Kothapatnam: కొత్తపట్నం మత్స్యకారులకు సీఎం ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలి

Kothapatnam: ప్రకాశం జిల్లా కే.పల్లిపాలెం బీచ్ అగ్నిప్రమాద బాధిత మత్స్యకారులను మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ పరామర్శించి ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని కోరారు.

Showry Doas, Staff Reporter -Ongole
Published on: 20 Nov 2026 8:12 PM IST
Kothapatnam
X

Kothapatnam: కొత్తపట్నం మత్స్యకారులకు సీఎం ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలి

కొత్తపట్నం: ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలం కే.పల్లిపాలెం బీచ్ వద్ద ఈ నెల 17వ తేదీ అర్ధరాత్రి జరిగిన భారీ అగ్నిప్రమాదంలో నష్టపోయిన మత్స్యకారులకు ముఖ్యమంత్రి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని మాజీ మత్స్యశాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ కోరారు. శుక్రవారం ఆయన అగ్నిప్రమాదం జరిగిన ప్రాంతాన్ని సందర్శించి, బాధిత మత్స్యకారులతో మాట్లాడి ప్రమాదానికి సంబంధించిన వివరాలు, వారి నష్టాలను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా మోపిదేవి వెంకటరమణ మాట్లాడుతూ.. అగ్నిప్రమాదంలో సుమారు 300 మంది మత్స్యకారులకు చెందిన వలలు పూర్తిగా దగ్ధమయ్యాయని, వీటి వల్ల సుమారు రూ.11 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేసినట్లు తెలిపారు. వలలు కోల్పోయిన మత్స్యకారులు తిరిగి వాటిని తయారు చేసుకునేందుకు కనీసం మూడు నెలల సమయం పడుతుందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్రకటించిన మూడు నెలలపాటు నెలకు రూ.20 వేల తాత్కాలిక ఆర్థిక సాయం బాధితులకు కొంత ఊరటనిచ్చినా, జరిగిన భారీ నష్టాన్ని పూడ్చేందుకు ప్రత్యేక ప్యాకేజీ అవసరమని అన్నారు.

ఈ ఘటనను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి మత్స్యకారులకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించేలా తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. స్థానిక ఎమ్మెల్యే, మత్స్యశాఖ మంత్రి, మంత్రి రవీంద్రతో మాట్లాడి బాధితుల పరిస్థితిని వివరిస్తానన్నారు. అదేవిధంగా అసిస్ట్, రోటరీ వంటి స్వచ్ఛంద సంస్థల ద్వారా బాధితులకు సహాయం అందించేలా ఆయా సంస్థల ప్రతినిధులతో స్వయంగా మాట్లాడినట్లు వెల్లడించారు.

రాష్ట్రంలో ఇంత పెద్ద స్థాయిలో మత్స్యకారుల వలలు అగ్నిప్రమాదంలో దగ్ధం కావడం అరుదైన ఘటన అని, దీనివల్ల వందలాది కుటుంబాల జీవనోపాధి దెబ్బతిన్నదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం మానవతా దృక్పథంతో స్పందించి బాధితులకు తగిన న్యాయం చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో మత్స్యకారుల సొసైటీ అధ్యక్షుడు గొల్లపోతు పేరయ్య, వాయిల మోహన్‌రావు, స్థానిక నాయకులు ప్రకాష్, చాపల జాలరాం, చాపల వెంకటేశ్వర్లు, విక్కీ, కొండూరి తిరుపతిరావు, గ్రామ ప్రజలు, అగ్నిప్రమాద బాధిత మత్స్యకారులు పాల్గొన్నారు.

Showry Doas, Staff Reporter -Ongole

Showry Doas, Staff Reporter -Ongole

రెండు దశాబ్దాలకు చేరువగా (16 ఏళ్లు) క్షేత్రస్థాయి అనుభవంతో, ఒంగోలు మరియు ప్రకాశం జిల్లా రాజకీయ, సామాజిక పరిణామాలపై నిశిత పరిశీలన కలిగిన ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.