Markapur: ఘనంగా స్వచ్ఛ ఆంధ్ర-2026 అవార్డుల ప్రదానోత్సవం
Markapur: మార్కాపురంలో స్వచ్ఛ ఆంధ్ర-2026 అవార్డుల ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. కలెక్టర్ విజయ సునీత, జేసీ శ్రీనివాసులు ప్రతిభావంతులకు పురస్కారాలు అందజేశారు.
Markapur: ఘనంగా స్వచ్ఛ ఆంధ్ర-2026 అవార్డుల ప్రదానోత్సవం
మార్కాపూర్: స్వచ్ఛత, పారిశుధ్య నిర్వహణలో విశేషంగా కృషి చేసిన వ్యక్తులు, సంస్థలు, సిబ్బందిని ప్రోత్సహించేందుకు స్వచ్ఛ ఆంధ్ర–2026 అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమాన్ని మార్కాపురం కంభం రోడ్డులోని శ్రీ వెంకటేశ్వర కల్యాణ మండపంలో శుక్రవారం నిర్వహించారు.
కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత, జాయింట్ కలెక్టర్ పి. శ్రీనివాసులు పాల్గొని స్వచ్ఛత, పారిశుధ్య రంగాల్లో విశేష ప్రతిభ కనబరిచిన వారికి అవార్డులు, ప్రశంసాపత్రాలను అందజేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ స్వచ్ఛత అనేది కేవలం ప్రభుత్వ శాఖల బాధ్యత మాత్రమే కాదని, ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా భావించి పరిసరాల పరిశుభ్రతకు కృషి చేయాలని సూచించారు. గ్రామాలు, పట్టణాల్లో పారిశుధ్య నిర్వహణను మరింత మెరుగుపరిచేందుకు ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరమన్నారు.
తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించడం, చెత్తను బహిరంగ ప్రదేశాల్లో వేయకుండా చూడటం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం వంటి అంశాలపై ప్రజల్లో నిరంతరం అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు.
స్వచ్ఛత కార్యక్రమాల్లో ప్రజలను భాగస్వాములను చేస్తూ, పరిశుభ్రమైన వాతావరణం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను వివరించాలని తెలిపారు. పారిశుధ్య కార్మికుల సేవలను గుర్తించి వారికి ప్రోత్సాహం అందించడం ద్వారా మరింత ఉత్సాహంతో పనిచేసేలా చేయవచ్చన్నారు.
స్వచ్ఛత, పారిశుధ్య నిర్వహణలో అత్యుత్తమ పనితీరు కనబరిచిన వారిని అవార్డులతో సత్కరించడం అభినందనీయమని పేర్కొన్నారు. జాయింట్ కలెక్టర్ పి. శ్రీనివాసులు మాట్లాడుతూ స్వచ్ఛ ఆంధ్ర లక్ష్యాలను సాధించేందుకు అధికారులు, ప్రజలు సమన్వయంతో పనిచేయాలని అన్నారు.
స్వచ్ఛత కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తూ ప్రతి గ్రామం, పట్టణం పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్డీవో వెంకట శివరామిరెడ్డి, ఇతర మున్సిపల్, పంచాయతీ రాజ్ అధికారులు, సిబ్బంది, స్థానిక సంస్థల ప్రతినిధులు, పారిశుధ్య సిబ్బంది, అవార్డు గ్రహీతలు తదితరులు పాల్గొన్నారు.




