Ongole: ఒంగోలులో ఆధునీకరించిన పీడీసీసీ బ్యాంకు ప్రారంభం
Ongole: సహకార రంగానికి పూర్వ వైభవం తేవడమే లక్ష్యమని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఒంగోలులో ఆధునీకరించిన పీడీసీసీ బ్యాంకు ప్రారంభోత్సవంలో స్పష్టం చేశారు.
Ongole: ఒంగోలులో ఆధునీకరించిన పీడీసీసీ బ్యాంకు ప్రారంభం
ఒంగోలు: సహకార రంగానికి పూర్వ వైభవం తీసుకురావడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర వ్యవసాయ, సహకార శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. ఒంగోలులో ఆధునీకరించిన ప్రకాశం జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (PDCCB) ప్రధాన కార్యాలయాన్ని మంగళవారం మంత్రి అచ్చెన్నాయుడు, రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి, ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దన్, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ముక్కు ఉగ్రనరసింహారెడ్డి తదితరులతో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. సహకార బ్యాంకులు రైతాంగానికి అండగా నిలవడంతో పాటు గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతంలో కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజన్‌కు అనుగుణంగా సహకార వ్యవస్థను పూర్తిగా ఆన్‌లైన్ పరిధిలోకి తీసుకువస్తున్నామని, వాణిజ్య బ్యాంకులకు దీటుగా సహకార బ్యాంకులను డిజిటలైజ్ చేసి పారదర్శక, వేగవంతమైన సేవలు అందిస్తున్నామని చెప్పారు.
గత ప్రభుత్వం సహకార రంగాన్ని నిర్లక్ష్యం చేసి అక్రమాలకు పాల్పడిందని మంత్రి ఆరోపించారు. గుంటూరు, విజయవాడ సహకార బ్యాంకుల్లో జరిగిన అవినీతిపై విచారణ కొనసాగుతోందని, బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి ప్రజలు, రైతులు దాచుకున్న సొమ్మును వంద శాతం రికవరీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
ఆర్థికంగా బలహీనపడిన సహకార బ్యాంకులను నష్టాల నుంచి గట్టెక్కించేందుకు ప్రభుత్వం ఆర్థిక, పరిపాలనా సహకారం అందిస్తుందని వెల్లడించారు. ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని, కరువు పరిస్థితులపై జిల్లాల నుంచి నివేదికలు తెప్పించుకుంటున్నామని చెప్పారు. అక్టోబర్ 1 నాటికి కరువు ప్రాంతాలు, కరువు మండలాలను ప్రకటించి రైతులకు బ్యాంకుల ద్వారా పూర్తిస్థాయిలో ఆర్థిక సహాయం అందించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
దివంగత దామచర్ల ఆంజనేయులు వర్ధంతి రోజునే ఆధునీకరించిన PDCC బ్యాంకు కార్యాలయాన్ని ప్రారంభించడం ఆనందంగా ఉందని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. రైతులు, గ్రామీణ ప్రజలు ఆధునిక సాంకేతికతతో అందుబాటులోకి వచ్చిన సహకార బ్యాంకింగ్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.




