Markapuram: వద్దిమడుగు పాఠశాలలో ఘనంగా ముందస్తు బాలల దినోత్సవ వేడుకలు!
Markapuram: మార్కాపురం జిల్లా కొనకనమిట్ల మండలం వద్దిమడుగు పాఠశాలలో ముందస్తు బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఉత్తమ పురస్కారాలు అందించారు.
Markapuram: వద్దిమడుగు పాఠశాలలో ఘనంగా ముందస్తు బాలల దినోత్సవ వేడుకలు!
మార్కాపురం: మార్కాపురం జిల్లా, కొనకనమిట్ల మండలం: మండల పరిధిలోని వద్దిమడుగు మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో ముందస్తు బాలల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులకు బాలల దినోత్సవ ప్రాముఖ్యతను, భారత తొలి ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ జీవిత విశేషాలను వివరించారు.
పిల్లలంటే నెహ్రూకు ఎంతో ఇష్టమని, అందుకే ఆయన జన్మదినమైన నవంబర్ 14వ తేదీని దేశవ్యాప్తంగా బాలల దినోత్సవంగా జరుపుకుంటున్నామని ఉపాధ్యాయులు తెలిపారు. దేశ తొలి ప్రధానమంత్రిగా నెహ్రూ భారతదేశ అభివృద్ధికి విశేష కృషి చేశారని పేర్కొన్నారు.
దేశంలో పంచవర్ష ప్రణాళికల అమలుకు శ్రీకారం చుట్టడంతో పాటు, భారీ ప్రాజెక్టులను ఆధునిక దేవాలయాలుగా అభివర్ణించి దేశ అభివృద్ధికి బాటలు వేశారని వివరించారు. సుదీర్ఘకాలం ప్రధానమంత్రిగా సేవలందించిన ఆయన, అంతర్జాతీయ స్థాయిలో శాంతి, సహకారం, స్నేహ సంబంధాల పెంపునకు కూడా విశేష కృషి చేశారని విద్యార్థులకు తెలియజేశారు.
ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ నేటి బాలలే రేపటి భావి భారత పౌరులని, విద్యార్థి దశ నుంచే క్రమశిక్షణ, పట్టుదల, విద్య పట్ల ఆసక్తి, మంచి నడవడిక అలవర్చుకోవాలని సూచించారు. చదువుతో పాటు వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచి ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆకాంక్షించారు.
అనంతరం విద్యా రంగంలో, ఇతర కార్యక్రమాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను గుర్తించి వారికి ఉత్తమ విద్యార్థి పురస్కారాలతో పాటు బహుమతులను అందజేశారు. విద్యార్థుల్లో ఉత్సాహాన్ని నింపడంతో పాటు మరింత ప్రతిభ కనబరిచేలా ప్రోత్సహించడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని ఉపాధ్యాయులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పద్మజ, నందిని, భార్గవి, మల్లయ్య తదితరులు పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.




