Kanigiri: రెట్టింపు నగదు స్కాం బాధితులకు న్యాయం చేయాలి

Kanigiri: కనిగిరిలో రెట్టింపు నగదు స్కాం బాధితులను ఆదుకోవాలని సీపీఎం డిమాండ్ చేసింది. పాస్టర్ మోసంపై సమగ్ర విచారణ జరిపి న్యాయం చేయాలని కోరారు.

Guravayya, Kanigiri
Published on: 3 Oct 2026 6:34 PM IST
Kanigiri
X

Kanigiri: రెట్టింపు నగదు స్కాం బాధితులకు న్యాయం చేయాలి

కనిగిరి: కనిగిరి పట్టణంలోని సుందరయ్య భవనంలో శనివారం సాయంత్రం సిపిఎం కనిగిరి పట్టణ కార్యదర్శి పిసి కేశవరావు రెట్టింపు నగదు స్కాం పై మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కనిగిరి పట్టణంలోని గార్లపేట రోడ్డులో పాస్టర్ పురుషోత్తం వేద హోసన్న కృప సంస్థ పేరుతో రెట్టింపు నగదు ఆశ చూపి ప్రజల నుంచి కోట్లు కొల్లగొట్టడం దారుణం అన్నారు.

లక్షకు లక్ష, కోటికి కోటి అంటూ ఏజెంట్ల ద్వారా ప్రచారం చేయించి ఘరానా మోసానికి పాల్పడి ప్రజలకు పంగనామం పెట్టడం జరిగిందన్నారు. ఆశకపోయిన అమాయకపు ప్రజలు పాస్టర్ మోసాన్ని గ్రహించలేక అప్పులు చేసి, సొమ్ములు కుదువ పెట్టి, విక్రయించి మరి స్కామ్ లో పెట్టుబడి పెట్టి కూరుకుపోవడం బాధాకరమన్నారు. రెండు సంవత్సరాలుగా ఈ తంతు సాగుతూ మూడు రోజుల క్రితం బట్టబయలు కావటం జరిగిందన్నారు.

పాస్టర్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారన్నారు. మోసానికి పాల్పడిన పాస్టర్ పై చర్యలు చేపట్టాలని బాధితులు ఫిర్యాదు చేయడానికి వెనుకాడటం వారి అమాయకత్వాన్ని తెలియజేస్తుందన్నారు. జిల్లా ఉన్నతాధికారులు పోలీసు దర్యాప్తు వేగవంతం చేసి బాధితులకు న్యాయం జరిగేలా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.

విచారణ సమగ్రంగా జరగకపోతే బాధితులను కూడగట్టి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపట్టడం జరుగుతుందని బాధితులకు సిపిఎం, ప్రజా సంఘాల ఐక్యవేదిక అండగా నిలవడం జరుగుతుందని తెలిపారు. ఈ సమావేశంలో నాయకులు పి నరేంద్ర, ఏడుకొండలు, కే వెంకటమ్మ, శాంత కుమారి తదితరులు పాల్గొన్నారు.

Guravayya, Kanigiri

Guravayya, Kanigiri