Kanigiri: కనిగిరిలో ఖాళీ బిందెలతో రోడ్డెక్కిన ప్రజలు!

Kanigiri: కనిగిరి మండలం ఎన్.గొల్లపల్లి దళిత కాలనీల్లో సాగర్ పైప్‌లైన్ ఉన్నా తాగునీరు ఇవ్వకపోవడంతో ఖాళీ బిందెలతో రోడ్డుపై ప్రజలు నిరసన తెలిపారు.

Guravayya, Kanigiri
Published on: 13 Oct 2026 6:37 PM IST
Kanigiri
X

Kanigiri: కనిగిరిలో ఖాళీ బిందెలతో రోడ్డెక్కిన ప్రజలు!

కనిగిరి: మండలంలోని ఎన్‌.గొల్లపల్లి దళిత కాలనీలకు చెందిన సుమారు 100 కుటుంబాలకు మంచినీటి సమస్య పరిష్కరించాలని కోరుతూ మంగళవారం సీఐటీయూ, కేవీపీఎస్‌, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ప్రజలు ఖాళీ బిందెలతో రోడ్డుపై నిరసన తెలిపారు. దీంతో కొంతసేపు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.

తమ కాలనీల గుండా సాగర్‌ పైప్‌లైన్‌ గ్రామంలోకి వెళ్తున్నప్పటికీ, తమకు కుళాయి కనెక్షన్లు ఇవ్వకపోవడంతో తాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేశారు. పలుమార్లు అధికారులకు విన్నవించినా సమస్య పరిష్కారం కాలేదని తెలిపారు.

ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా నాయకులు పి.సి. కేశవరావు మాట్లాడుతూ దళిత కాలనీల్లో కనీస మౌలిక వసతులు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి మంచినీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు.

ఈ కార్యక్రమంలో సీఐటీయూ మండల కన్వీనర్‌ పి. నరేంద్ర, కాలనీవాసులు అబ్రహం, రోశయ్య, వెలుగొండయ్య, గురవయ్య, నాని, బాలరాజు, మనోహర్‌, ఎలిషమ్మ, ప్రమీల, చిన్న అచ్చమ్మ, జయమ్మ తదితరులు పాల్గొన్నారు.

Guravayya, Kanigiri

Guravayya, Kanigiri