Singarayakonda: సింగరాయకొండలో ఉద్రిక్తత: ఆదిమూలపు సురేష్ ఆందోళన
Singarayakonda: సింగరాయకొండలో వైసీపీ అభ్యర్థుల నామినేషన్ పత్రాలు చించేశారంటూ మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ పోలీసులతో వాగ్వాదానికి దిగి కేంద్రం వద్ద బైఠాయించారు.
Singarayakonda: సింగరాయకొండలో ఉద్రిక్తత: ఆదిమూలపు సురేష్ ఆందోళన
సింగరాయకొండ: ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీటీసీ నామినేషన్ల సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వైసీపీ అభ్యర్థులను నామినేషన్లు దాఖలు చేయకుండా అడ్డుకోవడంతో పాటు, వారి నామినేషన్ పత్రాలను చించివేశారన్న ఆరోపణలపై వైసీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ ఆదిమూలపు సురేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యకర్తలతో కలిసి నామినేషన్ కేంద్రం వద్ద ఆందోళనకు దిగారు.
పోలీసులు, రిటర్నింగ్ అధికారి సమక్షంలోనే టీడీపీ నాయకులు తమ పార్టీ అభ్యర్థులపై దాడికి పాల్పడి, నామినేషన్లు వేయకుండా అడ్డుకుంటున్నారని సురేష్ ఆరోపించారు. పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సింది పోయి, టీడీపీ నేతలకు సహకరిస్తున్నారని విమర్శించారు. నామినేషన్ ప్రక్రియలో తమ అభ్యర్థులకు అన్యాయం జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తమ పార్టీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసేంతవరకు నామినేషన్ కేంద్రం నుంచి కదిలేది లేదని ఆదిమూలపు సురేష్ స్పష్టం చేశారు. ఈ క్రమంలో పోలీసులతో ఆయన వాగ్వాదానికి దిగడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
దీంతో పోలీసులు సురేష్‌కు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అనంతరం అభ్యర్థులను మాత్రమే నామినేషన్ కేంద్రం లోపలికి అనుమతించారు. నామినేషన్ ప్రక్రియ సందర్భంగా చోటుచేసుకున్న పరిణామాలతో సింగరాయకొండలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. వైసీపీ నేతలు చేసిన ఆరోపణలపై అధికారుల స్పందన తెలియాల్సి ఉంది.




