Markapuram: పొదిలి జూనియర్ కళాశాలలో పోలింగ్ కేంద్రం, స్ట్రాంగ్ రూమ్‌ల తనిఖీ!

Markapuram: మార్కాపురం జిల్లా పొదిలి మున్సిపాలిటీ ఎన్నికల సన్నాహాల్లో భాగంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని పోలింగ్ కేంద్రం, స్ట్రాంగ్ రూమ్‌లను కలెక్టర్ ఎం. విజయ సునీత తనిఖీ చేశారు.

MADARVALI, MARKAPURAM
Published on: 13 Nov 2026 4:48 PM IST
Markapuram
X

Markapuram: పొదిలి జూనియర్ కళాశాలలో పోలింగ్ కేంద్రం, స్ట్రాంగ్ రూమ్‌ల తనిఖీ!

మార్కాపురం: మార్కాపురం జిల్లా, పొదిలి మునిసిపాలిటీ ఎన్నికలు–2026 సన్నాహాల్లో భాగంగా జిల్లా కలెక్టర్, మెజిస్ట్రేట్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ఎం. విజయ సునీత పొదిలి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఆకస్మికంగా సందర్శించి, అక్కడ ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రం, స్ట్రాంగ్ రూమ్‌లను క్షుణ్ణంగా పరిశీలించారు.

ఈ సందర్భంగా కళాశాల ప్రాంగణంలోని ఎన్నికల ఏర్పాట్లను సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించిన కలెక్టర్, ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా, ప్రశాంతంగా, సమర్థవంతంగా నిర్వహించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు పలు సూచనలు చేశారు. ముఖ్యంగా బ్యాలెట్ పెట్టెలను భద్రపరిచే స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. స్ట్రాంగ్ రూమ్‌లకు 24 గంటల పాటు నిరంతర పోలీస్ పహారా ఏర్పాటు చేయడంతో పాటు, సీసీటీవీ కెమెరాల ద్వారా నిరంతరం నిఘా ఉంచాలని స్పష్టం చేశారు. స్ట్రాంగ్ రూమ్‌ల సీలింగ్ ప్రక్రియలోనూ ఎన్నికల నిబంధనలను కచ్చితంగా పాటించాలని సూచించారు.

అదేవిధంగా పోలింగ్ కేంద్రానికి వచ్చే ఓటర్లకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఓటర్ల సౌకర్యార్థం మంచినీరు, నీడ, తగినంత లైటింగ్‌తో పాటు దివ్యాంగ ఓటర్ల కోసం ర్యాంప్‌లను ఏర్పాటు చేయాలని సూచించారు. ఎన్నికల నిర్వహణలో ప్రతి దశలోనూ అధికారులు పూర్తి సమన్వయంతో పనిచేస్తూ, ఎన్నికల నియమావళిని కచ్చితంగా అమలు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ తనిఖీ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ పి. శ్రీనివాసులు, మార్కాపురం జిల్లా ఎస్పీ పంకజ్ కుమార్ మీనా తదితర అధికారులు పాల్గొన్నారు.

MADARVALI, MARKAPURAM

MADARVALI, MARKAPURAM