Markapur: ‘స్వచ్ఛతా హీ సేవా’ను ప్రజా ఉద్యమంగా మార్చాలి: కలెక్టర్ ఎం. విజయ సునీత!

Markapur: ‘స్వచ్ఛతా హీ సేవా–2026’ను ప్రజా ఉద్యమంగా మార్చాలని కలెక్టర్ ఎం. విజయ సునీత అధికారులను ఆదేశించారు. పారిశుధ్య కార్మికుల ఆరోగ్య రక్షణకు పెద్దపీట వేయాలన్నారు.

MADARVALI, MARKAPURAM
Published on: 16 Sept 2026 10:59 PM IST
Markapur
X

Markapur: ‘స్వచ్ఛతా హీ సేవా’ను ప్రజా ఉద్యమంగా మార్చాలి: కలెక్టర్ ఎం. విజయ సునీత!

Markapur: జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత పరిశుభ్రత, ఆరోగ్యకరమైన వాతావరణం ప్రతి పౌరుడి హక్కు అని, జిల్లాను స్వచ్ఛతలో రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలిపేందుకు అధికారులు అంకితభావంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత అధికారులను ఆదేశించారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పిలుపు మేరకు నిర్వహించనున్న ‘స్వచ్ఛతా హీ సేవా–2026’ కార్యక్రమంపై ఆరోగ్య, పురపాలక, పంచాయతీరాజ్, మెప్మా, విద్యాశాఖల అధికారులతో బుధవారం కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో గుర్తించిన చెత్త పాయింట్లు, మురికి ప్రాంతాలను యుద్ధప్రాతిపదికన శుభ్రం చేసి, వాటిని అందమైన ప్రాంగణాలుగా తీర్చిదిద్దాలని సూచించారు. పాఠశాల విద్యార్థుల్లో పరిశుభ్రతపై అవగాహన పెంచేందుకు ‘స్వచ్ఛ పాఠశాల’ కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛతా జ్ఞాన్ యాత్రలు, వ్యర్థాల నిర్వహణ కేంద్రాల సందర్శనలు, వినూత్న కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు.

జిల్లాను పరిశుభ్రంగా ఉంచడంలో కీలకపాత్ర పోషిస్తున్న సఫాయిమిత్రలు, పారిశుధ్య కార్మికుల ఆరోగ్య భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ స్పష్టం చేశారు. వారికి ప్రత్యేక ఆరోగ్య పరీక్షల శిబిరాలు నిర్వహించడంతో పాటు రక్షణ పరికరాలు, పీపీఈ కిట్లు అందజేయాలని సూచించారు.

అలాగే ‘ఒక రోజు–ఒక గంట–అంతా కలిసి’ అనే నినాదంతో ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేసి భారీ శ్రమదాన కార్యక్రమాలను నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.

అన్ని శాఖల అధికారులు సమన్వయంతో కార్యాచరణ ప్రణాళిక రూపొందించి ‘స్వచ్ఛతా హీ సేవా’ కార్యక్రమాన్ని జిల్లాలో ప్రజా ఉద్యమంగా నిర్వహించి విజయవంతం చేయాలని కలెక్టర్ పేర్కొన్నారు.

సమావేశంలో జాయింట్ కలెక్టర్ పి. శ్రీనివాసులు, జిల్లా రెవెన్యూ అధికారి వెంకటశివరామి రెడ్డి, ఆరోగ్య, పురపాలక, పంచాయతీరాజ్, మెప్మా, విద్యాశాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.

MADARVALI, MARKAPURAM

MADARVALI, MARKAPURAM