!

Ongole: ఒంగోలు నగరంలోని పలు డివిజన్లలో విస్తృతంగా టీడీపీ మేయర్ అభ్యర్థి నల్లమల్లి శ్రీశిల్ప ఎన్నికల ప్రచారం. ఇంటింటికీ వెళ్లి ఓటర్ల అభ్యర్థన.

Showry Doas, Staff Reporter -Ongole
Published on: 27 Oct 2026 3:59 PM IST
Ongole
X

Ongole: ఒంగోలులో హోరాహోరీగా టీడీపీ మేయర్ అభ్యర్థి శ్రీశిల్ప ఎన్నికల ప్రచారం!

Ongole: మహిళా పక్షపాత కూటమి ప్రభుత్వానికి మహిళలు అండగా నిలుస్తున్నారని, ప్రచారానికి వస్తున్న తమకు ఇంటి బిడ్డలా ఆదరాభిమానాలు చూపిస్తున్నారని ఒంగోలు నగర టీడీపీ మేయర్ అభ్యర్థి నల్లమల్లి శ్రీశిల్ప అన్నారు. నగర అభివృద్ధిని కొనసాగించేందుకు ప్రజలు కూటమి అభ్యర్థులకు మద్దతుగా నిలవాలని ఆమె విజ్ఞప్తి చేశారు.

ఒంగోలు నగరంలోని 25వ, 37వ, 36వ డివిజన్ల పరిధిలో మంగళవారం ఉదయం శ్రీశిల్ప విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ కుమార్తె తనుజ లక్ష్మితో కలిసి హౌసింగ్ బోర్డు కాలనీ, సీతారాంపురం, రాజా పానగల్ రోడ్డు తదితర ప్రాంతాల్లో పర్యటించారు. ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలుసుకుంటూ, కూటమి అభ్యర్థులను గెలిపించాలని అభ్యర్థించారు.

మహిళల ఆత్మీయ స్వాగతం

ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయా ప్రాంతాలకు చేరుకున్న శ్రీశిల్పకు మహిళలు, స్థానిక ప్రజలు ఆత్మీయ స్వాగతం పలికారు. హారతులు ఇచ్చి తమ అభిమానాన్ని చాటుకున్నారు. మహిళలతో, స్థానిక ప్రజలతో మమేకమైన ఆమె వారి ఆదరాభిమానాలను స్వీకరించారు. ఈ సందర్భంగా మహిళా పక్షపాత కూటమి ప్రభుత్వానికి మహిళల మద్దతు ఉందని శ్రీశిల్ప పేర్కొన్నారు.

నగర అభివృద్ధికి కూటమి అభ్యర్థులను గెలిపించండి

ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఆధ్వర్యంలో నగరంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను శ్రీశిల్ప ప్రజలకు వివరించారు. నగరాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపించేందుకు కూటమి కృషి చేస్తోందని తెలిపారు. అభివృద్ధి కార్యక్రమాలు నిరంతరాయంగా కొనసాగాలంటే కార్పొరేషన్ ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటు వేసి తనను, కూటమి కార్పొరేటర్ అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లను కోరారు.

ప్రచారంలో పాల్గొన్న నాయకులు

25వ డివిజన్‌లో ఏకగ్రీవంగా ఎన్నికైన కార్పొరేటర్ అప్పాజీ, నగర అధ్యక్షుడు బండారు మదన్, క్లస్టర్ ఇన్‌చార్జ్ దాయినేని ధర్మ, మహిళా నాయకురాలు టి. అరుణ, నాలం నరసమ్మ, పసుపులేటి సునీత, నిడమానూరి పావని, బీరం అరుణ, డివిజన్ నాయకులు మారుతీరావు, రామారావు, షేక్ జహీర్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.

37వ డివిజన్‌లో కార్పొరేటర్ అభ్యర్థి అన్నవరపు ప్రియాంక, డివిజన్ అధ్యక్షుడు నత్తల కనకారావు, రమేష్ తదితరులు ప్రచారంలో పాల్గొన్నారు.

36వ డివిజన్‌లో కార్పొరేటర్ అభ్యర్థి పెద్దిశెట్టి వరలక్ష్మి, డివిజన్ అధ్యక్షుడు పెద్దిశెట్టి చంద్ర, క్లస్టర్ ఇన్‌చార్జ్ వెంకటేశ్వరరెడ్డి, పోతంశెట్టి దుర్గాప్రసాద్, గుంజి విజయలక్ష్మి, వనమాలి, రబ్బానీ, ఖాదర్ భాష, మాభాష, సలాం తదితరులు పాల్గొన్నారు.

ఈ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

Showry Doas, Staff Reporter -Ongole

Showry Doas, Staff Reporter -Ongole

రెండు దశాబ్దాలకు చేరువగా (16 ఏళ్లు) క్షేత్రస్థాయి అనుభవంతో, ఒంగోలు మరియు ప్రకాశం జిల్లా రాజకీయ, సామాజిక పరిణామాలపై నిశిత పరిశీలన కలిగిన ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.