Markapur: మాతృ మరణాలపై సమీక్షా సమావేశం నిర్వహించిన కలెక్టర్
Markapur: మార్కాపురంలో మాతృ మరణాలపై కలెక్టర్ విజయ సునీత సమీక్షా సమావేశం నిర్వహించారు. గర్భిణులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులకు సూచించారు.
Markapur: మాతృ మరణాలపై సమీక్షా సమావేశం నిర్వహించిన కలెక్టర్
మార్కాపురం: జిల్లాలో ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు సంభవించిన మాతృ మరణాలపై జిల్లా కలెక్టర్ విజయ సునీత ఆధ్వర్యంలో గురువారం సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలో మాతృ మరణాలకు దారితీసిన పరిస్థితులు, కారణాలు, వైద్య సేవల సమయంలో ఎదురైన సమస్యలు, తీసుకున్న చర్యలపై అధికారులు సమగ్రంగా చర్చించారు.
సమావేశంలో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డా. మనస్సే, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డా. సుజన, ఐసీడీఎస్ పీడీ పద్మావతి, డీసీహెచ్‌ఎస్ నాగభూషణం, అనస్థీషియా వైద్య నిపుణురాలు డా. గౌతమి, గైనకాలజిస్ట్ డా. వసంత, 108 ప్రతినిధి వెంకటేష్‌తో పాటు మాతృ మరణాలు సంభవించిన మాచవరం, నంద్యాల రోడ్, గిద్దలూరు, యాచారం ప్రాంతాలకు చెందిన వైద్యులు, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.
అలాగే మాతృ మరణాలు సంభవించిన ఆసుపత్రులకు సంబంధించిన స్విమ్స్ తిరుపతి, అమిలియో హాస్పిటల్ కర్నూలు, ఎయిమ్స్ మంగళగిరి వైద్యులు కూడా సమీక్షలో పాల్గొని ఆయా కేసులకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ప్రతి మాతృ మరణాన్ని కేసు వారీగా పరిశీలిస్తూ, గర్భిణులకు అందిన వైద్య సేవలు, అత్యవసర పరిస్థితుల్లో తీసుకున్న చర్యలు, ఆసుపత్రికి తరలింపు విధానం తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు.
గర్భిణులు, బాలింతలకు మెరుగైన వైద్య సేవలు అందించడంతో పాటు ప్రమాదకర పరిస్థితులను ముందుగానే గుర్తించి సకాలంలో చికిత్స అందించడం ద్వారా మాతృ మరణాలను తగ్గించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. క్షేత్రస్థాయిలో వైద్య, ఆరోగ్య సిబ్బంది మరింత అప్రమత్తంగా పనిచేసి గర్భిణుల ఆరోగ్యంపై నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని సమావేశంలో చర్చించారు.




