Kanigiri: రోజురోజుకూ సంచలనంగా మారుతున్న పాస్టర్ మనీ స్కాం

Kanigiri: కనిగిరిలో పాస్టర్ పురుషోత్తం డబుల్ మనీ స్కాం వ్యవహారం కలకలం రేపుతోంది. రూ.కోట్లలో వసూలు చేసిన డిపాజిట్లు, బాధితుల ఆవేదనపై ప్రత్యేక కథనం.

Guravayya, Kanigiri
Published on: 3 Oct 2026 7:23 PM IST
Kanigiri
X

Kanigiri: రోజురోజుకూ సంచలనంగా మారుతున్న పాస్టర్ మనీ స్కాం

కనిగిరి: కనిగిరిలో ఫాస్టర్ పురుషోత్తం మనీ స్కాం వ్యవహారం రోజురోజుకూ సంచలనంగా మారుతోంది. డబుల్ డబ్బులు ఇస్తామంటూ వందలాది మంది నుంచి కోట్ల రూపాయలను డిపాజిట్ల రూపంలో సేకరించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కనిగిరి మండలంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏజెంట్లను ఏర్పాటు చేసుకుని డిపాజిట్లు సేకరించినట్లు సమాచారం. తొలుత చిన్న మొత్తాల్లో డిపాజిట్లు చేయించుకుని, కొందరికి డబుల్ మొత్తాలు తిరిగి ఇచ్చారన్న ప్రచారంతో పెద్ద మొత్తాల్లో పెట్టుబడులు పెట్టేందుకు పలువురు ముందుకొచ్చినట్లు తెలుస్తోంది.

మర్రిపూడి మండలం వేమవరం గ్రామంలోనే సుమారు 200 మంది వరకు డిపాజిట్లు చేసినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. వీరిలో ఎక్కువ మంది మహిళలేనని, కుటుంబ సభ్యులకు తెలియకుండా డబ్బులు పెట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇల్లు నిర్మించుకునేందుకు దాచుకున్న డబ్బులను తనకు తెలియకుండా భార్య డిపాజిట్ చేసిందని వేమవరానికి చెందిన మాలకొండయ్య చెబుతున్నాడు.

వేమవరంలో పెద్దఎత్తున డిపాజిట్లు సేకరించడంలో హెబ్సీ అనే మహిళ కీలకంగా వ్యవహరించినట్లు స్థానికులు ఆరోపిస్తుండగా.. ప్రస్తుతం ఆమె గ్రామంలో లేదని సమాచారం. మరోవైపు పోలీసులకు ఫిర్యాదు చేస్తే డబ్బులు తిరిగి ఇవ్వనని, ఫిర్యాదు చేయకుండా ఉంటే బయటకు వచ్చిన తర్వాత డబ్బులు ఇస్తానని పురుషోత్తం చెప్పినట్లు కొంతమంది డిపాజిటర్లు ఆరోపిస్తున్నారు. దీంతో బాధితుల్లో కొందరు పోలీసులను ఆశ్రయించేందుకు భయపడుతున్నట్లు తెలుస్తోంది. ఏజెంట్లు కూడా ఫిర్యాదులు చేయకుండా అడ్డుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని పలు ప్రాంతాలతో పాటు బెంగళూరు నుంచి కూడా డిపాజిట్లు వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. మొత్తం రూ.30 కోట్ల నుంచి రూ.40 కోట్ల వరకు డిపాజిట్లు సేకరించినట్లు ఆరోపణలు ఉన్నప్పటికీ.. వాస్తవంగా ఎంత మొత్తం సేకరించారు, ఎంతమంది ఏజెంట్లు పనిచేశారు, ఏజెంట్లకు ఎంత కమీషన్ చెల్లించారు, ఎంతమందికి డబుల్ మొత్తం తిరిగి ఇచ్చారు, ఇంకా ఎంతమందికి డబ్బులు చెల్లించాల్సి ఉంది అనే అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది.

ఇదే సమయంలో కేసు సెటిల్‌మెంట్ కోసం కొంతమంది రాజకీయ నాయకులు పోలీసులపై ఒత్తిడి తెస్తున్నారన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఈ ఆరోపణల్లో వాస్తవమెంత..? డిపాజిట్ల వెనుక అసలు నెట్‌వర్క్ ఎంత పెద్దది..? డబ్బులు ఎక్కడికి వెళ్లాయి..? అన్నది పోలీసుల సమగ్ర దర్యాప్తులో తేలాల్సి ఉంది.

Guravayya, Kanigiri

Guravayya, Kanigiri