Kanigiri: కనిగిరిలో రెట్టింపు నగదు స్కాం బట్టబయలు: ఆరుగురు అరెస్ట్

Kanigiri: కనిగిరిలో రెట్టింపు నగదు పేరుతో ప్రజలను మోసగించిన ఆరుగురు సభ్యుల ముఠాను అరెస్ట్ చేసి రూ.44.98 లక్షల ఆస్తులు, నగదును సీజ్ చేసినట్లు డీఎస్పీ శ్రీధర్ తెలిపారు.

Guravayya, Kanigiri
Published on: 4 Oct 2026 9:39 PM IST
Kanigiri
X

Kanigiri: కనిగిరిలో రెట్టింపు నగదు స్కాం బట్టబయలు: ఆరుగురు అరెస్ట్

మార్కాపురం జిల్లా, కనిగిరి: రూ.1,000 డిపాజిట్ చేస్తే రూ.2,000గా రెట్టింపు చేసి ఇస్తామంటూ ప్రజలను నమ్మించి నగదు వసూలు చేసిన కేసులో ఆరుగురిని అరెస్ట్ చేసినట్లు కనిగిరి ఇన్‌చార్జి డీఎస్పీ పి.శ్రీధర్ తెలిపారు. కనిగిరి పోలీస్‌స్టేషన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు.

‘వేద హోసన్నకు కృప సంస్థ’ పేరుతో ఎలాంటి అనుమతులు లేకుండా ప్రజల నుంచి నగదు డిపాజిట్లు సేకరించినట్లు పోలీసులు తెలిపారు. మరిపూడి మండలం వేమవరం గ్రామానికి చెందిన గోదే శ్రీనివాసులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు డీఎస్పీ వెల్లడించారు.

దర్యాప్తులో భాగంగా పురుషోత్తం, సుకుమార్, నవీన్, దానియేలు, నిర్మల, కాంతమ్మలను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. నిందితుల నుంచి రూ.13.28 లక్షల నగదుతో పాటు ఖాళీ రసీదులు, ఎలక్ట్రానిక్ జిరాక్స్ మిషన్, సర్టిఫికెట్ కార్డులు, ఒక కారును స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.

అలాగే నిందితుల బ్యాంకు ఖాతాల్లో ఉన్న రూ.31.70 లక్షలను సీజ్ చేసేందుకు చర్యలు చేపట్టామని ఇన్‌చార్జి డీఎస్పీ పి.శ్రీధర్ తెలిపారు. ఇందుకు సంబంధించి ఆయా బ్యాంకులకు సిఫారసు లేఖలు పంపనున్నట్లు వెల్లడించారు.

కనిగిరి పోలీస్‌స్టేషన్‌లో జరిగిన ఈ సమావేశంలో సీఐ ఉప్పు శ్రీనివాసులు, ఎస్సైలు, ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.

Guravayya, Kanigiri

Guravayya, Kanigiri