Addanki: అద్దంకిలో పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్ పి. రాజాబాబు
Addanki: అద్దంకిలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కేంద్రాలు, డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని ప్రకాశం జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు శుక్రవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
Addanki: అద్దంకిలో పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్ పి. రాజాబాబు
ప్రకాశం జిల్లా, అద్దంకి పట్టణం: ప్రకాశం జిల్లాలో ప్రశాంతంగా, పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు తెలిపారు. శుక్రవారం అద్దంకిలో పర్యటించి మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చేస్తున్న ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఎన్నికల సామగ్రి డిస్ట్రిబ్యూషన్ సెంటరు కూడా ఇక్కడేఉండడంతో అధికారులకు పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు.
పోలింగ్ గదిలోకి ప్రవేశం, నిష్క్రమణ మార్గాలు వేరువేరుగా ఉండాలని ఎన్నికల అధికారులకు స్పష్టం చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి పూర్తిస్థాయిలో శిక్షణ ఇచ్చామన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తిస్థాయిలో పోలీసు సిబ్బందిని కూడా మోహరిస్తున్నామన్నారు. ప్రతి పోలింగ్ గదిలో సీసీటీవీల ద్వారా లైవ్ వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశామన్నారు.
దీనిని జిల్లాస్థాయి యంత్రాంగంతో పాటు రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికలు అత్యంత కీలకమైనవని, ఓటర్లందరూ తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని కలెక్టర్ ఈ సందర్భంగాపిలుపునిచ్చారు. కార్యక్రమంలో కలెక్టర్ వెంట మునిసిపల్ కమిషనర్ రవీంద్ర, తహసిల్దార్ చరణ్, ఎన్నికల అధికారులు ఉన్నారు.




