Markapuram: దుపాడు, మేడపి స్వర్ణ గ్రామ కార్యాలయాల్లో కలెక్టర్ తనిఖీ!

Markapuram: మార్కాపురం త్రిపురాంతకం మండలం దుపాడు, మేడపి స్వర్ణ గ్రామ కార్యాలయాల్లో కలెక్టర్ ఎం. విజయ సునీత ఆకస్మిక తనిఖీ.. అధికారులకు కీలక ఆదేశాలు.

MADARVALI, MARKAPURAM
Published on: 18 Sept 2026 3:25 PM IST
Markapuram
X

Markapuram: దుపాడు, మేడపి స్వర్ణ గ్రామ కార్యాలయాల్లో కలెక్టర్ తనిఖీ!

Markapuram: త్రిపురాంతకం మండల పరిధిలోని దుపాడు, మేడపి గ్రామపంచాయతీల ‘స్వర్ణ గ్రామ’ కార్యాలయాలను జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రభుత్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు, ప్రజలకు అందుతున్న సేవల తీరును క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు ఆమె ఈ తనిఖీ చేపట్టారు.

ఈ సందర్భంగా కార్యాలయాల్లోని సిబ్బంది హాజరు పట్టికలను కలెక్టర్ పరిశీలించారు. ఉద్యోగులు సమయపాలన పాటిస్తూ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి సేవలు అందించాలని ఆదేశించారు. ప్రభుత్వ సేవలపై ప్రజల్లో సానుకూల అభిప్రాయం మరింత పెరిగేలా అధికారులు, సిబ్బంది బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు.

పెన్షన్ల పంపిణీపై ప్రత్యేక దృష్టి

పెన్షన్ల దరఖాస్తులకు సెప్టెంబర్ 18 చివరి తేదీ కావడంతో అర్హులైన ప్రతి ఒక్కరి నుంచి దరఖాస్తులు స్వీకరించాలని కలెక్టర్ ఆదేశించారు. అర్హత ఉన్న లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్దేశిత సమయంలో పెన్షన్ల పంపిణీ పూర్తిచేయాలని సూచించారు. పెన్షన్ల డిజిటైజేషన్ ప్రక్రియను కూడా త్వరితగతిన పూర్తి చేయాలని సిబ్బందికి స్పష్టం చేశారు.

పారదర్శకంగా భూ సర్వేలు

గ్రామాల పరిధిలో జరుగుతున్న రీ-సర్వే ప్రక్రియను వేగవంతం చేయడంతో పాటు ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పారదర్శకంగా నిర్వహించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రజలకు సంబంధించిన భూ సమస్యలను ఎప్పటికప్పుడు పరిశీలించి పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

రైతులకు ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచాలి

రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలు కొరత లేకుండా సకాలంలో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. రైతులు ఇబ్బందులు పడకుండా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు.

పారిశుధ్యంపై నిరంతర పర్యవేక్షణ

గ్రామీణ ప్రాంతాల్లో పారిశుధ్య నిర్వహణ పక్కాగా ఉండాలని కలెక్టర్ స్పష్టం చేశారు. డ్రైనేజీలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయడంతో పాటు చెత్త సేకరణ సక్రమంగా చేపట్టాలని, దోమల నివారణకు అవసరమైన చర్యలు నిరంతరం కొనసాగించాలని ఆదేశించారు.

ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేస్తూ ప్రజలకు మెరుగైన, నాణ్యమైన సేవలు అందించాలని కలెక్టర్ ఎం. విజయ సునీత సూచించారు.

ఈ తనిఖీలో స్పెషల్ ఆఫీసర్ డీఎస్‌ఓ అంకయ్య, మండల స్థాయి అధికారులు, గ్రామ కార్యదర్శులు, స్వర్ణ గ్రామ కార్యాలయాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

MADARVALI, MARKAPURAM

MADARVALI, MARKAPURAM